Thursday, 11 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 35

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ: దీనార టంకాల తీర్థమాడించితి 
దక్షిణా ధీశు ముత్యాల శాల ;
పలుకు తోఁడై తాంధ్ర భాషామహా కావ్య
నైషధ గ్రంథ సందర్భమునను;
పగులఁ గొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడ డింఢిమ భట్టు కంచు ఢక్క;
చంద్ర భూష క్రియాశక్తి రాయలయొద్ద
పాదు కొల్పితి సార్వ భౌమ బిరుదు;
తే:గీ: నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావుసింగ మహీపాలు ధీవిశాలు
నిండు కొలువున నెలకొని యుండి నీవు ,
సరస సద్గుణ నికురంబ శారదాంబ!
డింఢిమ విజయానంతరము శ్రీనాధ కవి సార్వభౌముఁడు వెను దిరిగి కొండవీటి మార్గము ననుగమించెను. సశిష్యముగా నాతడు కతిపయ ప్రయాణముల మధ్యే మార్గమునగల రాచ కొండ దుర్గమునకు జేరుకొనెను. ఆదుర్గమును నాడు రేచర్ల వెలమ కులమున బుట్టిన రావు సింగ(న ) మహీపాలుఁడు పరిపాలించుచుండెను. రేచర్ల వెలమ ప్రభువులు కాకతి రాజులకు సామంతులు. అయినను , చక్రవర్తులకు వీరి పరాక్రమ సహాయమవసర పడుచుంటచే ,వారివద్ద నామ మాత్రముగ కప్పమును చెల్లించు రీతిని వారికి స్వతంత్ర పాలనాధికారమొసంగబడినది. వారును ప్రభు భక్తి పరాయణులై తమస్వాతంత్ర్యమును నిలబెట్టుకొన సాగిరి.
నిక నీ సింగమ భూపాలుఁడు సంస్కృ తాంధ్ర పారసీకాది భాషలలో నుద్దండుఁడు. కాళిదాసాది కవుల కావ్యములకు గూడ వ్యాఖ్యఁ జెప్పఁగలదిట్ట! ఇతనికి " సర్వ జ్ఙుఁడను) బిరుదము గలదు. కవిపండిత కల్పతరువై విలసిల్లిన యితని కడకే యిపుడు శ్రీనాధుఁడు చేరు కొనినాడు. ఆప్రభువు యీవరకే చారుల వలన శ్రీనాధుని విజయ గాధ నంతయు వినియుండెను . గావున సపరివారముగా నెదురేగి సముచిత సత్కారముల కవిని గారవించి సభలో సముచితాసనమున గూర్చుండఁజేసి, " కవిసార్వ భౌమా"! తమరి రాకచే మారాజ్యము పావన మైనది. మార్గాయాసము దీరునంతకు మీరు మాకథితులరై యుండగోరెద. తమకవితాగానముతో మాసభను పావన మొనర్ప గోరెద, నని సవినయముగా బలుక, శ్రీనాధుఁడు హృష్టుఁడై ,
కం:-
సర్వజ్ఙ! నామధేయము
శర్వునకే,! రావు సింగ భూపాలునకే ,!
యుర్విం జెల్లును తక్కొరు
సర్వజ్ఙుండనుట, కుక్క సామజ మనుటే!
యని యాశువుగా నొక పద్యరత్నమును సమర్పించెను. ' రత్న హారీతు పార్ధివః' యను నార్యోక్తి ననుసరించి యాపద్య రత్న విభూషితుఁడై రావు సింగ మహీ పాలు డుప్పొంగి పోయెను. ఆప్రశంసఁజేసిన దెవరు? కవిసార్వ భౌముఁడే యగుట నారాజునకు పట్టరాని యానందముఁగలిగెను.
ఇంతకు ఆపద్యమున నున్న విషయమేమి? సర్వం జానాతీతి సర్వజ్ఙః - సర్వ మెరిఁగిన వాఁడని యాబిరుదమున కర్ధము. కవియాబిరుదము నాధారముగా గైకొని " సర్వజ్ఙుఁడు అను బిరుదమునకు శివుఁడే యర్హుఁడు . ఈభువి రావు సింగమ భూపాలనకే (సర్వజ్ఙుఁడనుట) చెల్లును. వీరిరువురను కాదని యితరులను సర్వజ్ఙుఁడన్నచో, కుక్కనుజూపి యేనుఁగని చెప్పినట్లే యగునని భావము. అబ్బా! యెంత గొప్ప పొగడ్త! యెవడైనను యుబ్బి తబ్బిబ్బులు గావలసినదే! రావుసింగముని పనిగూడ నదియేయైనది. పొగడ్తకు లొంగనివారెవ్వరు? రావుసింగముఁడాదెబ్బతో శ్రీనాధునకు దాసోహ మన్నాడు. కనివిని యెరుఁనిరీతిలో ఘన సన్మానమును పచరించెను.
మనకవి యూరుకొనలేదు. ఆయవకాశమును మరియొక పద్యమును జెప్పి సార్ధకమొనరించినాడు.
ఉ:- తక్కక రావుసింగ సుధావరుఁడర్ధుల కర్ధ మిచ్చుచో,
దిక్కుల లేని కర్ణుని , దధీచిని, ఖేచరు, వేల్పు మ్రాఁకు , బెం
పెక్కిన కామధేనువు, శిబీంద్రుని, నెన్నెదు భట్ట! దిట్టవై ,
కుక్కవొ? నక్కవో? ఫణివొ? క్రోఁతివొ? పిల్లివొ? బూతపిల్లివో?
మా రావు సింగభూపాల శేఖరుఁడు ప్రత్యక్షముగానిపుడు యాచకుల దారిద్ర్యములను తొలగిపఁ జేయునటు వితరణ మొనర్చుచుండ , నేమిరాభట్టూ! యెక్కడివాడవురా నీవు.? ఇపుడీ లోకమున గానరాని కర్ణుని, దధీచిని, శిబిని., దానశౌండులని పొగిడెదవేమిరా? నీవేమయనా కుక్కవా? నక్కవా? ఫణివా? కోతివా? పిల్లివా? లేకబూతపిల్లివా? యనిదీనియర్ధము. యిదివ్యాజ స్తుతి యను నలంకారము . దీనిసంగతి తరువాత చూతము నేటికింతటితో నాపుదము రేపు మరి కొన్ని విషయములు. సెలవు!

No comments:

Post a Comment