Friday, 12 June 2015

కవిసార్వభౌముఁడు శ్రీనాధుఁడు - 36

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
కం:- సత్యము సర్వ శ్రేయము ,
సత్యముఁ దక్కొండు లేదు , సధ్ధర్మ , మదే
యత్యలఘు తపః ఫలమిడు,
నిత్యత బాటించు దాన నిఖిలార్ధంబుల్;
మనమిప్పు డెచ్చట నుంటిమి? రాచకొండ దుర్గమున గదా! ఈ మాట చెవిని బడినంతనే మనకు భాగవత కర్త బమ్మెఱ పోతన గుర్తునకు వచ్చును . మనకేనని యననేల? సారస్వత ప్రయులందరకును. స్మృతి పధమున పోతన తళుక్కున మెరయును. కాన యాతనిని గూర్చి యించుకంత యాలోచింపకుండ ముందుకు కదలఁజాలము .
పోతన- శ్రీనాధుల మధ్య బాంధవ్యము ?
అసలు పోతన- శ్రీనాధుల నడుమ బాంధవ్య మున్నదా? అది యెట్టి బంధుత్వము? దానివలన గల్గిన లాభమేమి? లేకున్న గలిగెడు లోపమేమి? యను విషములను మనమిప్పుడు బరిశీలింప వలసి యున్నది . యేపరిశీలనమునకైనను వేద శిరో భూషణ మగు సత్య దృష్టి ప్రధానము.
తెనుఁగు వాఙ్మయ చరిత్ర ( కవుల చరిత్ర) మున గల చిక్కు ముడులలో ముఖ్యముగా మూడింటిని పరిగ ణింప దగినవిగా చరిత్ర కారులు భవించినారు 1 నన్నయ్య కన్న నన్నె చోడుఁడు ముందువాఁడనువాదము (మానవల్లివారిది) 2 తెనాలి రామకృష్ణుఁడు రాయలభువన విజయ మునందలి యష్ట దిగ్గజ కవుల లోనివాఁడు కాదని - అట్లే పింగళిసూరన యు రాయల కాలమున లేఁడని 3 శ్రీ నాధుఁడు-పోతనల నడుమ యెట్టి సంబంధ బాంధవ్యములు లేవని ; మూడువివాదాంశములు పైకిలేచినవి ;కొందరౌనన మరికొందరు కాదనిరి . కందుకూరి వారి కవులచరిత్రము లోపభూయిష్ట మై యనేక చిక్కులుఁదెచ్చిపెట్టినది. వారియనంతము చాగంటి శేషయ్యగారు " ఆంధ్రకవి తరంగిణి" యనుపేర 12సంపుటముల లో శాసనాధారములతో సప్రమాణముగా కవుల కాలాదులను నిర్ణయించిరి. అది సర్వ సమగ్ర మగుటచే నేటికి గూడ నదియే ప్రమాణము; వారుచాలావిపులముగా బరి శీలించి 1 నన్నెచోడుడు నన్నయ- తిక్కనల నడిమికాలమువాడని సిధ్ధాంత మొనరించిరి. 2తెనాలివారు రాయల కాలమునకు చిన్నవాడని తేలెను అట్లే పింగళిసూరనయు, కాన, వారిరువురు రాయలకొలువున లేరని సిధ్ధాంత మొనరించిరి;3 ఇక పోతన శ్రీనాధుల నడుమ గల సంబంధము గూడ గగన కుసుమ మేనని తేలినది . దీనికిమూడుఉప పత్తులుగలవు 1 వీరిరువురు తమ మధ్య గల సంబంధ బాంధవ్యములను తమగ్రంధములలో నెక్కడను ఫ్రస్తావించకుండుట, 2 పోతన- శ్రీనాధుల మధ్యగల వయోభేదము. శ్రీనాధుఁడు కాశీఖండమును రచించు నాటికి పోతన బాలుఁడగుట. 3 రాచకొండ దుర్గముతో పోతనకు గల సంబంధము నకు ఆధారములు లేకుండుట. భోగినీ దండక కర్తృత్వము గూడ వివాదాస్పదమగుట, కారణములుగా పోతన- శ్రీనాధుల నడుమ గలసంబంధము అభూతకల్పన మని సిధ్ధాంతము నొనరించిరి.
కానీ, లోకమున ననేక కధలు వారిరువురి సంబంధమును దెలుపు చున్నవి ప్రచారములోనున్నవి. సినీమాధ్యముగూడ దీనిని సొమ్ముఁజేసికొన్నది " వాహినీ వారి - భక్త పోతన" యాంధ్రుల హృదయమున చెరుగని ముద్రవేసినది. ఇక నాటక సంఘమువారలా? చెప్పుటకు వీలు లేని ప్రచారమును గల్పించి నాటకములాడినారు . మరి యింతజరిగిన వెనుక కాదన్న నూరుకొందురా? మాడు బగులగొట్టక మానరు; మరియేమి దిక్కు? సత్యముకాదను పాటి ధైర్యమా మనకులేదు. కావున సత్యా సత్యముల నటుంచి వినుటకు యింపుగానుండు యాకధలను గూడ జెప్పికొని వినోదింతము .
లోక ప్రచారములోని కధలు
పోతనకు శ్రీనాధుని సోదరి భార్య యనియు , పోతన- శ్రీనాధులు బావ- బావమరదులనియు లోకమున ననేక కధలు ప్రచారమున గలవు. అందువలన శ్రీనాధుఁడు బమ్మెరకు తరచు రాక పోకలు సాగించెడి వాఁడనియు, కొంత కాలమున కాతని భార్య దివంగత కాగా తన యేకైక కుమార్తె యగు కమలను సోదరి పోషణమున నుంచెననియు, తత్కారణమున రాకపోకలు మరింత జోరుగాసాగెడివనియు, పోతన హాలికుఁడై బాధలుపడుట గాంచి యాతనికి కడుంగడు బోధించి యెట్లో భోగినీ దండక మొక దానిని విరచింప జేసి రావు సింగమునకు సమర్పింప జేసెననియు , దానివలన కొంతభూమి దొరుక దానితోనే తృప్తినొంది, హాలికవృత్తియే యుత్తమ మనిభావించి కాలము గడపు చుండెననియు, తదుపరి భాగవత రచన కుపక్రమించి శ్రీ రామాంకితముగా నాభాగవతమును రచించి రామచంద్రునకే యంకిత మొనరించుటకు స్థిర చిత్తముతో నిర్ణయించు కొనినాడనియు, తత్సమయమన నాగ్రంధమును రావుసింగమ భూపాలున కంకిత మొసంగి నీదారిద్ర్యమును తొలగించు కొమ్మని శతథా నచ్చఁజెప్పఁజూచెనట . అట్టితరి యతని దుర్బోధకు లొంగి భాగవతగ్రంధమును పోతన సింగమభూపాలున కంకితమిత్చునేమో యని చదువుల తల్లి సరస్వతి కలవర మంది కన్నీరొలుక పోతన కడ సాక్షాత్కరింపగా -
ఉ: కాటుక కంటినీరు చనుకట్టు పయంబడ నేల యేడ్చెదో?
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో
హాటక గర్భురాణి! నిను నాకటికిన్ గొలుపోయి ,యల్ల, క
ర్ణాట కిరాట కీచకుల కమ్మఁ ద్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!
అమ్మా!సరసీజాసనురాణీ! వాణీ! యేలనమ్మా కజ్జల సిక్తమై నకన్నీరేల కార్చెదవు . నీకన్నీటదడిసి స్తనమండలమంతయు నెంతమలిన మగుచున్నదో జూడుము. ఆకలికి వెఱచి నిన్ను నాదుర్మార్గులకు అమ్ముకొందు నను కొంటివా యట్లెన్నటికి గాదు. నాదిస్థిరనిశ్చయము . నిన్నుఅమ్ముకొననమ్మా! త్రిశుధ్ధిగా నామాటనమ్ముమని యామెనూడించెనట! ఆహా ! యెంతగొప్ప పద్యమిది. ఇంతటి యదృష్టము అలపోతన్నకు గాక మరెవ్వరికి దక్కినది. చరిత్రలో నింతవరకు కనలేదు. వినలేదు. యిది కల్పనమేయనియందుమా! యిదియొక వాఙ్మయాద్భుతమేగదా!
పోతన యొకనాడు పొలమున వ్యవసాయపు పనులకై వెడలినాడట, వెంట కొడుకు మల్లన యున్నాడు. చేనులో క్షేత్రమును దున్ను పనిలో మల్లన నిమగ్నుఁడయియుండ, పోతన భాగవత రచనలో నిమగ్నుఁడయినాఁడట, ఆసమయమున శ్రీనాధుఁడు స్వర్ణ పల్యంకిక నధిరోహించి బమ్మెరకు వచ్చు చుమడెనట, పల్లకీ బోయీల ఓంకార నాదములు వినవచ్చుటచే మల్లన యటువైపు దిరిగినాఁడు. నాన్నా! మామ వచ్చు చున్నాడని చెప్పుచున్నంతలో శ్రీనాధుని యాజ్ఙ మేరకు ముందువైపు గల పల్లకీ బోయీలు ప్రక్క కుఁదొలగిరట, యేమున్నది బోయీలులేకనే పల్లకీ గాలిలో నడచు చుండెను. మల్లన యబ్బురపడి నాన్నా! బోయీలు లేకనే మామ పల్లకి నడచుచున్నది యన, నీవును ఒకయెద్దును ప్రక్కకుఁదోలుమనెను. యెగ్దులేకనే యరకసాగుచుండెను. ఈసారిరెండవ వైపుగల బోయీలుగూడ తప్పుకొనిరి. నిరాలంబనముగా పల్లకీ సాగుచునే యున్నది. తండ్రి పనుపున మల్లనయు రెండవ యెద్దును దొలగించినాడట, యెడ్లు లేకున్నను యరక సాగుచునే యున్నది. శ్రీనాధుని మోము చిన్నవోయినదట! ఔను యిరువురు సరస్వతీ కటాక్ష పాత్రులేగదా! ఇదియు కల్పనమే యంగుముగాక! యెంత మధురముగానున్నది?
పోతనయు, శ్రీనాధుఁడును యింటికి చేరినారు. పాదప్రక్షాళనాదిరములైనవి. ఇక కుశలప్రశ్నముల సందర్భము వచ్చినది. శ్రీనాధుఁడు హేళనగాపోతననుగాంచి " హాలికులకు సేమమా? యని" ప్రశ్నింప, పోతన నవ్వుచు,
ఉ: బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్నికన్,
గూళల కిచ్చి యప్పడుపు గూడు భుజించుట కంటె,సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర భూముల కంద మూల గౌ
ధ్ధాళికులైన నేమి? నిజ దార సుతోదర పోషనార్ధ మై ;
నని నిపుణముగా సమాధానమొసమగినాడట! భార్యాబిడ్డలను పోషించుకొనుటకై కావ్య కన్నెల నమ్ముకొని యాపడుపు కూడు దినుటకన్న, వ్యవసాయి యైన నేమి? యడవులలో కమదమూలముల నేరిన నేమి ? ఇది సరస్వతి నమ్ముట కన్న దోసముగాదే యని బదులు పలికెనట! శ్రీనాఘుఁడులిక్కిపడినాడు. నిజమే! తానుజేయుకార్య మదియేగదా! ఇదియు కల్పనమే యగుగాక! నిష్ఠుర సత్యమును నిర్భయముగా పలికిన పోతన నభినందింపక తప్పదు;
నేటికింతటితో మన ప్రసంగ ము నాపుదము . రేపు తక్కిన విషయములను ముచ్చటింతుము గాక! సెలవు !

No comments:

Post a Comment