Friday, 19 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 42

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

కం:- వాాణికిఁ జరణానత గీ 
ర్వాణికి నేణాంక శకల రత్న శలాకా
వేణికిఁ బుస్తక వీణా
పాణికి, స ద్భక్తో ను పాస్తి యొనర్తున్;
హరవిలాసము- అవతారిక- 4వ పద్యం ;
భావము:- పదముల కెఱఁగి నమస్కరించు దేవతలు గలదియు, వాక్ స్వరూపిణియు, ( దేవ భాషారూపిణియు) చంద్రఖండము రత్నాలంకారముఁగా గలదియు, పుస్తకము, వీణయు , హస్తమునందు ధించునదియును, అగు వాగ్దేవతారూపిణి కి వాణికి సద్భక్తి తో నమస్కరింతును . పద్యము చిన్నదే! భావము మాత్రము మిగుల గొప్పది. దేవగణములకన్నింటికి ప్రతిదినము నామెకు నమస్క రింపనిదే గడువదు. వాగ్దేవతగదా! వాక్కు కామ ధేను సదృశము . చక్కని వాక్యములు పలుకగలిగితే కోరిన కోరికలు నెరవేరును. లేదా వ్యతిరేక ఫలములు. కావున నామె యనుగ్రహము దేవతలకైనను యవసరమే! అందరూ నలంకారముఁగా సిగలో పూవులఁ దురిమెదరు. అవి వాడిపోయెడివిగదా! ఈమెధరించు చంద్రఖండము రేయింబవళ్ళు జ్ఙాన జ్యోత్నలను వెదజల్లుచునే యుండును. నుడులే గుడులైన పుస్తముక మును , సంగీత సాధనమగు వీణను చేతబట్టినదనిన, సాహిత్య- సాహిత్య ముల సమాహారమే యామె స్వరూప మని నిరూపణమగుచున్నది. ఇట్లీపద్యము అనవద్యమై హృద్యమై శ్రీనాధవాగ్వైభవ విహారిణి వాణికి మణిహారమై యొప్పారు చున్నది గదా!
మన మిప్పుడు శ్రీనాధుని వెంటఁబయనించు చున్నారము. కవిసార్వ భౌముఁడు సముచిత పరివారముతో, ఛాత్ర గణములు వెబడిరా స్వర్ణ పల్యంకికలో పయనించు చుండెను. శరీరము మాత్రను పల్లకిలోనున్నది. మనస్సు మాత్ర మూహలలో దేలిపోవుచున్నది. ఔరా! యెంత కాలమైనది నేను రాజమహేంద్రమును వీడివచ్చి. ప్రభువు వీరభద్రారెడ్డి యెట్లుండెనో? యతనిభార్య నాసోదరి సమాన యనితల్లి యెట్లున్నదో? ప్రభు సోదరులు యల్లాడ వేమారెడ్డి యెట్లుండిరో? పరివారులెట్లున్నారో? మహామంత్రి బెండపూడివారు కుశలురేగదా నాకేవయసుపైబడుచుండ నప్పటికే వయోవృధ్ధులైన వారెట్టులుందురు?
నిత్యము పావన గోదావరీ వారిలోఁదోగాఁడి , పవీకృతమైన దేహమానసములతో మార్కండేయేశ్వరుని మనసార బూజించి, మదన గోపాలు దర్శన భాగ్యమునంది గృసీమకేగి , పరమ శివుని బూజించి, పంచాక్షరీజప ధానపరాయణఁడనై షడ్రసోచిత భోజనముల నారగించుచు, సుఖముగానుండు నాకేల గౌడ డిండిమునిపై యసూయగలుఁగవలెను? కలిగినదిపో, నేనేల రాజమహేంద్రిని వీడివిజయ నగరమునకేగితిని? నకకాభిషేకమున నాకొరగినదేమి? కవి సార్వభఔమ బిరుదము ఔఎత్సుక్య మాత్ర సంతృప్తని మాత్రమేగదా మిగిల్చినది. సంవత్సరముల తరబడి వరుస ప్రయాణములతో నొడలు హూనమైనవి. అహో! ఆశను, అసూయను , ఆగ్రహము లను జయించినవారేగదా యుత్తములు!
ఇంతక నిన్ని దినములుగా దేశదేశములుఁదిరిగి దిరిగి నేను సాధించినదేమి?" ఇహమేగదా!" మరిపరమో? ఆవగింజంతయైనలేదు. పాజ్ఙులు- యేమనిచెప్పుచున్నారు-
శ్లో: వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్
నిశార్ధ మర్ధం దివసా యతేత
వార్ధక్య హేతో ర్వయసా యతేత
పరత్ర హేతో రిహ జన్మ నాచ! 
- యనిగదా!(వర్షాకాలమున సుఖ పడుటకు తక్కినయెనిమిది నెలలు కష్టపడుము. ( పూర్వకాలమున ప్రయాణ సౌకర్యములు లేమి వర్షాకాలము గ్రామాంతరములకుఁబోయెడివారుగాదు .) రాత్రి సుఖపడుటకు పగలు కషటపడు. ముసలితనమున సుఖపడుటకు వయస్సులో ప్రయత్నించు. పరంకోసం ఇహంలో ప్రయత్నించు అనిశ్లోకార్ధము) విజ్ఙల యభిప్రాయము. మరి యింతదనుక పరార్ధమైనేను ఁజేసినదేమి గలదు? వయసువాటారు చున్నది. ఇకనైన నాప్రయత్నము ననుసంధిపక తప్పదు. ఇట్టియాలోచనలమూలమున శ్రీనాధునిలో కొంత మార్పు యేర్పడినది. వేషభాషల లోనేగాక చిత్తవృత్తిలేనను నామార్పు స్పష్టముగా నగుపడ సాగినది.
వెనుకటివలె నిపుడతడు విషయ లోలుఁడుగాడు. నిరంతర పంచాక్షరీ జప పరాయణఁడు. త్రిషవణ స్నానలోలుఁడు. త్రిసంధ్యావన సంప్రవర్తకుఁడు. మాటలోగాభీర్యము చేతలలోగాభీర్యము, పరాచికములమాటలు తగ్గినవి, వాచాలత మందగించినది. వెనుకటివలెనిపుఁడాతడు కస్తూరీ, చందన చర్చనా లోలుపుఁడు గాడు. మెడలోతారహారములకు బదులు రుద్రాక్షలు చోటుచేసికొన్నవి. నుదుట గంగమట్టితోబాటు భస్మత్రిపుండ్రములు చోటుచేసికొన్నవి. వెనుకటి వలె పట్టుపుట్టముగాక, నుదికిన మడుగు ధోవతులనే గట్టసాగెను. రాజ చిహ్నము లగుటగాబోలు చెవిని నవరత్న కుండలములు, హస్తములకు బంగరు సింహ తలాట కంకణములు మాత్రము మెరయుచు గనబడసాగినవి. ఇట్లు బాహ్య అభ్యంతరమ్ములయందు మార్పు లేర్ప రుపబడిన శ్రీనాధ కవిసార్వభౌముడు కతిపయ ప్రయాణముల గోదావరీ తీరమునకుఁ జేరినాడు.గౌతమీ నదికి అంజలి ఘటించి, వినమిత గాత్రుఁడై మ్రొక్కి గ్రుంకులిడి, తదుపరి తనపరివారముతో నావలపై గౌతమిని తరించి-
సీ: ఉండు నేవీట మార్కండేయ మునినాధ
సజ్జలింగ మనంగ శాసనుండు;
ప్రవహించు నేవీటి పశ్చిమ ప్రాకార
మొరసి గంగమ్మ సాగరుని కొమ్మ;
యావిర్భవిచినాఁడేవీటి కోటలో
బలభేది మదన గోపాల మూర్తి;
పాలించు నేవీటి ప్రాగుద క్కోణంబు
సుమ బోఁటి శ్రీ ముల్లఁగూరి శక్తి;
తే: ప్రబల ధారా సురత్రాణ భద్రజాతి
కరి ఘటాసైన్య దుస్సాధ కనక లోహ
గోపుర ద్వాః కవాట ప్రదీపిత మది,
సాంద్ర విభవంబు , రాజమహేంద్ర పురము!
భావము:- ఏపట్టణంలో మార్కండేయ స్వామి రూపంలో శివుఁడు వెలసి యున్నాడో! సాగరపత్నియగు గోదావరి యేపట్టణమునకు పశ్చిమ తీరమున ప్రవహించు చున్నదో, మదన గోపాలస్వామిపేరున నేవీటికోటలో విష్ణువు కొలువై యుండునో, ముల్లంగూరమ్మ పేరుతో తూర్పు దిశాభాగము నేశక్తి రక్షించు చుండునో, మదజలధారలతోనొప్పు సుల్తాను వారి భద్ర గజములు గూడ భేదింపలేని లోహనిర్మిత ప్రాకార ద్వార ములచే నొప్పు మహావైభవమైనది. రాజమహేంద్ర వరము. అనిదీనిభావము:
అట్టి దుష్ ప్రవేశమైన రాజమహేంద్రమును శ్రీనాధుఁడుచేరెను. నేటికింతటితో మనప్రసంగమును ముగింతము. రేపు తక్కిన విషయములు ముచ్చటింతముగాక! సెలవు!

No comments:

Post a Comment