ఆంధ్ర సాహిత్యం లో విభిన్న కవితారీతులు
బమ్మెఱ పోతన
_____________
ఉ: క్షోణితలంబు నెన్నుదురు సోకగఁ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితా నత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్;
కవిత్రయానంతరము నిజమునకు శ్రీనాధుని స్మరింప వలసి యున్నను, యీవరకే యాతని జీవిత ప్రస్థానాధ్యనమును మనము పూర్తి చేసియుండుటచే ప్ర స్తుతము పోతన కవీంద్రుని కవితా మార్గములను బరిశీ లింపఁ గడంగి నాఁడను .
తెలుగున మహాభాగవత నిర్మాతగా పరమ భాగవత శ్రేష్ఠుని గాఁ బేరొందిన బమ్మెఱ పోతన వరంగల్ సమీపము నందలి బమ్మెర నివాసి. 14 శతాబ్ది చివరి వాడు. తల్లి లక్కమ తండ్రి కేసన. ఇతడు పండిత కవిగాడు. గురుముఖతః నెవ్వరి చెంతను విద్య నభ్య సించినవాఁడు గాడు. సరసీజాసను రాణి వాణి కరుణా ప్రసాద లబ్ధ కవితా వైభవముఁగలవాడు. యితని పాండిత్య మంతయు సహజమే కావుననే " సహజపాండిత్య బిరుద మీతనిని వరించినది. శ్రీరామ చంద్రుని పరమభక్తుఁడైన నితఁడు ఆస్వామి ప్రేరణమేరకు , సంస్కృత మున వేదవ్యాస విరచితమగు శ్రీ మన్మహా భాగవతమును దెనిఁగించి,యొంటిమిట్ట(ఏకశిలాపురము) నేటి యోరుగల్లు పట్టణమునగల కోదండ రామ స్వామికి యంకిత మొనరంచి తరించెను. ధనమునకగాని, యగ్రహారములకుగాని, బిరుదములకొఱకుగాని , పేరు ప్రఖ్యాతుల కొఱకుగాని యితడాసింపక ప్రలోభరహితుఁడై భగవదంకిత మొనరించి తరించెను. నాటికే గాదు, నేటికి గూడనిది విచిత్రమే!
పోతనకు సిరి సంపదలు లేవు. స్వల్పముగా వ్యవసాయ క్షేత్రము మాత్రము గలదు. అదియు మెట్ట భూమి వర్షాధారము. పండిన పండును. లేదా నిష్పలమే పంట . యిట్టిస్థితి లోఁగూడ చలింపక ,, క్షేత్రమునే నమ్ముకొని తనప్రయత్నమే ఫలసాయముగా వ్యవ సాయముఁ జేయుచు , నొకవంక నాగలిని, వేరొకఃవంక గంచమును కదలించుచు యతఁడొనరించిన కవితా, క్షేత్ర వ్యవసాయములు సఫలములై యతనిని కృతార్ధు నొనరించినవి. కన్నులముందు నిలచి వాణి కలమునకు సాయమై నిలువ కమ్మని కవిత తో నాధ్యత్మిక పరిమళములను పరుగులు పెట్టించెను. భాగవత కర్తృత్వమునితఁడు తనపై నిలుపు కొనలేదు.
కం:- పలికెడిది భాగవత మట !
పలికించెడు వాఁడు రామభద్రుండట! నే
పలికిన భవహర మగునట!
పలికెద, వేరొండు గాధ పలుకఁగ నేలా?
యనుచు పలుకుటకు, పలికించుటకు రామభద్రునే కర్తగాఁబేర్కొనెను. యెంతటి భక్తి భావము! యెంతటి నిరీహ!సృష్టి లో నటువంటి వారుండుట యరుదుగదా! 12 స్కంథముల మహాగ్రంధము ఆరామ చంద్రుని కృపాకటాక్షముల మాటుననే చకచక సాగిపోయినది. లౌకిక ప్రయోజనముల నాసించి పోతన భాగవత రచనకుఁ గడంగలేదు. కేవల మోక్షమునకే యాప్రయత్నము .
శ;:- శ్రీ కైవల్య పదంబుఁ జేరుచకునైఁ జింతించెదన్ , లోక ర
క్షై, కారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు, మహానందాంగనా డింభకున్;
అంకితముగా నిచ్చునట! అందుకు ప్రతి ఫలము మోక్షమేనట! ఆహా! పోతన కవీంద్రా! నీవంటివారు మరల నీక్షోణిలో జన్మంతురా? మేముఁజూడగలమా?యేమో స్వామీ! నీకు నీవే సాటి!
చ:- లలిత స్కంథము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఙేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై;
భాగవత మొక కల్ప వృక్షమట. దానికి కృష్ణుడు మూలమట. అందమైన స్కంధములే శాఖలట. శ్రీ శుకుఁడనే చిలుక కూతలతో నిపైనదట. మనోహర వర్ణనలే లతలట. సు వర్ణము లనే సుపర్ణములున్నవట. అందమైనకథయనే కాండంతో కూడియున్నదట. మహాఫల యుక్తమట(గొప్పఫలితములే దాని పండ్లు) నిర్మల మూర్తి వ్యాసుడే దానికి యాలవాలమట. (ఆలవాలమంటే బోదె చెట్టు నివసించు చోటు) సజ్జన శ్రేయార్ధమై వెలసినదట. దీని పేరే భాగవత మట. ఆహా యెంత యుక్తియుక్తముగ చెప్పినావయ్యా! నీమాట యదార్ధమే! మాకిది కల్పవృక్షమై సకలశ్రేయములను సమకూర్చు చున్నది. పోతనృకవీంద్రా నీవు నెలకొల్పిన యీభాగవత వృక్షము సంసార దుఃఖభాజనులకు దివ్యౌషధమై యాధ్యాత్మిక ఫలదాయకమై యలరారు చున్నది. ధన్యులము స్వామీ ధన్యులము.
కవితా గుణములను జెప్పుట మాని భాగవత రచనా పరిశీలనకు పూనుకొంటి రేమి యని మిత్రులు ప్రశ్నింప వచ్చును. యేమిచేతును? పోతనను దలచి నంతనే చిత్త ముప్పొంగును. రిత్తవిషయములు ముచ్చటింప మనసాడదు. పరమ భాగవతుని భాగవతమున గల కవితా రీతుల నరయుటకు ముందాతని జీవన విశేషముల నించుక యైనను తడవకున్న మనశ్ర మ యంతయు యేటిలోఁబిసికిన చింతపండు వొడువున పరార్ధమునకూగాక,ఃపరమార్ధమునకూ గాక వ్యర్ధఎమగునేమో యనిఃనాసంశయము.
కం:- కొందరకుఁదెనుఁగు గుణమగు
కొందరకుం సంస్కృతంబు గుణమగు రెంటన్
గొందరకు గుణములేయగు
నందర మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్;
పోతన కవీంద్రుఁడు తన కవితారీతు లివ్వియని యెక్కడనుబేర్కొని యుండలేదు. బహుశః కర్తృత్వము రామభద్రుని పైనిడుట నాయవకాశమునాతడు వినియోగించుకొనలేదేమో? నిజమే! చెప్పెడు మాటయొకటి చేసెడు చేత యింకొకటియైన నొప్పదుగదా! పోతన సత్య వ్రతుఁడు. హద్దు దాటువాడుగాదు. అందు యాకవిత్వ మంతయు దివ్యమైన భవ్యమైన యాధ్యాత్మిక పరీమళములతో నలరారినది. పోతన ధ్యాన మగ్నుఁడై యున్నపు డాభగవన్నిర్దిష్ట ములైన భావములు స్ఫురించుచుండగా కలముతో పద్యములను రచియించెడివాడట!
అయినను , మాన్యులను , సామాన్యులను మెప్పించు రీతిలో తనకవిత నడచునని యది పండిత వర్గమును పామర వర్గమును గూడ మెప్పించు రీతిగా సాగునని మాత్రమే పైపద్యమున సూచించినాడు. నాటి కింకను సంస్కృత పండితుల యాధిక్యము తగ్గలేదు. అప్పు డప్పుఁడే యచ్చతెలుఁగు పైమమకారము కొందరకు పొడము చున్నది. శివకవుల పనియదియేగదా! దేసి వాదము విస్తరంచినది. కావున తెలుఁగు కవిత్వమునే యభిమానించు వర్గమొకటి తయారైనది. 1 సంస్కృత భాషాభిమానులు2 తెలుఁగు భాషాభిమానులు( దేసివర్గము )3 తత్సమ పదమిళితమైన యాంధ్రపదాభిమానులు. వీరందరను తనకవిత తోమెప్పింతు నని పోతన సూచనము. సూచనయేగాదు యట్టి పద్యముల రచనలతో నిజముగనే త్రివర్గములను ఒప్పించి మెప్పించెను.
ప్రాయికముగా నీతని కంద పద్య రచన తెనుఁగు నకు పట్టముఁగట్టగా , వృత్తరచన తత్సమ పదసంయుతమై యలరారు చుండును. మరికొన్నిచోట్ల సుదీర్ఘమైన సంస్కృత సమాస విజృంభణము కాననగు చుండును. పోతన కవిత మందార మకరందములకు మారుపేరు. జుంటి తేనియల తియ్యదనము, విరిబాలల సోయగము( మెత్తదనము) వెన్నెలల చల్లందనము.ఃమలయమారుతపు పరీమళశైత్యములీతని కవిత లో గానవచ్చు చుండును. పోతన శబ్దాలంకార ప్రియుఁడు. ప్రతిపద్యమున నంతోయింతో శబ్దాలంకార ప్రయోగ ముండక తప్పదు. దీనివలన అజంత మైన మనభాషకు యొకచక్కని "లయ" కల్పించెను.ఒకఅపూర్వమైన అందమును చేకూర్చను. పద్యమును చదివినంతనే మనకు అర్ధమయినను, లేకున్నను హృదయమునకు యెంతో హాయిగానుండును. యిక పాత్ర చిత్రణమునను, వర్ణనల యందును నితఁడు సిధ్ధహస్తుఁడు. ఆయాదృశ్యములేమి పాత్రలేమి వానివాని యహార్యములతో, స్వరూప, స్వభావములతో, మనకన్నులముందు సాక్షాత్కరించును.
తెలుఁగు పద్య రచనాచాతుర్యము నీక్రింది పద్యములయందు గమనీయము
కం: కఱిఁదిగుచు మకరి సరసికి
కఱిఁదరికిని మకరిఁదిగుచు గఱకఱిఁ బెరయన్
కఱికి మకరి మకరికిఁగరి
భరమగుచును నతలఁ గుతల భటులదరిపడన్;
కం:అడి గెద నని కడు వడిజను
నడిగినఁ దన మగుడ నుడువఁడని నడయుడుగున్
వెడ వెడ జిడిముడిఁ దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్;
పైపద్యముల లో నన్నియు తెలుఁగు పదములేయగుట గమనీయము. అంతేగాక యమకమను శబ్దాలంకారము పెత్తనము చెలాయించినది.
తత్సమ పదప్రయోగచాతుర్యము నీక్రిందిఃపద్యములలో గమనితురుగాక!
మ: అటగాంచెన్ కరణీ విభుండు నవ ఫుల్లాంభోజ కల్హారమున్
నట దిందీ వర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
జటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబు గాసారమున్;
మ: ఆదిన్ శ్రీ సతి కొప్పుపైఁ దనువుపై యంశోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోల తటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందుఁ గరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మే
ల్గాదే! రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
చక్కని తత్సమపదలాలిత్యము పదాంత్య ప్రాస వ్న్యాసము. యెంత గొప్పగానున్నది పద్యము. విష్ణు కర వైభము! చెప్పుటకు వీలులేదు.
పోతన వర్ణనా సామర్ధ్యమునకాతని వచనములే నిదర్శనము. భాగవతమునందలి పద్యములన్నియు వెలగట్టలేని మణులు. యింక నందలి బాలకృష్ణుని లీలలు, ప్రహ్లాదచరిత్రము, వామనావతారము, గజేంద్రమోక్షణము మొన్నగు వివిధఘట్టములు వెలగొనలేనిఃదివ్య మణిమయ హారములు. మందార మకరంద ధారాసిక్త మైన భావములతో ప్రతి పద్యమొక నూజివీడు చెఱకు రసాల మామిడి పండువలె సంతసముతోనింపి తుష్ఠిని పుష్ఠి ని పాఠకునకు గలుఁగఁజేయును ;
ఇట్లు భావత రచనతో నాంధ్ర సాహిత్యమునుఃపరిపుష్ట మొనరించిన పోతనతాను ధన్యుఁడగుటయేగాక నాంధ్రుల కందరకు ధన్యత్వ మందజేసి తరించి మనలను తరింపఁ జేసినాడనుట యదార్ధము.
ఉ: ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరమువాసి కాలుచే
సమ్మెట పోటులన్ బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెఱ పోతరాజొకడు భాగవతంబు జగధ్ధితంబుగన్;
స్వస్తిర్భవతు !