Tuesday, 16 June 2015

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 39

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ:- పర రాజ్య పర దుర్గ పర వైభవశ్రీలఁ 
గొనగొని విడనాడు కొండవీడు;
పరి పంథి రాజన్య బలముల బంధించు
కొమరు మించిన జోడు కొండవీడు;
ముగురు రాజులకును మోహంబు పుట్టించు
గుఱుతైన యుఱి త్రాడు కొండవీడు;
చటుల విక్రమ కళా సాహసం బొనరించు
కుటిలాత్మకుల గాడు కొండవీడు;
తే: జవన ఘోటక సామంత సరస వీర
భట సటానేక హాటక ప్రకట గంధ
సింధు రారవ యోహన శ్రీలఁ దనరు
కూర్మి నమరావతికి జోడు కొండ వీడు!
భావము:- శత్రురాజ్యములను ,శత్రు దుర్గముల వైభవ లక్ష్మని జయించి తనలో చేర్చుకొను నట్టిది ఈకొండవీడు . శత్రు సైనికులను బంధించి యుంచుటకు దగిన శక్తి యుక్తులకు నెలవైనది యీ కండవీడు.
కాకతి, విజయనగర, బహమనీ, రాజులకు మోహము ననుసంధింప జేయు యుఱిత్రాడును బోలినది యీకొండవీడు. భయంకరమైన యుధ్ధ కళాపాటవంతో ఆక్రమింపఁ జూచే మోసకారులను బొంద బెట్టు మరుభూమి యీకొండవీడు. యవనాశ్వ ములతోడను, సామంత రాజులతోడను, సరస వీరభట సముదాయముల తోడను, మదగజముల ఘీంకారముల తోడను గూడి యుండి , యుధ్ధ వైభములకు నెలవయి, దేవతా రాజధాని యమరావతికి దీటైనది యీకొండ వీడు. (అరివీరులకు సాధింప నలవిగానిదని యీపద్య భావము.)
ఈకొండవీడు రెడ్డి రాజుల సామ్రాజ్య వైభవమునకు పట్టుఁగొమ్మ . మన నిప్పుడు శ్రీనాధునితో కొండవీటి మార్గమును యనుసరించుచున్నారము .రాచకొండ దుర్గమునకు వీడ్కోలు పలికిన , కవిసార్వ భౌముఁడిక తడవుసేయక స్వ రాజ్యమునకేగ నభిలషించినాడు యనుకున్నది దైవ సహాయమున మిత్ర సహాయమున సాధించినాడు పంతము దీరినది. వంత యంతయు దొలగినది పండిత వైరియగు డింఢిముని పరాజయము ఘటింపబడినది. కనకాభిషేకగౌరవ మందినది. కవిసార్వ భౌమబిరుదమా యడుగకుండగనే లభించినది. దిగ్దిగంత విశ్రాంతముగా సత్కీర్తి నలుదిక్కుల వ్యాపించినది. జన్మ చరితార్ధమైనది. ఇక శేషించిన కార్య మేమి గలదు? తనకు విద్యాధి కారి పదవినొసగి యింతకాలమును పోషించిన రెడ్డి రాజ్య సార్వ భౌముని దర్శించి సంభావించవలె, నిక తడవుసేయక కొండవీటి కేగుట తన తక్షణ కర్తవ్యముగా శ్రీనాధుఁడెచినాడు. పరివారమును హెచ్చరించినాడు. " ఇక వేగముగా ప్రయాణమును నడిపింపుఁడు. మీలోనెవరో యొకరు శీఘ్రముగా కొండవీటి కేగి ప్రభువులకు నారాక నెరింగింపుడు " అని పలుక భటులలో నొకడు అశ్వముపై వడివడిగా ముందున కేగి కొండవీటి మార్గమున ముందుకేగెను.
" ఆహా! యెంతకాలమైనది కొండవీటిని విడచి? ప్రభువులెట్లున్నారో? రాచరికపు పరిస్థితులెట్లున్నవో? నాపండిత విజయము. కనకాభిషేకము, కవిసార్వభౌముఁడనగుటయు , ప్రభులకు ఆనంద సంధాయకములై యుండును. రాచకొండ దుర్గమునకు బోవుట ప్రభువుల కాగ్రహ కారణము గానోపును. అయిన నేమగును ' నోరున్నఁ దలకాయును గదా! యెట్లో యుపాయాంతరమున ప్రభువులను ప్రసన్నులను గావింపవలె ' ననిలోఁదలపోయుచు శ్రీనాధుఁడ ప్రయాణమును గొనసాగించెను .
శ్రీనాధుని యాగమన వార్త రెడ్డిరాజులకు పరమానంద సంధాయకమైనది. స్వాగత సత్కారములకై ఘనముగా నేర్పాట్లుఁగావించిరి. వేమారెడ్డి వేదపండితులతో గలసి స్వయముగా పూర్ణ కుంభ స్వాగతమును బలుకుటకై కాచుకొని యుండెను . దేనికైన నదృష్టముండవలె ! శ్రీనాధుఁడు మిగుల నదృష్టశాలి. లేకున్న నొక సామాన్య మండలాధీశునికడ నుద్యోగించు నతడెక్కడ? కర్ణాటక సార్వభౌములచే కనకాభిషేక గౌరవ మందుట యెక్కడ? ఇక కవిసార్వభౌమ బిరుదమా ! యాతనికీర్తికీరీటమున కలికి తురాయి వంటిది. వీటికి మూల మాతని యదృష్టమేననుట నిక్కముగదా!
అదిగో శ్రీనాధుని స్వర్ణ పల్యంకిక కొండవీటిని జేరినది. ప్రభువు వేమారెడ్డియు నతనిపరివారమును, రాజబాంధవులును ,బ్రాహ్మణ బృందమ్ములును యెదురేగుచున్నారు. పురుష సూక్త సమన్వితముగ బ్రాహ్మణు లేదురేగ స్వాగత సత్కారములను పచరించు చున్నారు. " కవిసార్వ భౌమా! శ్రీనాధకవీంద్రా! బహుపరాక్ బహుపరాక్ కవిసార్వభౌమా! శ్రీనాధ కవిశేఖరా! జయీభవ! విజయిభవ! యను వంది మాగధుల నినాదములతో పరిసరములు మారుమ్రోగు చుండ, వేమారెడ్డి స్వయముగా కేలందించి శ్రీనాధ కవిసార్వభౌములను రాజమందిరమునకుఁ దోడ్కొని బోయునారు; యుచితాసనమున గూర్చుండఁజేసి, సమీపమున నుప విష్టుఁడయి, వేమారెడ్డి ముందుగా కుశల ప్రశ్నాదికములను నిర్వ హించి, నేటికి విశ్రాంతిని గైకొనుడు. మార్గాయాసమున బడలినారు. రేపు సావధానముగా మాటలాడు కొందమని పలికి నిజమంగిరమున కేగెను.
ఇంతటినేటికి విరమింతము రేపు తక్కినది ముచ్చటింతము సెలవు !

No comments:

Post a Comment