Saturday, 6 June 2015

కవిసార్వ భౌముడు శ్రీనాధుడు - 29

కవిసార్వ భౌముడు శ్రీనాధుడు

ఉ: కంటికి నిద్ర వచ్చునె, సుఖంబగునే రతి కేళి, జిహ్వకున్ 
వంటక మిందునే, యితర వైభముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబు గలయట్టి మనుష్యున కెన్నఁడేనియున్,
కంటకుఁ డైన శాత్రవు డొకండుఁ దనంతటి వాఁడు గల్గినన్;

మిత్రమా! వినుము నాహృదయమున శల్యాయమానమై నన్ను పీడించు చున్న విషము నెఱింగించెదను. నీకుగాక మరెవ్వరితోఁ జెప్పు కొన్న నేమి ప్రయోజనము గల్గును? మహాశక్తి సంపన్నుడవైన నీకుగాక యితరులకు సాధ్యమగువిషయముగాదు. " విజయ నగర ఆస్థాన పండితుఁడగు గౌడ ఢింఢిముని గరువపు మాటలు నాహృదమును గాఢముగా నొప్పించినవి . యేమాగర్వము. అరుణ గిరి సనాధుడట! కవి సార్వ భౌముడట! వీనిబ్రతుకున కొక కంచు ఢక్క. యాకంచుఢక్కమ్రోతలు మనయాంధ్ర కవులపాలిట ప్రమాదఘంటికలై మ్రోగుచున్నవి. అబ్బబ్బ! యాతనిమాటవినుట తోడనే నాయొడలు భగ్గున మండుచున్నవి. విజయ నగర సభాంగణమున ప్రౌఢ దేవరాయని సమక్షమున నాపండిత బ్రువుని చిత్తు చిత్తుగా నోడించి, యాకంచు ఢక్కను నామరూపములు లేకుండ బగుల గొట్టించిన గాని నాకోపాగ్ని చల్లారదు. దుష్కరమైన యికార్యమును సాధించుటకు నాకు నీతోడ్పాటుకావలెను" ఉపాయ మాలోచింపుము. విద్యానగరమున పౌఢరాయల దర్శనమునకు తగిన యేర్పాటులొనరించి యా డింఢిమాధమునితో పండిత కలహమును సృష్టించ వలయును. గర్వాంధుడయిన యతడే కయ్యమునకు కాల్ ద్రువ్వ వలెను. అంతటితో నీపనిపూర్తియగును కాగల కార్యమును నేను నిర్వ హింతును. మనదెబ్బతో డింఢిముఁడోడి యంటిదారి పట్టవలె తెలుగు కవుల వెలుగు రేఖలు కర్ణాటకమున దిగంతములకు వ్యాపింపవలె నని " పలికెను .
శ్రీనాధునివచనములను విని వల్లభామాత్తుఁడు కనులు మూసికొని కొంత తడవు యోచన చేసెను.
శా: సారాచారమునన్, వివేక సరణిన్, సౌభాగ్య భాగ్యంబులన్,
దౌరంధర్యమునన్, ప్రతాపగరిమన్, దానంబునన్, సజ్జనా
ధారున్, దిప్పన మంత్రి వల్లభు, నమాత్య గ్రామణిన్, బోల్పఁగా
వేరీ మంత్రులు? సిధువేష్ఠిత మహోర్వీ చక్రవాళంబునన్; 

చక్కనియాలోచన యందును, యుక్తాయుక్త విచారమునందును, సంపదల యందును, కార్యనిర్వహణ మందును, పరాక్రమము నందును, దానమునందును, సజ్జనులను రక్షించుట యందును, ఈభూవలయమున వల్లభామాత్యుని వంటివారు లేరని పద్య భావము. ఇదిసత్యదూరముగాదు. వల్లభుడు అన్నిటను ఘనుఁడే!
వల్లభామాత్యున కుపాయము స్ఫురించినది. ప్రక్కనున్న దస్తరమునుండి యొకలేఖాపత్రమును గొని దానిపై నేమియోవ్రాసి యొకమారు చదువుకొని, యొక లేఖాహారుని బిలచి" నీవు వేగమే విజయ నగరమునకేగి మానాయన గారికీలేఖనందించి రమ్మని యంపెను. మిత్రమా చింతవలదు నీప్రతీకారమునకు దగినయేర్పాటు గావించినాను. నీవిజయమిక సునాయాసము పోయి విజయుడవై తిరిగి రమ్మని పలికెను.
ఇంతకు లేఖలోనున్నవిషయమేమి యదియంతయు నాంతరంగికము. మనకుగాదుగదా! వినుడు, " పూజ్యులు పితృపాదులకు నమస్కృతులు. ఉభయకుశలోపరి, విన్నవించు లేఖార్ధములు. అనతి కాలముననే యనగానేడోరేపో మీవిజయనగరమునకు మామిత్రుఁడు , శ్రీనాధ కవీద్రుఁడరుదెంచగలడు. అతఁడుద్దండ కవిపండితోత్తముఁడు .సంస్కృత శౌరసేనీ ప్రాకృత ఆంధ్రాది భాషలో దిట్ట. బహుకావ్య నిర్మాణ దక్షఁడు. తర్క వ్యాకరణ అలంకారశాస్త్ర ప్రవీణుఁడు . ఆగమశాస్త్ర కోవిదుడు షడ్దర్శన పారంగతుఁడు. న్యాయశాస్త్ర పండితుడు వాదనానిపుణుఁడు. వేయేల మన డింఢిమునికన్న వేయిమడుంగులెక్కువ యగువాడు జ్యోతిష ప్రవీణుఁడు. యితని సాయమున డింఢిము నోడించి తెలుగు తేజమును విజయనగర సభలోప్రతిష్ఠింపజేయుము. మనయాశయము సిధ్ధించును. సరహస్యము సుమా! డింఢిమునకు శ్రీనాధునితో కృతక వైరమును గల్పిపుము . రాజదర్శనమునకు దారులు తీర్చుము. కాగల కార్యము నతఁడే నిర్వహించు కొనును. మనము కేవలము నిమిత్త మాత్రులమే!
చిత్తగించగలరు! మీ వల్లభఁడు; ఇదీ సందేశము!
మనమింతటితో నేడీ ప్రసంగమును విరమింతము రేపు తక్కిన విషయములు ముచ్చటించు కొందము. సెలవు

No comments:

Post a Comment