Monday, 20 July 2015

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితారీతులు - బమ్మెఱ పోతన

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితారీతులు
బమ్మెఱ పోతన 
_____________
ఉ: క్షోణితలంబు నెన్నుదురు సోకగఁ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితా నత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్;
కవిత్రయానంతరము నిజమునకు శ్రీనాధుని స్మరింప వలసి యున్నను, యీవరకే యాతని జీవిత ప్రస్థానాధ్యనమును మనము పూర్తి చేసియుండుటచే ప్ర స్తుతము పోతన కవీంద్రుని కవితా మార్గములను బరిశీ లింపఁ గడంగి నాఁడను .
తెలుగున మహాభాగవత నిర్మాతగా పరమ భాగవత శ్రేష్ఠుని గాఁ బేరొందిన బమ్మెఱ పోతన వరంగల్ సమీపము నందలి బమ్మెర నివాసి. 14 శతాబ్ది చివరి వాడు. తల్లి లక్కమ తండ్రి కేసన. ఇతడు పండిత కవిగాడు. గురుముఖతః నెవ్వరి చెంతను విద్య నభ్య సించినవాఁడు గాడు. సరసీజాసను రాణి వాణి కరుణా ప్రసాద లబ్ధ కవితా వైభవముఁగలవాడు. యితని పాండిత్య మంతయు సహజమే కావుననే " సహజపాండిత్య బిరుద మీతనిని వరించినది. శ్రీరామ చంద్రుని పరమభక్తుఁడైన నితఁడు ఆస్వామి ప్రేరణమేరకు , సంస్కృత మున వేదవ్యాస విరచితమగు శ్రీ మన్మహా భాగవతమును దెనిఁగించి,యొంటిమిట్ట(ఏకశిలాపురము) నేటి యోరుగల్లు పట్టణమునగల కోదండ రామ స్వామికి యంకిత మొనరంచి తరించెను. ధనమునకగాని, యగ్రహారములకుగాని, బిరుదములకొఱకుగాని , పేరు ప్రఖ్యాతుల కొఱకుగాని యితడాసింపక ప్రలోభరహితుఁడై భగవదంకిత మొనరించి తరించెను. నాటికే గాదు, నేటికి గూడనిది విచిత్రమే!
పోతనకు సిరి సంపదలు లేవు. స్వల్పముగా వ్యవసాయ క్షేత్రము మాత్రము గలదు. అదియు మెట్ట భూమి వర్షాధారము. పండిన పండును. లేదా నిష్పలమే పంట . యిట్టిస్థితి లోఁగూడ చలింపక ,, క్షేత్రమునే నమ్ముకొని తనప్రయత్నమే ఫలసాయముగా వ్యవ సాయముఁ జేయుచు , నొకవంక నాగలిని, వేరొకఃవంక గంచమును కదలించుచు యతఁడొనరించిన కవితా, క్షేత్ర వ్యవసాయములు సఫలములై యతనిని కృతార్ధు నొనరించినవి. కన్నులముందు నిలచి వాణి కలమునకు సాయమై నిలువ కమ్మని కవిత తో నాధ్యత్మిక పరిమళములను పరుగులు పెట్టించెను. భాగవత కర్తృత్వమునితఁడు తనపై నిలుపు కొనలేదు.
కం:- పలికెడిది భాగవత మట !
పలికించెడు వాఁడు రామభద్రుండట! నే
పలికిన భవహర మగునట!
పలికెద, వేరొండు గాధ పలుకఁగ నేలా?
యనుచు పలుకుటకు, పలికించుటకు రామభద్రునే కర్తగాఁబేర్కొనెను. యెంతటి భక్తి భావము! యెంతటి నిరీహ!సృష్టి లో నటువంటి వారుండుట యరుదుగదా! 12 స్కంథముల మహాగ్రంధము ఆరామ చంద్రుని కృపాకటాక్షముల మాటుననే చకచక సాగిపోయినది. లౌకిక ప్రయోజనముల నాసించి పోతన భాగవత రచనకుఁ గడంగలేదు. కేవల మోక్షమునకే యాప్రయత్నము .
శ;:- శ్రీ కైవల్య పదంబుఁ జేరుచకునైఁ జింతించెదన్ , లోక ర
క్షై, కారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు, మహానందాంగనా డింభకున్;
అంకితముగా నిచ్చునట! అందుకు ప్రతి ఫలము మోక్షమేనట! ఆహా! పోతన కవీంద్రా! నీవంటివారు మరల నీక్షోణిలో జన్మంతురా? మేముఁజూడగలమా?యేమో స్వామీ! నీకు నీవే సాటి!
చ:- లలిత స్కంథము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఙేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై;
భాగవత మొక కల్ప వృక్షమట. దానికి కృష్ణుడు మూలమట. అందమైన స్కంధములే శాఖలట. శ్రీ శుకుఁడనే చిలుక కూతలతో నిపైనదట. మనోహర వర్ణనలే లతలట. సు వర్ణము లనే సుపర్ణములున్నవట. అందమైనకథయనే కాండంతో కూడియున్నదట. మహాఫల యుక్తమట(గొప్పఫలితములే దాని పండ్లు) నిర్మల మూర్తి వ్యాసుడే దానికి యాలవాలమట. (ఆలవాలమంటే బోదె చెట్టు నివసించు చోటు) సజ్జన శ్రేయార్ధమై వెలసినదట. దీని పేరే భాగవత మట. ఆహా యెంత యుక్తియుక్తముగ చెప్పినావయ్యా! నీమాట యదార్ధమే! మాకిది కల్పవృక్షమై సకలశ్రేయములను సమకూర్చు చున్నది. పోతనృకవీంద్రా నీవు నెలకొల్పిన యీభాగవత వృక్షము సంసార దుఃఖభాజనులకు దివ్యౌషధమై యాధ్యాత్మిక ఫలదాయకమై యలరారు చున్నది. ధన్యులము స్వామీ ధన్యులము.
కవితా గుణములను జెప్పుట మాని భాగవత రచనా పరిశీలనకు పూనుకొంటి రేమి యని మిత్రులు ప్రశ్నింప వచ్చును. యేమిచేతును? పోతనను దలచి నంతనే చిత్త ముప్పొంగును. రిత్తవిషయములు ముచ్చటింప మనసాడదు. పరమ భాగవతుని భాగవతమున గల కవితా రీతుల నరయుటకు ముందాతని జీవన విశేషముల నించుక యైనను తడవకున్న మనశ్ర మ యంతయు యేటిలోఁబిసికిన చింతపండు వొడువున పరార్ధమునకూగాక,ఃపరమార్ధమునకూ గాక వ్యర్ధఎమగునేమో యనిఃనాసంశయము. 
కం:- కొందరకుఁదెనుఁగు గుణమగు
కొందరకుం సంస్కృతంబు గుణమగు రెంటన్
గొందరకు గుణములేయగు
నందర మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్;
పోతన కవీంద్రుఁడు తన కవితారీతు లివ్వియని యెక్కడనుబేర్కొని యుండలేదు. బహుశః కర్తృత్వము రామభద్రుని పైనిడుట నాయవకాశమునాతడు వినియోగించుకొనలేదేమో? నిజమే! చెప్పెడు మాటయొకటి చేసెడు చేత యింకొకటియైన నొప్పదుగదా! పోతన సత్య వ్రతుఁడు. హద్దు దాటువాడుగాదు. అందు యాకవిత్వ మంతయు దివ్యమైన భవ్యమైన యాధ్యాత్మిక పరీమళములతో నలరారినది. పోతన ధ్యాన మగ్నుఁడై యున్నపు డాభగవన్నిర్దిష్ట ములైన భావములు స్ఫురించుచుండగా కలముతో పద్యములను రచియించెడివాడట!
అయినను , మాన్యులను , సామాన్యులను మెప్పించు రీతిలో తనకవిత నడచునని యది పండిత వర్గమును పామర వర్గమును గూడ మెప్పించు రీతిగా సాగునని మాత్రమే పైపద్యమున సూచించినాడు. నాటి కింకను సంస్కృత పండితుల యాధిక్యము తగ్గలేదు. అప్పు డప్పుఁడే యచ్చతెలుఁగు పైమమకారము కొందరకు పొడము చున్నది. శివకవుల పనియదియేగదా! దేసి వాదము విస్తరంచినది. కావున తెలుఁగు కవిత్వమునే యభిమానించు వర్గమొకటి తయారైనది. 1 సంస్కృత భాషాభిమానులు2 తెలుఁగు భాషాభిమానులు( దేసివర్గము )3 తత్సమ పదమిళితమైన యాంధ్రపదాభిమానులు. వీరందరను తనకవిత తోమెప్పింతు నని పోతన సూచనము. సూచనయేగాదు యట్టి పద్యముల రచనలతో నిజముగనే త్రివర్గములను ఒప్పించి మెప్పించెను.
ప్రాయికముగా నీతని కంద పద్య రచన తెనుఁగు నకు పట్టముఁగట్టగా , వృత్తరచన తత్సమ పదసంయుతమై యలరారు చుండును. మరికొన్నిచోట్ల సుదీర్ఘమైన సంస్కృత సమాస విజృంభణము కాననగు చుండును. పోతన కవిత మందార మకరందములకు మారుపేరు. జుంటి తేనియల తియ్యదనము, విరిబాలల సోయగము( మెత్తదనము) వెన్నెలల చల్లందనము.ఃమలయమారుతపు పరీమళశైత్యములీతని కవిత లో గానవచ్చు చుండును. పోతన శబ్దాలంకార ప్రియుఁడు. ప్రతిపద్యమున నంతోయింతో శబ్దాలంకార ప్రయోగ ముండక తప్పదు. దీనివలన అజంత మైన మనభాషకు యొకచక్కని "లయ" కల్పించెను.ఒకఅపూర్వమైన అందమును చేకూర్చను. పద్యమును చదివినంతనే మనకు అర్ధమయినను, లేకున్నను హృదయమునకు యెంతో హాయిగానుండును. యిక పాత్ర చిత్రణమునను, వర్ణనల యందును నితఁడు సిధ్ధహస్తుఁడు. ఆయాదృశ్యములేమి పాత్రలేమి వానివాని యహార్యములతో, స్వరూప, స్వభావములతో, మనకన్నులముందు సాక్షాత్కరించును.
తెలుఁగు పద్య రచనాచాతుర్యము నీక్రింది పద్యములయందు గమనీయము
కం: కఱిఁదిగుచు మకరి సరసికి
కఱిఁదరికిని మకరిఁదిగుచు గఱకఱిఁ బెరయన్
కఱికి మకరి మకరికిఁగరి
భరమగుచును నతలఁ గుతల భటులదరిపడన్;
కం:అడి గెద నని కడు వడిజను
నడిగినఁ దన మగుడ నుడువఁడని నడయుడుగున్
వెడ వెడ జిడిముడిఁ దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్;
పైపద్యముల లో నన్నియు తెలుఁగు పదములేయగుట గమనీయము. అంతేగాక యమకమను శబ్దాలంకారము పెత్తనము చెలాయించినది.
తత్సమ పదప్రయోగచాతుర్యము నీక్రిందిఃపద్యములలో గమనితురుగాక!
మ: అటగాంచెన్ కరణీ విభుండు నవ ఫుల్లాంభోజ కల్హారమున్
నట దిందీ వర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
జటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబు గాసారమున్;
మ: ఆదిన్ శ్రీ సతి కొప్పుపైఁ దనువుపై యంశోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోల తటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందుఁ గరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మే
ల్గాదే! రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
చక్కని తత్సమపదలాలిత్యము పదాంత్య ప్రాస వ్న్యాసము. యెంత గొప్పగానున్నది పద్యము. విష్ణు కర వైభము! చెప్పుటకు వీలులేదు.
పోతన వర్ణనా సామర్ధ్యమునకాతని వచనములే నిదర్శనము. భాగవతమునందలి పద్యములన్నియు వెలగట్టలేని మణులు. యింక నందలి బాలకృష్ణుని లీలలు, ప్రహ్లాదచరిత్రము, వామనావతారము, గజేంద్రమోక్షణము మొన్నగు వివిధఘట్టములు వెలగొనలేనిఃదివ్య మణిమయ హారములు. మందార మకరంద ధారాసిక్త మైన భావములతో ప్రతి పద్యమొక నూజివీడు చెఱకు రసాల మామిడి పండువలె సంతసముతోనింపి తుష్ఠిని పుష్ఠి ని పాఠకునకు గలుఁగఁజేయును ;
ఇట్లు భావత రచనతో నాంధ్ర సాహిత్యమునుఃపరిపుష్ట మొనరించిన పోతనతాను ధన్యుఁడగుటయేగాక నాంధ్రుల కందరకు ధన్యత్వ మందజేసి తరించి మనలను తరింపఁ జేసినాడనుట యదార్ధము.
ఉ: ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులన్ బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెఱ పోతరాజొకడు భాగవతంబు జగధ్ధితంబుగన్;
స్వస్తిర్భవతు !

Monday, 6 July 2015

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు - నన్నెచోడుఁడు

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు
నన్నెచోడుఁడు 


కం:- కలుపొన్నవిరులు పెరుగన్
గల కోడిరవంబు దిసలఁ గొనగొని మొరయన్
బొలియు నొరయూరికధిపతి
నలఘు పరాక్రముఁడఁ డేంకణాదిత్యుండన్ !
నన్నెచోడ కవిరాజ శిఖామణి " కుమార సంభవ కావ్య నిర్మాత. ఒరయూరి కధిపతి. టేంకణాదిత్య బిరుదాంకితుఁడు .ఈచోళరాజులు కడప మండలమును బరిపాలించి నట్లు చరిత్ర కారుల కధనం. తాటియాకుల కవిలెలలో నెక్కడో యడుగున బడియున్న యితని గ్రంధమును వెదకి సంస్కరంచి తొలుత ప్రచురించిన వారు కీర్తిశేషులు మానవిల్లి రామకృష్ణ కవిగారు. వారీ గ్రంధ ప్రచురణ తోబాటు పెద్ద దుమారమును లేపిరి. అది " నన్నెచోడుడు నన్నయకు ముందువాడని , ఆదికవిబిరుదమునకు యితడే అర్హుడని వారివాదము. 1దేసికవితావిధానము 2 శాసనములలో నితని తలిదండ్రుల పేర్లు నన్నయ్యకు ముందుకాలమున నుండుట. కారణములుగా బేర్కొనినారు. వాఙ్మయ పరిశోధకులు ఆవాదమున పసలేమి. దొరికిన యాధారములమేరకు యితనిని నన్నయ- తిక్కల నడిమి కాలము వాఁడుగా నిర్ణయించినారు. కానిండు దానితో మనకిపుడు పనిలేదు.
కం:- మార్గమె మార్గము దేసి య
మార్గము వదలంగ దమకు మతి వదలక దు
ర్మార్గ పథవర్తు లనఁదగు
మార్గ కవులఁదలప మహి సుకవులకున్;
తెలుగు కవిత్వము మార్గము, దేసి యని రెండు రీతుల నన్నయ నాట విభజింపఁబడినది. సంస్కృత ఛందో సాంప్ర దాయము ననుసరించి తత్సమ పద ప్రాచుర్యముగా రచనజేసిన నది మార్గ కవిత్వము. అటుగాక తద్భవ, దేశ్య పద జాలముతో, దేసిఛందమునకుఁజెందిన తరువోజ, అక్కర, సీస, కంద, గీతము,ఃఆటవెలది, ద్విపద, లతో కవత్వమును కొనసాగించిన నది దేసి కవిత్వము.
నన్నయ నాడు మార్గ కవులు విస్తారముగా నున్నారు. వారు దేసికవుల నీసడించెడి వారట! దేసి పామర కవిత్వ మనెడివారట! పైపద్య మట్టి దేసికవుల నిరసనమునకు ప్రతిరూపమైనిలచినది. దేసిని గౌరవించినరాజులుఁగూడలేకపోలేదు.
కం:- మును మార్గకవిత దేశం
బున వెలయగ దేసికవిత బుట్టించి దెనుం
గును నిల్పి రంధ్ర విషయంయం
బున, సత్యాశ్రయుని దొట్టి చాళుక్య నృపుల్:;
సత్యశ్రయుఁడను చాళుక్యరాజు తనకాలంలో దేసికి గౌరవ మొసగి తెలుగు దేశంలో వెలయఁజేసెనట. యింతకు నన్నెచోడుడు " దేసి కవితాభిమాని" శివకవుల వర్గమునకు జెందినవాడు. యితడు12 ఆశ్వాసముల పరిమితిగల విస్తారమైన కథతోకూడిన కుమార సంభవమను మహా గ్రంధ మును రచియించెను. దానిని తనగురువు జంగమ మల్లి కార్జనునకు అంకితము గావిచెను.
కుమారసంభము కాళిదాస కుమార సంభవమును, శివపురాణమును అనుసరించుచు గ్రధనముఁజేసెను. సతిజన్మము తో నారంభమైయిది తారకాసుర సంహారముతో ముగింపు నకు వచ్చినది. యిందీతడు దేసికవితను విరివిగా నుపయోగించెను. కానీ మార్గ కవితా సాంప్రదాయములను అనుసరింపక తప్పలేదు. స్రగ్ధర, చంపక, ఉత్పల, తరళము, మత్తకోకిల, మత్తేభము, శార్దూలము, యిత్యాది వృత్తములను వాడక తప్పలేదు. అయినను మనము గమనింప వలసినది " యితనిది దేసికవితా మార్గమని" యితనిదేసికవిత కొకయుదాహరణము
ఉ: పొన్నలు పూసె; పొన్నలొగి పూవక ముందరె పూసెగోగు; లా
పొన్నలు కొండగోగులును పూవకముందరె పూచె బూరుగుల్,
పొన్నలు కొండగోగులును బూరుగు లున్నొగి పూయకుండగా
మున్నె, వనంబునన్ గలయ మోదుగ లొప్పుగఁబూచె నామనిన్;
భావం: వసంత వర్ణనం లోనిదీపద్యం . ఆఋతువులో యేయే పుష్పాలు ముందువెనుకలుగా పూస్తాయో వివరించటమే పద్యంలో వున్న విషయం. కవిపూచేపూవుల క్రమాన్ని అపక్రమంగా చిప్పటం యిందలి నవీనత! వసంతం వస్తోందంటే ముందుగా మోదుగలు, తరువాత బూరుగలు, ఆపై కొండగోగులు ,చివరకు పొన్నలు పూలు పూస్తాయి. అదిక్రమం. అదియిక్కడ వ్యత్యస్త మైంది.
ఇందులో యించుమించు అన్నీ తెలుగు పదాలనే వాడటం గమనీయం! ఇదిగో యిది
దేసికవితా విధానం. దీనికి ఆద్యుఁడు నన్నెచోడ కవిశిఖామణి ; యితని కవితావిధానం దేసి. స్వస్తి!

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు - కవి బ్రహ్మ తిక్కన సోమయాజి

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు
కవి బ్రహ్మ తిక్కన సోమయాజి
మ: అమలో దాత్త మనీష, నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శి
స్పమునన్ బారగుఁడన్, గళావిదుఁడ ,నాపస్తంభ సూత్రుండ, గౌ
తమ గోత్రుండ , మహేశ్వరాంఘ్రి యుగళీ ధ్యానైక శీలుండ న
న్నమకున్ కొమ్మన మంత్రికిన్ సుతుఁడ సన్మాన్యుండఁ దిక్కాఖ్యుఁడన్
;
అవతారిక- నిర్వచ నోత్తర రామాయణము;
కవిత్రయంలో ద్వితీయుఁడైన తిక్కన తనృకవితా రీతులను గూర్చి యిదమిథ్థముగా నెక్కడను బేర్కొనియుండలేదు. అయినను పైపద్యమును బట్టి యతని కవితారీతులను విగడించుటకు అవకాశము
లభించుచున్నది. ఇదియే గాక పలువురు వాఙ్మయ పరిశోధకులు పేర్కన్న రీతులు తిక్కన కవిత్వ పధ్ధతుల నెఱుంగుటకు వీలుఁగల్పించుచున్నవి. వీటియన్నిటి సారాంశములను దిక్ ప్రదర్శనముగా వించుటకు బ్రయత్నించెదనుగాక!
అమలోదాత్త మనీషచే , ఉభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునందు నేర్పరియట .మనీషయనగా బుధ్ధివిశేషము. అది అమలము- స్వఛ్ఛము, ఉదాత్తము- ఉత్తమమును అయినది ; అట్టిమనీషచే నుభ య కావ్య ప్రౌఢిని బరికింపగల శిల్పమునందు పారగుఁడు - అనగాచక్కని బుధ్ధిబలముచే సంస్కృతాంధ్ర కావ్యములను నిర్మింపగల శిల్పమున నారి తేరినవాడట! కళావిదుడ- కళలస్వరూపమును దెలిసినవాడట.
ఇట బేర్కొనిన ' శిల్పము' కళ' ఈరెంటిని మిగులజాగరూకతతో బరిశీలింపవలసి యున్నది. శిల్పమనగా నైపుణ్యము. కళ యనగా నందము దానివలన గలుగునది యానందము; యేతావాతా తేలినదిది. నేను సంస్కృతాంధ్ర భాషలలో నందముగా కావ్యనులను నిర్మింప దక్షుఁడననుట! ఆవిెషయము మనకు నీక్రింది శ్లోక , పద్యములు నిరూపించు చున్నవి .
స్రగ్ధ: శ్రీ రాస్తామ్ మనమ క్షితీశ్వర భుజాదండే జగన్మండలే;
ప్రాసాద స్ధిర భార భాజి దధతాం సా సాలభంజీ శ్రియాం
శుండాలోత్తమ గండభిత్తిషు మదవ్యాసంగవస్త్యాత్మనామ్
యాముత్తేజయతేతరాం మధులిహా మానంద సాంద్ర స్థితిః;
మనుమ సిధ్ధి భుజాస్తంభములను ప్రాసాద మునందు అలంకరణార్ధమై యుంచ బడిన సాలభంజికవలె రాజ్య లక్ష్మి స్థిర నివాసమున్నదట! మదగజముల గండస్థలముల యందలి మదజల ధారకాసపడి వచ్చి యచటనే నివాసమున్న గండుతుమ్మెద లన్నియు నుత్తేజమును గల్పింపగా రాజ్య లక్ష్మి వసించెనని తాత్పర్యము. " ఆగజాంత మైశ్వర్యం" అనునది యొక సంస్కృత సూచనము. లోకమున పెక్కు యేనుఁగు లున్నవానినే ధనవంతునిగాబరిగణించెడివారట ! మనుమ సిధ్ధి మహదైశ్వర్య వంతుఁడని యతనిగజబలమే నిరూపించు చున్నదని తాత్పర్యము. మహాబలవంతుఁడని మరోయర్ధము. అందుచేతనే యతనియింట రాజ్య రమ స్ధిర నివాసము నేర్పరచు కొనెనని ఫఎలితార్ధము. ఇది నర్వచనోత్తర రామాయణ ప్రారంభశ్లోకము; ఇదియతని సంస్కృత కవితాప్రౌఢతకు నిదర్శనము;
ఉ: శ్రీయన గౌరినాఁబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయత మూర్తియై హరిహరంబగు రూపముఁదాల్చి విష్ణురూ
పాయ! నమఃశివాయ! యని మ్రొక్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పర తత్వముఁ గొల్తు నభీష్ఠ సిధ్ధికిన్;
ఇది విరాట పర్వారంభ పద్యము. అనగా తిక్కన భారతాంధ్రీకరణమున దొలిపద్య మన్నమాట; తిక్కన హరిహరనాధ భక్తుఁడు. శివకేశవాద్వైతవాది. యందుచేతనే తన బారత భాగమునకు కృతిపతియగు హరిహరనాధుని తొలిపద్యమున వర్ణిచినాడు. ఇందు శ్రీదేవికి గౌరికి యభేదము, హరికి హరునకు అభేదము చెప్పబడినది. శ్రీయనియు గూరియనియు చెప్పబడు చెలువకు హృదము పల్లవింపగా , హరి హరూపముతో
శుభంకరమైన రూపమును ధరించి " విష్ణురూపాయ నమశ్శివాయ! యని నమస్కరించు నిజభక్తగణముల వైదిక ధ్యానముల కెదమెచ్చు పరదైవతమగు హరిహరనాధుని యభీష్ఠ సిధ్ధికై సేవింతును. అని దీనియర్ధము.
ఈరెండు పద్యముల బరిశీలనతో నీతని యుభయ కావ్యప్రౌడ రచనారీతి యెరుక పడినదిగదా! అనగా సంస్కృత కావ్యమైనను తెలుగు కావ్యమైనను నిరాటంకముగా రాయగల ప్రౌఢత యతని స్వమతమన్నమాట!
మ: హృదయా హ్లాది చతుర్ధ ,మూర్జిత కధోపేతంబు నానా రసా
భ్యుదయోల్లాసి, విరాట పర్వ మట, యుద్యోగాదులం గూడగా
బదునేడింటఁ దెనుంగుఁ జేసెద
 - నని విరాట పర్వారంభంలో తిక్తన గారికథనము. ఇందుమనకు"నానారసాభ్యుదయోల్లాసి"యను భాగము అవసర పడి యున్నది; విరాట పర్వము పెక్కురసముల కు కూడలి యనిదీనివలన దేలుచున్నది. రసపోషణమున దిక్కనకు సాటి రాదగిన కవియరుదు. రసపోషణమీతని కవితా గుణములలో3వ స్థానము నాక్ర మించుచున్నది. 4 నాటకీయత 5వది తెలుఁగు నుడికారము.
భారతమున విశేష భాగమును దిక్కన యనువదించెను దాదాపుగా నవరసములను నతడు పోషించు రచనము నొనర్చినాడు. ప్ర ప్రధమగు విరాట పర్వము ననుసరించి యాతని రస పోషణా సామర్ధయమును బరిశీలింతముగాక! విరాట పర్వమున కీచక సైరంధ్రుల కృతక ప్రణయ ఘట్టమున శృంగారమును( ఆభాసమే గానోపునుగాక) ఉత్తరుని మాటల సందర్భమున హాస్యము. కీచక- భీమసేనుల యుధ్ధ సందర్భమున వీర, రౌద్ర, భయానక, భీభత్స రసములు యితనిచే ననుపమానముగ బోషింపఁ బడినవి. ధర్మజుని(కంకుభట్టు) చేతలలో మాటలలో శాంతము . యిట్లు వివిధ సందర్భ ముల కనుగుణముగా రసపోషణము గావింపఁబడినది . ఉత్తర గోగ్రహణ సందర్భంలో భీతుఁడయిన యుత్తరుఁడుబృహన్నలతో,-
శా: భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే జేరంగ శక్తుండనే!
అనే ఈ పద్యంలో వీర ,భయానక ,అద్భుత రసములను సముచితముగాఁ బోషింపఁబడినవి. రసాను గుణ్యమగు ఆరభటీ వృత్తియు, సుదీర్ఘ సమాసములు, దుష్కర ప్రాసము, సంస్కృత పదాడంబరము; తిక్కన రసపోణకుపక రించిన పరికరములు . కవి సార్వ భౌమ శ్రీనాధుఁడు" వాకృత్తు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు" ఒక్క శ్రీనాధునకేగాదు ఆగామి కవితల్లజుల కెల్లరకు రస పోషణమునకు దారులు దీర్చినది తిక్కనయే ననుట నిస్సందేహము!
నాటకీయత:- తిక్కన కళావిదుఁడుగదా! నాటకీయత కళలో నంతర్భాగమే! లలిత కళలో నాట్య మొకటి. నటయోర్భావమ్ నాట్యమ్!ఃకావున ప్రత్యేకముగా చెప్పవలసిన యక్కర లేకున్నను వాఙ్మయ విమర్శకులెల్లరు దీనిని ప్రత్యేకముగా ఁబేర్కొను చుండుటచే దీనినిక్కడ బ్రస్తావింపకఁ దప్పలేదు. కావ్యము, శ్రవ్యము. నాటకము దృశ్యము. అట్టిదృశ్య స్వభావమును కావ్యమున కాపాదించుట నాటకీయత! భారతము శ్రవ్యమే యైనను దృశ్యము వలె నానంద సంధాయకములగుటచే నిది సిధ్ధింప జేయుటనే మనవారు నాటకీయతగాఁజెప్పుచున్నారు. తిక్కన భాతమున నది పుష్కలము. తిక్కన రచన శ్రవ్యమువలెననిపంచదు. భావుకుఁడగు పాఠకున కది దృశ్య ప్రబంధముం దలపించును. కీచకుని బెదిరించుచు సైరంధ్రి-
శా:-
దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్
గర్వాంధ్య ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్,
గీర్వాణాకృతు లేవురిప్డు నిను లీలం వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం దొనుట తధ్యం బెమ్మెయిన్ కీచకా!
- అంటోంది. ఈపద్యం
అచ్చు నాటక పద్యాన్ని దలపించుట లేదా! కనులు మూసి హృదయ క్షేత్రంలో గనిపించే యస్త్రీ మూర్తిని జూడుడు; యికనిట్టివి యిందు కోకొల్లలు.
తిక్కన నాటకీయత 
చ: వరమునఁబుట్టితిన్ భరత వంశముఁజొచ్చితి, నందు పాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁబొందితి , నీతి విక్రమ
స్థిరులగుఁ బుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపుఁ గాంచితిన్;
సరసిజనాభ! యిన్నిటఁ, బ్రసిధ్ధికి నెక్కిన దాన నెంతయున్
;
ఉ: నీవు సుభద్ర కంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేతు, వట్టి నను, పంకజనాభ! యొకండు రాజసూ
యావ బృధంబునందు, శుచియై పెను పొందిన వేణిఁబట్టి యీ
యేవురు జూడగా, సభకు నీడ్చె, కులాంగన నిట్లొనర్తురే!
కౌరవ సభకు కృష్ణుడు రాయబారిగాఁ బోవు సందర్భమున ద్రౌపది పల్కిన మాటలు. రెండు పద్యములు తెరపై పాత్ర హావ భావములనుబ్రదర్శిమచుచు బల్కినట్లు లేవా! ఆఘట్టమేగాక, కౌరవ సభలో కృష్ణుని రాయబార ఘట్టమును, తిక్కన నాటకీయతకు నిలువు టద్దములు. వాకోవాక్యనిర్మాణము. పాత్రలయాహార్యము యిట్లుగా యొకటన నేల యన్నియు నాటకీయతను బోషించినవి.
5 నుడికారము:- నుడి కారమనగా భాషలోని సొగసులు. పలుకు బడులు. ఆంగ్లమున(దీనినే యిడియ మాటిక్ గాచెప్పుచందురు. ప్రతి భాషకు నొకపధ్ధతియుండును. వాక్య నిర్మాణమున, క్రియాప్రయోగమున, సామెతలు వాడుసందర్భమున , లోకోక్తులనుపయోగించురీతిలో నొక ప్రత్యేకత గోచరించుచుండును. దానినే మనవారు నుడికారముగాఁ బోర్కొను చున్నారు .
చ: పగ యడగించు టెంతయు శుభం , బదిలెస్స, యడంగునే పగన్
పగ వగగొన్న మార్కొనక యుండగ వచ్చునె? యేరికైన, నే
మిగతి దలంచినన్ బగకు మేలిమి లేమి ధృవంబు కేశవా!
పాఠకులు క్షమించాలి . మధ్యలో నొక పాదము లుప్త మైనది. పుస్తకము లేమి మస్తకమును నమ్మకొంటిని. వార్ధక్యము వంకతో నదినన్ను వచించినది. పోనిండు మనవిశ్లేషణ కిది సరిపోవును. పైపద్యమలో శుభంబు, ధృవంబు, దక్క తక్కిన పదములన్నియు తెలుగు పదములే! చెప్పువిధానమును గమనించితిరా, తెలుగునాట ప్రతియింట నిట్టులనే సంభాషణ సాగుచుండునుగదా! తిక్కన తెలుఁగుఁదనమునకు పెద్ద పీట వేయును . యితని కవితలో తత్సమ పదప్రయోగము అతి విరళము. చెప్పువిధానము, సామెతల నామెతలుగా వాడుట, వాకోవాక్య నిర్మాణము మొన్నగునవి తెలుఁగుఁ దనమునకు మిక్కిలి దగ్గర గానుండును. యిది తిక్కన తెలుఁగు నుడికారము.
కంద పద్య రచన:- యీకవిని పరిచయము చేయు సందర్భమున దీనిని మరువ రాదు. యిది శిల్పమున నొకభాగమగుట దీనినొక ప్రత్యేక లక్షణముగాఁ బేర్కొనుటలేదు.
ముందుగఁజను దినములలో
కందమునకు సోమయాజి ఘనుండందురు - అని కవిచౌడప్ప తిక్కనను కంద పద్యరచన లో మొనగాఁడని ప్రశంసించినాడు. యదార్ధమే! కంద పద్య రచనలో తిక్కనమేటి. యతని కందములలో నొకవిలక్షణత యున్నది." అల్పాక్షరములలో ననల్పార్ధరచనమే కవిత్వము" అని శివకవుల యభిప్రాయము. తిక్కన యాసూత్రమును మన్నించెను . అందుకు సాధనముగా కందమును గ్రహించెను. కొండంత భావమును చిన్న కందములో నిమిడ్చి చెప్పు చాతుర్యము తిక్కన స్వభావము.
కం:- ఆపదఁ గడవం బెట్టఁగ
నోపి, శుభంబైన దాని నొడఁగూర్పను , మా
కీపుట్టువునకు పాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపిఁ జనియె మహత్మా!
భారతోద్యోగ పర్వమున కృష్ణుఁడు కౌరవ సభకు రాయబారియై పోవు సందర్భమున ధర్మరాజు కృష్ణుని నన్నమాటల లోనిదీ పద్యము. ధర్మజుఁడు తనమనస్సులోని విషయమంతయు వ్యంగ్యముగా నీపద్యమున సూచించినాడు. మొదటి సంబోధననే పరికింపుఁఢు. మహాత్మా! తోనారంభము.నీవుమహాత్ముఁడవు నీకు చెప్పవలసిన పనియేమి? సర్వము నీవెరుంగుదువు. మేముపడిన కష్టములు నష్టములు పరాభవములను నీకు వివరింపఁబనిలేదు. తండ్రి లేనిపిల్లము. మాకు దిక్కుదేవుడే ఆదేవాది దేవుఁడవగు నీకు చెప్పునదేమి? యైనను నీయొక్కమాట వినుము. మాయాపదలెల్లఁదొలగించి శుభము నొడఁగూర్పగా మాకీజన్మమునకు పాండురాజు మాతండ్రి నిన్ను పెద్దదిక్కుగాఁజూపించెను. యికనీదేభారము.
ధర్మజుని మాటల లోదాగిన మర్మ మిది; కౌరవ, పాండవులలో నేను పెద్ద వాఁడను రాజ్యాధికారము నాదేగదా! కావున యోచించి నన్ను చక్రవర్తిగా చేయుటయే నీకు ధర్మము. అదియే ధర్మ సంస్థాపనము. పరదైవతమవు గావున మావిషమున కడుంగడు జాగరూకత తో వ్యవహారమును జక్తఁబెట్టుము. నీదేభారము. యిన్నివిషయాలు యీచిన్ని కందంలో నిమిడ్చి తిక్కన తనరచనా శిల్పమును యనల్పమైనదానినిగా వెలయింపఁజేసెను . మొత్తముమీద 1.ఉభయకావ్యప్రౌఢి, 2 శిల్పము, 3 కళావేతృత్వము,
4. నాటకీయత, 5 తెలుఁగు నుడికారములు తిక్కన కవితా లక్షణముగా బేర్కొనుట జరిగినది,. స్వస్తి!

ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితా మార్గాలు - నన్నయ్య భట్టు కవితా విధానము

మిత్రులకు శుభోదయం!
మిత్రులారా! ఆంధ్ర సాహిత్య క్షేత్రం లో పసిడి పంటలను పండించిన కవులు అసంఖ్యాకం . వారిది ఒక్కొక్కరిది ఒక్కొక బాణి ఒక్కొక్క వాణి . ఆవిధానం వారి కవతలకు యెట్లు వన్నెను వాసిని సమకూర్చినదో మనము తెలిసి కొందము. నన్నయ మొదలు నారాయణ రెడ్డి వరకు ఒక్కొక్కరిగా సంక్షేపముగా పరిశీలింతము . ముందుగా ఆదికవి నన్నయ భట్టారకుని తో ప్రారంభింతము.
నన్నయ్య భట్టు కవితా విధానము 

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్ధయుక్తి లో
నారసి మేలునా , నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్ధ సూక్తి నిధి, నన్నయభట్టుఁ దెనుంగునన్, మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె, జగధ్ధితంబుగన్;
నన్నయ భట్టుగా ప్సిధ్ధినందిన నేను భారత సంహితను(వేదమును) రచియించుటకు దీక్షవహించు చున్నాడను. సంస్కృత మందలి భారతమును దెనిగించుటకు నేనుయెన్నుకొన్న విధానమిది.
1 సారమతులైన కవీశ్వరులు ప్రసన్నమైన (ప్రసాదగుణముతోగూడిన సరళమైన) కధార్ధ విధానమును హృదయములయందు పర్యాలోచనమొనరించి మేలుృమేలని ప్రశంసింపగా, భారతమునుతెనిగిస్తున్నానని చెప్పాడు.అయితే లోనారయుటకు వారు సారమతులై యుండాలట! మనకిపుడు సారా మతులేగాని ( ఈమాట నాదికాదు విశ్వ నాధది) సార మతులెక్కడ? వారు లోనారయుటకు ఈలోచనాలు పనకిరావు. సులోచనాలు కూడా వృధాయే! దానికిఆలోచనా లోచనాలనుదెరవాలి. మనస్సులో ఆకధావిధానాన్ని అవలోకించాలి. అదిగో అప్పుడు బోధపడుతుంది అతని కథాకథన విధానం . నన్నయ భారతాన్ని యధామాతృకగా ననువదింపలేదు. కమ్మని కథవింటున్నట్లు మనంభావిచే రీతిగా అనువాదం సాగించాడు. కథాకథనానికి అడ్డం వచ్చే వర్ణనలను తగ్గించాడు. కథవినే పాఠకులకు విసుగు రాని పధ్ధతియది. సుదీర్ఘములైన సంభాషణలను కుదించినాడు. శిశుపాల వధలోనియీపద్యమును పరిశీలించండి .
చ: ఇతనికిఁగూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక! మహాత్ములైన భూ
పతులయు విప్ర ముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనా
యతికి ననర్హు నర్హుఁడని యచ్యుతు నర్చితుఁజేయ బాడియే!
మూలం లోని దీర్ఘ తరమైన సంభాషణను తగ్గించాడు. ఇదీ యతనికథాకథన విధానం. దీనినే ప్రసన్న కథ గాఁబేర్కొని నాడు.
2 అక్షర రమ్యత - అందంగా అక్షరాలువనిపించటం ( శ్రవణ శుభగంగా) పండితులు కవులు, ప్రసన్న కధని మెచ్చగా,యితరులు- అంటేసామాన్యులు. కొందరు పామరులు అని వింగడించినారు అది తప్పు. అక్షరజ్ఙానమున్నవాడు పామరుఁడెట్లగును? అందుచేత రెండవ వర్గము వారిని సామాన్యులు గనే చెప్ప వలసి యున్నది. వారెల్లరు అక్షర రమ్యతను ఆదరింపగా భారతమును రచించెనట! ఈయక్షర రమ్యత యమకాది శబ్దాలంకారములచే సాధింప వచ్చును. అదేపని చేసినాడు. ఈపద్యమును బరికింపుడు.
చ: రయ వితలత్తురంగమ తరంగములన్ , మదనక్ర నాగ సం
చయముల సంచలచ్చెటుల సైనిక మత్స్యములన్ భయంకరం
బయి యదు వృష్ణి భోజ కుకు రాంధక వాహినియుం గలంగె ని
ర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబు నన్ ;
రాజసూయాధ్వర సందర్భమున కృష్ణుని పూజించి నందుకు అలిగిన శిశుపాలుఁడు యుధ్ధమునకు తెగపడెను . అతనిని సమర్ధించువారు ( రాజులు) యుధ్ధమునకు తయారైనారు. ఆసంరంభమును ఈపద్యము వివరించు చున్నది. ఒకరా యిద్దరా ,యదు వృష్ణి భోజ కుకుర అంధక దేశములకు జెందినరాజులు వారిమహాసైన్యము . అది యొక పెద్ద సాగరమును దలపించు చున్నది. సారమైతే తరంగాలండాలికదా! యిక్కడ యెగిరెగిరి పడే గుఱ్ఱాలే తరంగాలట! పెద్ద చాపలుండాలికదా! అటునిటు పరుగులుఁదీసే సైనికులే మత్స్యములట! భయంకరమగుట సైన్య సముద్రములకు సమము. ఆసేనాసముద్రం దయారాహిత్య మనే పెనుగాలులకు చెలరేగి పోతున్నదట! అంటే అల్ల కల్లోలంగామారిదని తాత్పర్యం!
ఈసంరంభాన్నంతా ఈవిధంగా పదాడంబరంతో నింపి యాపై రూపకము ఆరోపించి దీనినీ చదువు పాఠకుల మనంబుల కబ్బుపాటొదవించెను. ఇదీయక్షర రమ్యత వలన నన్నయకు గలిగిన ప్రయోజనము. కావున నన్నయ కవితా గుణములు 1 ప్రసన్నకధ 2 అక్షర రమ్యతలు . లనుట. యుక్తము.