Monday, 6 July 2015

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు - నన్నెచోడుఁడు

ఆంధ్ర సాహిత్యంలో విభిన్న కవితా రీతులు
నన్నెచోడుఁడు 


కం:- కలుపొన్నవిరులు పెరుగన్
గల కోడిరవంబు దిసలఁ గొనగొని మొరయన్
బొలియు నొరయూరికధిపతి
నలఘు పరాక్రముఁడఁ డేంకణాదిత్యుండన్ !
నన్నెచోడ కవిరాజ శిఖామణి " కుమార సంభవ కావ్య నిర్మాత. ఒరయూరి కధిపతి. టేంకణాదిత్య బిరుదాంకితుఁడు .ఈచోళరాజులు కడప మండలమును బరిపాలించి నట్లు చరిత్ర కారుల కధనం. తాటియాకుల కవిలెలలో నెక్కడో యడుగున బడియున్న యితని గ్రంధమును వెదకి సంస్కరంచి తొలుత ప్రచురించిన వారు కీర్తిశేషులు మానవిల్లి రామకృష్ణ కవిగారు. వారీ గ్రంధ ప్రచురణ తోబాటు పెద్ద దుమారమును లేపిరి. అది " నన్నెచోడుడు నన్నయకు ముందువాడని , ఆదికవిబిరుదమునకు యితడే అర్హుడని వారివాదము. 1దేసికవితావిధానము 2 శాసనములలో నితని తలిదండ్రుల పేర్లు నన్నయ్యకు ముందుకాలమున నుండుట. కారణములుగా బేర్కొనినారు. వాఙ్మయ పరిశోధకులు ఆవాదమున పసలేమి. దొరికిన యాధారములమేరకు యితనిని నన్నయ- తిక్కల నడిమి కాలము వాఁడుగా నిర్ణయించినారు. కానిండు దానితో మనకిపుడు పనిలేదు.
కం:- మార్గమె మార్గము దేసి య
మార్గము వదలంగ దమకు మతి వదలక దు
ర్మార్గ పథవర్తు లనఁదగు
మార్గ కవులఁదలప మహి సుకవులకున్;
తెలుగు కవిత్వము మార్గము, దేసి యని రెండు రీతుల నన్నయ నాట విభజింపఁబడినది. సంస్కృత ఛందో సాంప్ర దాయము ననుసరించి తత్సమ పద ప్రాచుర్యముగా రచనజేసిన నది మార్గ కవిత్వము. అటుగాక తద్భవ, దేశ్య పద జాలముతో, దేసిఛందమునకుఁజెందిన తరువోజ, అక్కర, సీస, కంద, గీతము,ఃఆటవెలది, ద్విపద, లతో కవత్వమును కొనసాగించిన నది దేసి కవిత్వము.
నన్నయ నాడు మార్గ కవులు విస్తారముగా నున్నారు. వారు దేసికవుల నీసడించెడి వారట! దేసి పామర కవిత్వ మనెడివారట! పైపద్య మట్టి దేసికవుల నిరసనమునకు ప్రతిరూపమైనిలచినది. దేసిని గౌరవించినరాజులుఁగూడలేకపోలేదు.
కం:- మును మార్గకవిత దేశం
బున వెలయగ దేసికవిత బుట్టించి దెనుం
గును నిల్పి రంధ్ర విషయంయం
బున, సత్యాశ్రయుని దొట్టి చాళుక్య నృపుల్:;
సత్యశ్రయుఁడను చాళుక్యరాజు తనకాలంలో దేసికి గౌరవ మొసగి తెలుగు దేశంలో వెలయఁజేసెనట. యింతకు నన్నెచోడుడు " దేసి కవితాభిమాని" శివకవుల వర్గమునకు జెందినవాడు. యితడు12 ఆశ్వాసముల పరిమితిగల విస్తారమైన కథతోకూడిన కుమార సంభవమను మహా గ్రంధ మును రచియించెను. దానిని తనగురువు జంగమ మల్లి కార్జనునకు అంకితము గావిచెను.
కుమారసంభము కాళిదాస కుమార సంభవమును, శివపురాణమును అనుసరించుచు గ్రధనముఁజేసెను. సతిజన్మము తో నారంభమైయిది తారకాసుర సంహారముతో ముగింపు నకు వచ్చినది. యిందీతడు దేసికవితను విరివిగా నుపయోగించెను. కానీ మార్గ కవితా సాంప్రదాయములను అనుసరింపక తప్పలేదు. స్రగ్ధర, చంపక, ఉత్పల, తరళము, మత్తకోకిల, మత్తేభము, శార్దూలము, యిత్యాది వృత్తములను వాడక తప్పలేదు. అయినను మనము గమనింప వలసినది " యితనిది దేసికవితా మార్గమని" యితనిదేసికవిత కొకయుదాహరణము
ఉ: పొన్నలు పూసె; పొన్నలొగి పూవక ముందరె పూసెగోగు; లా
పొన్నలు కొండగోగులును పూవకముందరె పూచె బూరుగుల్,
పొన్నలు కొండగోగులును బూరుగు లున్నొగి పూయకుండగా
మున్నె, వనంబునన్ గలయ మోదుగ లొప్పుగఁబూచె నామనిన్;
భావం: వసంత వర్ణనం లోనిదీపద్యం . ఆఋతువులో యేయే పుష్పాలు ముందువెనుకలుగా పూస్తాయో వివరించటమే పద్యంలో వున్న విషయం. కవిపూచేపూవుల క్రమాన్ని అపక్రమంగా చిప్పటం యిందలి నవీనత! వసంతం వస్తోందంటే ముందుగా మోదుగలు, తరువాత బూరుగలు, ఆపై కొండగోగులు ,చివరకు పొన్నలు పూలు పూస్తాయి. అదిక్రమం. అదియిక్కడ వ్యత్యస్త మైంది.
ఇందులో యించుమించు అన్నీ తెలుగు పదాలనే వాడటం గమనీయం! ఇదిగో యిది
దేసికవితా విధానం. దీనికి ఆద్యుఁడు నన్నెచోడ కవిశిఖామణి ; యితని కవితావిధానం దేసి. స్వస్తి!

3 comments:

  1. నేను తిరువాయిపాటి.భగవద్గీతను తెలుగులోనికి అనువాదం చేయగలిగితిని.నాదిదేశికవితో
    కాక మార్గ కవితో తెలియుట లేదు.ఈ ఉదాహరణ గమనించగలరు.
    తత్రాపశ్యత్ స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ | ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్
    పుత్రాన్పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహ్రుదశ్చైవ సేనయో రుభయోరపి 1-26 ||1-26||

    ౘూచెనటకిరీటి ౘుట్టపక్కముల స్నే-హితుల సోదర సుత హితుల తతుల
    మామమేనమామ మనుమల తాతల - తండ్రిగురుల నుభయ దళములందు.

    ReplyDelete
  2. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ|
    కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||18-6||
    /
    తపము ౙన్నములును దానరూపములగు -పనులు నికరమునగు వినుకిరీటి
    చేయఁదగిన పనులఁజేయుౘు నికరమౌ- కొఱలనెల్ల విడువ చెలువమునగు.

    ReplyDelete
  3. ఇలా భగవద్గీత లోని మొత్తము 701 శ్లోకములకు అన్ని పద్యములను 'యోగివేమన' రచన బోలు ఆటవెలది పద్యములలో తెనిగించాను.నేను 'రచయితను గాను' కావ్యముల్ వ్రాయఁ జాల- గురుల కరుణను విన్నంత గుఱుతు గల్గి
    పల్కు చుంటిని గీతను పరమగురులు తప్పులెంచక మన్నింపఁ దగును నన్ను. 1

    సంస్కృతంబున వ్యాసుండు సంస్కరించి - పలికినట్టిది మురవైరి ఫల్గునునకుఁ
    దెలుపు చున్నాడు మోహముల్ఁ దెగుట కొఱకు గీత విన్నను మోక్షంబు చేతి గీత. 2

    ReplyDelete