Sunday, 14 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 38

 కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు 
ఉ: శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
సార తుషార హార రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారత దాల్చు నిన్ను మది గన్గొన గల్గెడి భాగ్య మెన్నఁడో?
అమ్మా!ఓశారదా! చదువులతల్లీ! తెలి మబ్బులను, చందమామను, పచ్చకప్పురమును, రాజహంసను, మల్లెపూవును, మంచును, ముత్యాలహారమును, వెండికొండను, రెల్లుపూలను, ఆదిశేషుని, మొల్లపూలను, మందారములను, పాలసంద్రమును, తెలిదామరపూలను, దేవతా ప్రవాహమగు గంగను,మించిన శ్వేత వర్ణముతో విరాజిల్లు నిను ఈ కన్నులతోఁ జూచు భాగ్య మెన్నడు గల్గునోగదా! యనిభావము.
నాటి రాత్రి యందరును కమ్మగా నిదురించిరి. మరునాడు భోజనసమయ మైనది. శ్రీనాధసోదరి యతని యతని యభిరుచుల కనుగుణముగా నవరస పరమాన్నములతో విందు భోజనము సమకూర్చినది. పోతన శ్రీనాధులిరువురు భోజనము చేయసాగిరి శ్రీనాధుఁడు యొడలుమరచి భోజన పారవస్యమున నుండగా పోతన కుమారుఁడగు మల్లన శ్రీనాధ దుహిత యగు కమలను రహస్య ప్రదేశమున నండబనిచి యొకబండ రాయి నెత్తి నూత బడవైచెను. దబ్బుమను చప్పుడాయెను . అంత" మామా! మీకమల బావిలో పడినది రండు కాపాడుడు " అని బిగ్గరగా నరచెను. అంత శ్రీనాధుఁడు దిగ్గున లేచి యంటచేతినైన కడుగు కొనక, " అయ్యో!బిడ్డా! యొక్కగానొక్కదానవు నీగతి యిట్లాయెనా"? యనిపరిపరి విధముల బిగ్గరగా గొంతెత్తి యఱచుచు నూతిచుట్టుఁదిరుగ సాగెనట! ఇంతలో పోతన్న చేతులను పరిశుభ్రమొనర్చుకొని వచ్చి "యేమిదిబావగారూ! కమలను గాపాడు పధ్ధతి యిదియా? రక్షించు సాధనములేవి? మీరొక్కరువచ్చినంతమాత్రమున కమల రక్షింప బడునా యేమితమ యవివేకమని బలికి మేలమాడుచున్నంత మల్లన నవ్వుచు నిలుచు నంతలో కమలయేమెరుఁగని దానివలె యక్కడకు వచ్చినిలచెను. దానితో కవిసార్వ భౌమునకు వారాడిన నాటకమంతయు నర్ధ మైనది. అంత పోతన " బావగారూ! మీకుమార్తె నూతఁగూలెనను వార్త చెవిని బడినంతనే తమరెట్లు పరుగిడితిరో యట్లే యాజగద్రక్షకుఁడును యాతురతోఁబరువెత్తెను . అది యప్పటి పరిస్థితికి సహజమే! తరువాతి పద్యమును వంటిరిగాదు. రండనుచు, గృహములోనికి గొనిపోయి భాగవత గ్రంధమును దెరచి యిట్లు చదువ సాగెను.
మ;- తనవెటం సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్, వానివె
న్కను బక్షీంద్రుఁడు; వానివెన్కను ధనుః కౌమోదకీ శంఖచ
క్రని కాయంబును; నారదుండు, ధ్వజనీకాంతుండు, రావచ్చిరొ
య్యన, వైకుంఠ పురంబులోఁగలుగు వారాబాల గోపాలమున్;
అనుపద్యమునుచదివి , ఆయుధములు మనకు గానియా జగద్రక్షకున కేల? వలయుచో సంకల్పమాత్రముననే యతనికడవ్రాలవా? 
విచిరిగదా పరివారము ఆయుధ సంపత్తి యొకటననేల? వైకుఠమే నాశ్రీహరివెనుక తరలి వెడలినది. వినుడు 
పాపమాతనివెనుక నడచుచున్న శ్రీసతి పాటులు.
మ: తన వేంచేయు పదంబు పేర్కొనఁడనాధ స్త్రీ జనాలాపముల్
వినెనో?మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులన్
గని చక్రాయుధుఁడేడి చూపుఁడని ధిక్కారించిరో దుర్జనుల్;
శ్రీహరి తానెటకు బోవుచుండెనో దెలుపఁడాయెను. యేదోయుపద్రవము గల్గియేయుండును. బహుశః అనదలైన స్త్రీ లెవ్వరో దేవా మామానముల గాపాడుమని యెలుఁగెత్తినారేమో? ( ద్రౌపదివిషమున జరిగినదిగదా) వేదములను దొంగలపహరించిరేమో? ( సోమకాసుర సందర్భ మదియేగదా) దేవతానగరముపై రాక్షసులు దందయాత్ర చేసిరేమో?(గతంలో చాల మారులు జరిగినదే) లేకున్న నేమగును? ఆయమ్మకే సందేహముఁగలిగినది;
కం:- అడిగెదనని కడు వడిఁ జను,
నడిగిన తన మగుడ నుడువడని నడ యుుగున్;
వెడ వెడఁ జిడిముడి దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ;
అడిగెదను గాక! యనిరెండడుగులు ముందుకేయునట! యేమియు లాభములేదు. ఈతొందరలో నడిగినను చెప్పడు అనివిరమించునట! ఈయాలోచనలోమునిగి ఊగు లాడుచు నాయాది లక్ష్మి బడుచున్న నడకలలో తడబాటును పోతన నీడకార యమకముతో చక్కగా నిరూపించినాడు. అచ్చతెనుఁగు పదములతో ముచ్చట లొలుక బలికిన ఈపద్యము ఆంద్ర సాహిత్యముననే యొక్క మణిపూస! ఇది యొకయక్షర శిల్పము . అనల్పములైన యట్టి యక్షర శిల్పములకు గనులు పోతన పద్యములు. అమ్మనీయునికవితాసరస్వతికి మనసాజోహారులు!
పోతన కవితా శిల్పమును గాంచియచ్చెరువంది, యతనినిశ్రీనాధుఁడు బహుధాప్రసంశించెనట! ఆవిధముగా వారిరువురను మనముందునిలపిన జానపదులను , జ్ఙానపథులుగా సంభావిచుచు, పోతన కవితా వైభవమునకు అంజలి ఘటించుచు, నీఘట్టము నింతటితో విరమించు చున్నాఁడను; రేపటి నుండి మన సాహిత్య ప్రస్థానమిక శ్రీనాధుని యనుసరించునని నవినయముగా మనవిచేయుచు, నేటికీ ప్రసంగము ముగింతము రేపు మరికొన్ని విషయములు సెలవు.

No comments:

Post a Comment