Thursday, 4 June 2015

కవిసార్వ భౌముడు శ్రీనాధుడు 28

కవిసార్వ భౌముడు శ్రీనాధుడు

మ: అటవీ సూకర మేల? యేలఫణి? యేలాకొండ? లేలా దిశా 
తట వేదండము? లేల కూట కమఠాధ్యక్షుండు? సప్తాబ్ధి సం
ఘట నాలంకృత మధ్యమైన నిఖిల క్ష్మాచక్రవాళంబు ; నె
క్కటి దాల్పం ద్రిపురారి వల్లభు భుజా కాండ ద్వయం బుండగన్ ;
భావము; ఆది వరాహము,ఆదికూర్మము, ఆది శేషుడు, దిగ్గజేంద్రములు, మొన్నగునవి సప్త సముద్ర ముద్రితమైన పృధ్వీ బారాన్ని మోస్తూ ఉంటాయని పురాణ కధనం. శ్రీనాధుడంటాడూ, మావల్లభామాత్యుని భుజా ద్వయమే ఆకార్యమును సునాయాసముగా నిర్వ హింపగలదు. కావున వారందరూ నిక విశ్రాంతిని గైకొన వచ్చునని; అతిశయోక్తి యలంకారము. అయనను నప్పటి యోరుగంటి కాకతి కామ్రాజ్యమున కతడొక పెద్దయండగానిలిచెనని చెప్పక తప్పదు.
రుద్రమ దేవి యనంతరము ప్రతాప రుద్ర దేవుడు రాజయినాడు. అతడు దుర్బలుడు. పరాక్రమ రహితుడు. లలిత కళావిలాస మాతని జీవితము . వారాంగన మాచల్దేవి యతని యారాధ్య దేవత . నిత్య వసంతోత్సవములతో నిర్విరామ మైన సంగీత సాహిత్య కార్య క్రమములతో నాతని మందిరము మారుమ్రోగు చుండెడిది. ప్రజలకు ప్రభు దర్శనమే దుర్లభము . అట్టితరి రాజ్య పాలన మంత్తులపైబడినది. ప్రక్కనున్న గోల్కండ సుల్తానులు, బిజాపుర నవాబుల తోడ్పాటుతో కాకతి సామ్రాజ్యము నాక్ర మింప నెత్తులు వేయు చుండిరి. అట్టితరి, వల్లభామాత్యుని మంత్రాంగమే యారాజ్యమును రక్షంచినది.
వల్లభామాత్యుడు సామాన్యుడుగాడు. మంత్రాంగ దక్షుడు. భైరవోపాసకుడు. భైరవోపాసన క్షుద్రమే కానీ యదిఫలించిన సర్వ శక్తులు హస్త గతమగును. వల్లభుడు మంత్ర సిధ్ధినందినవాడు . తాంత్రిక విద్యలోదిట్ట అందుచేతనే యతడాడినది యాటగాచెల్లెను. వశ్యవాక్కు, సమ్మోహననము, జయసిధ్ధి, యిట్లెన్నో శక్తులతని స్వంతము. తత్కారణముననే శ్రీనాధుడీతని యాశ్రయమును సంపాదించినాడు. పైగా రాజ బాధవ్యములుగలవాడు. యితని తండ్రి విజయనగర సామ్రాజ్యమున ధనభాండాగరాధ్యక్షుడు. ఇతనిప్రాపుచే విజయ నగరమున తన విజయము నిర్వ హింపబడవలె, నందుచేతనే యీకావ్య నిర్మాణాది కార్యక్రమములు. ఇక ప్రస్తుతమునకు వత్తును.
క్రీడాభిరామమును తనపేర వెలయిచి చక్కని కృతితో తనను సుకృతి నొనరించిన మిత్రునకు ఘన సత్కార మొనరింప వల్లభుడెంచి, యొకనాడు మిత్రుని బిలచి బిగియార కౌంగిలించి, మిత్రమా! నీవొనరించిన యుపకార మనన్య సామాన్యము. చక్కని కతిని యాశుగా నిర్మించి నాపేర వెలయించి మహనీయమైన సత్కారము నొనరించినావు. చిరతరకీర్తికి భాజను నొనరించినావు. చెప్పుము యేమిచ్చిన నీఋణమీగును? నీమనంబున నున్నది కోరుకొనుము మరుమాట యాడక నొససంగెదను.
అనిపలుక మిత్రుని గాంచి ముసిముసి నగవులీను ముఖపద్మమును గంభీరముగా మార్చి చేతులు జోడించి శ్రీనాధకవి తన కోరిక ను వెల్లడించుట కుపక్ర మించెను.
నేటికింతటితోవిరమింతము రేపు తక్కిన విషయములు ముచ్చటించు కొందము సెలవు.
( కవిసార్వ భౌముడు శ్రీనాధుడు ధారావాహిక రేపు 29 వ; భాగము )

1 comment: