Monday, 29 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 51

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

బాల చంద్రుఁడొనర్చిన సంకుల సమరము 
మంజరీ ద్విపద :- " అటమున్నె నరసంహుఁ డధిక బలంబు
తెచ్చుక మొనజేసి ధీరత నెదుట
మద గజంబుల పైకి మత్త సింహంబు
అరుదెంచు విధమున నాశ్చర్యలీల
ఫౌజుపై నడచిరి' బాలురార్వురును .
వసుధేశు తమ్ముఁడు వారలఁ జూచి,
తనవారి కెల్లను తా సైగ జేసె;
బ్రమ్మిరి విలుకాండ్రు ఘనులపై నపుడు
బాలుఁడు మొదలైన బాలవీరులును
నారుల విండ్లను నలి నలి జేసి
తొనలును బాణముల్ తునుకలు సేయ
వెరువక యుండిరి. వీరుల పైకి
కదిసి మూకలువచ్చి కదన మధ్యమున
సాంద్ర వంశాటవీ చందము దోప ,
సిమ్మిరి సాధ్వస కరముగ నపుడు.
తలకక వారలు ధైర్యంబు నొంది
చే గదల్ ద్రిప్పుచు చెలగి యార్చుచును,
కొక్కెర గుంపుపై కుప్పించి యురకి
సాల్వంబు ఢీకొన్న చందము గాగ,
కరులపై సింహంబు గదిసిన రీతి,
వ్యాఘ్రంబు గోవుల వడి దాకునట్లు ,
సేనల జెండాడి చేతుల మెడల,
ఘ ఘనమైన కత్తుల ఖండించి మించె;
________________________
ఘనుఁడైన శ్రీనాధ కవి రాజరాజు
చెన్నుని కృప చేత చిత్తము ప్పొంగి,
బాలుని విక్రమ ప్రావీణ్య మెల్ల
జనులకు వివరించె సక్తితో దీని; 

______ _
భారత రణ క్షేత్రమున నభిమన్యునివలె బాలచంద్రుఁడు తనమిత్రుల తో గూడి విక్ర మించినాడు. అదియొక సంకుల సమరము. యుధ్ధ నీతిని ప్రక్కకు నెట్టి శత్రు వీరులను మూకుమ్మడిగా నెదిరి మట్టు బెట్టుటయే నలగాముని వర్గమువారి యెత్తుగడ. నరసింహుఁడు నలగాముని తమ్ముఁడు. పద్మ వ్యూహమున బ్రవేసించిన యభిమన్యనివలె బాలచంద్రుఁడు పలనాటి వీరుల నెదుర్కొన, నరసింహుఁడు తన వర్గమువారికి కను సైగ జేసెను. మూకుమ్మడిగా మీదపడుడని యాసూచనకు సంకేతము. వీరులందరు బాలుని పైబడి దాడిచేయసాగిరి. అయినను బాలచంద్రుఁడు బెదరలేదు. మడమ వెనుకకు ద్రిప్పలేదు. కొంగలగుంపుపై దాడిచేయు గ్రద్ద వలె, కరులపై లఘించు సిహమువలె, పెదిదపులి యావుపయి దాడిచేసిన వడువున, సేనల పై లంఘించి చీల్చి చెండాడెను. కత్తులతో వారి కుత్తకలు ఖండించెను, కాలుసేతులను తుండె తుండెములుగా నరకి పోగులు బెట్టెను. నాటి భయంకర యుధ్ధమున అక్రమ యుధ్ధమును ప్రోత్సహించిన నలగాముని తమ్ముఁడగు నరసింహ నాసుని తలనరకి తన కత్తిమొనకు గుచ్చి తెచ్చి మలిదేవరకు కానుక సమర్పించెను. ఆమరునాడు అందరేకమై నాగమ్మ ప్రోత్సాహమున దారుణాతి దారుణముగా బాలచంద్రుని నరకి జంపి ప్రతీకారమును దీర్చు కొనిరి. వీరుడై యెగసి పరుల గుండెలలో భయంకర స్వప్నమై దోచి విక్రమించి వీరుడై ప్రతిష్ఠనంది బాలుఁడు వీర మరణమును వరించెను. బాలచంద్రుని కీర్తి యాచంద్ర తారార్కమై నేటికీ పలనాట నింటింటా మారుమ్రోగుచునే యున్నది. ఇట్లు బాలుఁమరుఁడైనాడు. తిక్కన యభిమన్యు నెంతఘనముగా చిత్రించెనో , శ్రీనాధుఁడునూ నంతకు తక్కవ గానిరీతిని బాలచంద్రుని చిత్రించి ధన్యుఁడయ్యె ననుట తధ్యము!
పలనాటి వీర చరత్రమున నెన్నదగిన పాత్రలు 
1 బాలచంద్రుఁడు 2 బ్రహ్మ నాయుఁడు 3 నాయకురాలు నాగమ్మ ;
ఇది వీర చరిత్ర యగుటచే వీరునకే ప్రధమ ప్రాధాన్యము. బాల చంద్రుఁడు బ్రహ్మ నాయుని యేకైక కుమారుఁడు. మగువ మాంచాల యితని భార్య యాపన్నసత్వ(గర్భవతి) నవోఢ.
బాలుఁడు మహాసాహసి, మహావిక్రమ సంపన్నుఁడు. ప్రభుభక్తి పరాయణుఁడు. రణకోవిదుఁడు. యెంతమంది మీదపడినను చలింపక వెనుదిరుగక , శత్రు సంహారమే యెకైక లక్ష్యమై సాగిపోవు మహావిక్రమాటోపముఁగలవాడు. కూటయుధ్ధమున వంచనతో తనను గెలువ నుంకించిన నరసింహ నాయుని దారుణముగా జంపి వాని శిరమును కత్తికి గుచ్చి శత్రువులను హెచ్చరించిన ధీశాలి. యుధ్ధరంగమున వీరమరణమును వరించిన రణవీరశిఖామణి! మగువ మాంచాల యితనికి తగిన భార్య! యుధ్ధమునకేగు భర్తను ప్రోత్సహించి స్వయముగా రక్తముతో వీరతిలకమును దిద్దిపంపిన ధీరవనితామతల్లి!
బ్రహ్మ నాయుఁడు పలనాటి కృష్ణునిగా బ్రసిధ్ధినందిన యశస్వి! భారత యుధ్ధమున నిరువాగులకు శ్రేయమును గూర్చుటకై శ్రీకృష్ణుఁడెట్లు పరిశ్రమించెనో, యంతటిపరిశ్రమమును చేసినవాడు బ్రహ్మనాయుఁడు. నలగామునకు , మలిదేవునకు నడుమ రగిలిన వైరము నుపశమింప జేయుటకు కతడు చేయని యత్నములేదు. పడనిపాట్లులేవు. యెప్పటికప్పుడు నాగమ్మ కుటిలముతో నాతడొనర్చిన హితకార్యములన్నియు వ్య్రర్ధము లగుచుండెను. నిరువాగులకు యుద్దమును వారించుటకు నతడొనర్చిన యత్నములన్నియు నేటిలో బిసికిన చింతపండు వలె వ్యర్ధములు కాగా విధిలేక సమరమునకు గడంగెను. ఆవలిపక్షమువారు అధర్మ యుధ్ధమొనరించినను తనవారిని ధర్మము తప్పరాదని వారించెను. బాలుడు నరసింహుని తల నరకి తేగా నతని యకృత్యమును నిర్ ద్వంద్వముగా నిరసించెను. తుదకు నలగాముడోడిపోయి చేతికి చిక్కినను వానిని జంపక క్షమించి తిరిగి గురజాలకు రాజుగా జేసి సగౌరవముగా బంపెను. తనను చివరి వరకు నమ్ముకొన్న మలిదేవరకు మాచర్ల రాజధానిగా రాజ్యము నప్పగించి తనప్రభు భక్తిని చాటుకొనెను; అతనికి పుత్ర శోకాదులులేవు. కాప్యదీక్షయే ప్రధానము. ప్రజల యోగక్షేమ ములే ప్రధానము. అతడొకత్యాగశీలి! ప్రభుభక్తికి ప్రతీక! ధర్మావతారుఁడు .పలనాటికృష్ణుడను బిరుదమతనికి సర్వధాసముచితమైనదే!
కుటిలనీతికి, కుహనాతంత్రములకు, మిత్ర విరోధమునకు , విషప్రయోగాలకు, అహంకారమునకు, అసంబధ్ధకార్య కలాపములకు, నిలువెత్తు సాక్ష్యము నాయకురాలు నాగమ్మ; భారత కధలోృశకుని వంటిది నాగమ్మ! తనను నమ్మిన వారిని చేతిలో నదిమి పెట్టి నట్టేట ముంచుట యీమెస్వభావము: తన పంతము నెగ్గుటయే యీమెకు ప్రధానము . మోసపూరితంగా మలిదేవాదులను కోడిపందెములలో నోడించి రాజ్యమువెడల నడచి యవధి యనంతరము రాజ్యమీయనీయక సంధి పొసగనీయక వేధించి బలవంతముగాయుధ్ధమునకు ప్రేరణజేసినదీమెయే! ఈమెకుటిలమువలననే పచ్చని పలనాడు సర్వ నాశనమై పీనుగుల దిబ్బగామారినది; నేటికీ పలనాట దుష్టవనితలను యేమే నాగమ్మలా తయారైనావు. అనిచెప్పు కోవటంవింటూఉంటాము;
ఇదీ పలనాటి వీర చరిత్రము
శ్రీనాధ కవిసార్వ భౌముఁడు మంజరీ ద్విపదలో సర్వజన వేద్యముగా రచించి ప్రజాసాహిత్యమునకు రూపు రేఖ లను తీర్చి దిద్దినాడు.
ఇఁతటితో నీప్రసంగమును నిల్వరింతము. రేపు శ్రీనాధుని జీవన ప్రస్థానమున తుదిమజిలీ! చెప్పుకుందాము నేటికి సెలవు.

No comments:

Post a Comment