సంగీతంలో సాహిత్య సౌరభం
" సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః కుచ ద్వయం
ఏక మాపాత మధురం యేక మాలోచ నామృతం"
అని విజ్ఙుల యభిప్రాయం. సంగీత సాహిత్యాలు వాగ్దేవత చదువులతల్లి సరస్వతి కి స్తన ద్వయము వంటివట. అందొకటి సంగీతము .ఆపాత మధురమట! చెవుల బడినంతనే మనస్సును మైమరపించు శక్తి గలదని దాని భావము. మరియొకటి సాహిత్యం యిది యాలోచనామృతమట! విన్నతదుపరి లేదా చదివిని తదుపరి యాలోచించిన మీదట గాని దానిస్వారస్యము బోధపడదు. అయినను అది యమృత తుల్యము. ఈరెండును సరస్వతికి స్తన ద్వయమట! యేమి వేరుగా పోలిక చెప్పనగునుగదా? స్తన ములతోనే యేలపోలిక యను ప్రశ్న మనలో యుదయిపక మానదు.
వక్షోజములు సప్రయోజనములైనవి. అవి పాలిండ్లు. జీవులకు జీవనదములు. యగుట నాజగన్మాత స్తన ములతో బోలిక జెప్పవలసి వచ్చినది.తల్లి బిడ్డకు స్తన్యమిచ్చి సాకురీతిగా , నాజగన్మాతయు బిడ్డలమైన మనల నందరను విజ్ఙానస్తన్య మొసగి పెంచుట యోగ్య మను తలంపున నెవరో యీపోలికను జక్కగా జెప్పినారు. ఇది యుక్తి యుక్త మనుటలో సందేహము లేదు. యివిరెండును లలిత కళలు . రెంటిలో సంగీతము మిగుల మార్దవ మైనది. రెండవది కొంచెము సులభగ్రాహ్యముగాదు దానికి కొంత పరిశ్రమ యవసరము. అయినను వీని రెంటికి వాగ్గేయ కారులు చక్కని మైత్రిని గల్పించినారు. యివి పరస్ఫర సహకార కళలై లోకమున నేక ముఖముగా సాగుచు ప్రజా హృదయములకు మిగుల చేరువ యైనవి.
సంగీత మనేక విధములు. మనభారత దేశమున 1 కర్ణాటక 2 హిందుస్థానీ భేదములతో నిది రెండు రీతులుగా వర్ధిల్లుచున్నది. యిప్పుడు అది యవసరాను కూలముగా యనేక మార్పుల నొంది విశ్వరూపమును ధరించినది. మనవరకు కర్ణాటక హిందుస్థానీ భేదములను మాత్రమే పరిగణించుట యుక్తము. ప్రస్తుతము మనయధ్యనము కర్ణాటక సంగీత మందలి కృతులలో లేదాకీర్తనలలో సంగీతముతోబాటు విలసిల్లిన సాహిత్య స్వరూపము, దానియంద చందములు, దానియౌన్నత్యమును గురించిమాత్రమే నని తెలియగలరు.
కర్ణాటక సంగీతమును ప్రోది చేసిన వారుగా శ్రీ త్యాగరాజ స్వామి ,శ్రీముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్రి , ముఖ్యులు! వీరిని వాగ్గేయ కార త్రయముగా దక్షిణ భారతమున పరిగణించు చున్నారు. సశాస్త్రీయమైన సంగీతమునకు వీరు పెట్టినది పేరు. వీరు మువ్వురు రచనలలో భిన్న మార్గముల నవలంబించినారు. సాహిత్య మెటులైనను సంగీతము మాత్ర మొకటే! వీరే ఆగామి సంగీత విద్వాంసులకు మార్గ దర్శనము గావించినారు. వీరుగాక పెక్కురీ రంగమున ప్రసిధ్ధులై వెలసిన వారెందరోగలరు. తామర తంపరగా , పరస్సహ స్రముగా విస్తరిల్లిన యందరిని పేర్కొన జాలమి కేవలము త్యాగ రాజ స్వామి కృతులకు మాత్రమే యీయధ్యయనమును పరిమితము జేసి సంగీతము నందలి సాహిత్య పరిమళములను వివరించుటకు గడంగు చున్నాను. సహృదయులు. సంగీత ప్రియులు దీనిని సమాద రించి ప్రోత్సహింతురుగాక!
త్యాగరాజస్వామి వారి కృతులలో గణపతి ప్రార్ధనతో నీకార్యక్రమ మును ఆరంభింతము.
సౌరాష్ట్ర రాగం - ఆది తాళం
ప: శ్రీ గణ పతినీ సేవింప రారె - శ్రిత మానవు లారా! : శ్రీ :
అ: ప: వాగాధిపతి - సుపూజల గైకొని , బాగనటింపుచు వెడలిన : శ్రీ;
చ: పనస నారికేళాది జంబూ-ఫలముల నారగించీ -
ఘనతరంబుగను మహిపై పదముల- ఘల్లు ఘల్లన నుంచి
అనయమున హరు చరణ యుగములను -హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుని- వివిధగతుల థిత్తళంగు థకతోదోమని వెడలిన, :శ్రీ:
నేటి కితటి తో విరమింతము .త్యాగరాయ కృతుల స్వరూప స్వభావములను రేపు దెలిసి కొని, యాపై నీకృతికి గలసాహిత్యము నవలోకించి ముందు కేగుదముగాక! సెలవు!
No comments:
Post a Comment