Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -21

సీ:- గన్నేరుఁబూచాయ గరమొప్పు నీర్కావి
మడుఁగు ధోవతి పింజె విడిచి కట్టి,
గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
గంగ మట్టి లలాటకమునఁ దీర్చి,
వల చేత బంగారు జలపోసనము తోడ
బ్రన్నని పట్టు తోరము ధరించి,
జరిగొన్న వెలి పట్టు జన్నిదంబుల లుంగ
నంటులు వాయంగ నఱుత వైచి,
గీ: తళుకు చెంగావి కోకయు , వలుదశిఖయు,
జిగురు బొమ్మంచు పెదవులు, చిన్ని నగవు ,
నందమొందంగ వచ్చె గోవిందశర్మ!
మాధవుని పట్టి, యొసపరి మన్మధుండు;
క్రీడాభిరామ నాయకుడు- గోవింద మంచన శర్మ వేషము -
సంక్షేపముగా భావ వివరణము:- లేత పసుపు రంగు గల నీర్కావి ధోవతిని గోచీబిగించి కట్టాడు. గులాబీల నీటితో గంగమట్టి తడిపి దానిని లలాటమున తీర్చి దిద్దినాడు. కుడిచేతిలో ఆపోసన జలకలశం పట్టు కున్నాడు. దానికే(ముంజేతికి) పట్టుదారాన్నికట్టాడు. జరీవలె మెఱయుచున్న తెల్లని పట్టుతో తయారు చేయబడిన యజ్ఙోప వీతముల ముడులు చిక్కు లుదీసి మెడలో ధరించాడు. తళుకు లీనే చెంగావి యుత్తరీయము, పెద్ద పిలక, చిగురుటాకులను వెక్కిరించు మృదువైన పెదవులు, చెరగని చిరునగవు , అందగించుచుండగా మాధవుని పట్టియగు అపర మన్మధుడు గోవంద మంచన శర్మ యరుదెంచెనని క్రీడాభిరామమున పాత్రసూచన ! దీనినిటుండనిండు. ప్రకృతము ననుసరింతము.
వల్లభరాయనిపేర క్రీడాభిరామము ను రచించుటకు ప్రణాళిక సిధ్ధమైనది. దానిని వీధీ నాటకముగా రూపొందింప ప్ర యత్నము. " వీధి " యనునది ' ధనంజయుడు' అను రూపకశాస్త్ర నిర్మాత చెప్పిన10 విధములయిన రూపకములలో నొకటి. ఇది యేకాంకిక ఒక్కరోజుతోముగియు చిరునాటకము. పరిమిత పాత్రము. దీనీనీ సులభముగా రచింప వచ్చును. శ్రీనాధుడు రెండే పాత్రలను సృష్టించినాడు. గోవింద మంచనశర్మ, టిట్టిభ సెట్టి,
రెండేపాత్రలతో వారిపరస్పర సంభాషణా రూపముగా నాశువుగా నీవీధిని తీర్చి దిద్దినాడు. ఉషోదయ కాలము మొదలు మరునాడు ఉషోదయ కాలము వరకు ఓరుగంటి పురవీధులలో జరిగిన వృత్త మంతయు నిందలి యితివృత్తము. నాయకుడు, అతని సహాయకుడు జారులు వారికి కావలసిన సమాచార మేముండును? వేశ్యల సమాచారముదప్ప; అదియే ఇందున్నది. నిజమునకు ఆయిరు పాత్రలలో శ్రీనాధ వల్లభ రాయలులే పరకాయప్రవేశము చేసినారు. లౌక్యముగా పేర్లు మార్చి వ్రాసినారు.సుమారుగా295 గద్య పద్య ములతో కూడిన ఈచిరుకావ్యము నాటి శృంగార పురుషుల హేలా విలాసములకు పట్టుగొమ్మ
కేవల తృతీయ పురుషార్ధ సాధనమే పరమ ప్రయోజనమగు నీకావ్యమును చదువ వలసిన యక్కర గలదా? యని కొందరు ప్రశ్నింపవచ్చును. తప్పక చదువ వలెనని నాయభిప్రాయము. ఏలనన,యిందు కవిత్వపు పసలున్నవి. అందములున్నవి, తళుకు బెళుకు లున్నవి, భాషాపటిమ, శబ్ద చమత్కారము, ఇట్టివెన్నో కోకొల్లలు. మచ్చునకు కొన్నింటిని చవిజూచి ముందుకేగుదము.
శా: స్ధూల ద్విత్రి పటావకుంఠనములున్ ,ధూపోప చారంబులున్
కాలాగుర్వనులేపనంబులు, వధూ గాఢూప గూహంబులున్ ,
కేళీగర్భ నికేతనంబులును, గల్గెంగాక, లేకున్న, నీ
ప్రాలేయాగమ మెవ్విధంబున భరింపన్ వచ్చురా? టిట్టిభా!
చలికాలంలో ఉషోదయ వేళ బయలుదేరారు పురవీధులో తిరగటానికి కావ్యనాయకులు. పాపం! చలికితట్టుకోలేక అనుకునే మాటలివి . ఒరే! టిట్టిభా! రెండు,మూడుుప్పట్లు కలిపి కప్పు కుంటుంన్నాంగనుక, అగరుధూపాలతో ఉపచారాలు పొందుతున్నాం కనుక, జవ్వాది అగరు పూతగా పూసుకుంటున్నాం కనక, అందమైన పల్లల కౌగిళ్ళలో సందడిగా ఉండటంవలన, పడకటిళ్ళలో పండుతున్నాం కనుక, బ్రతికిపోయాంరా! లేకపోతే చచ్చిపోయేవాళ్ళమేరా! అంటున్నాడు మంచనశర్మ. ఇందులో నాటిప్రజలు, ముఖ్యంగా విలాసాలకు మరగినవారి జీవన విధానం వర్ణింప బడింది. అదీవిశేషం !

No comments:

Post a Comment