Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 23

సీ:- ముసుగుఁ బెట్టిన నేమి? ముత్యాల కమ్మల
క్రొమ్మించు లీలలు కులుక రించె ;
మోము వంచిన నేమి? మొలక నవ్వుల కాంతి
చెక్కుటద్దములపై జీరు లాడె;
జూడకుండిన నేమి? సొబగు రెప్పలమించి
తేట వాల్మెరుగులు దిచ్చరించెఁ;
జాటుఁజేిసిన నేమి? చకవాకులఁ బోలు
పాలిండ్ల మెఱుగులు బయట పడియె;
గీ: సిగ్గు నటియించి , మావేడ్క చిన్నబుచ్చి
యేల యిటు పిసాళించెద? దిదేమి సిధ్ధి
కాము సామ్రాజ్య పట్టంబుగట్టి, నన్ను
కౌగిలింపంగ గదవె! యో కరణ కాంత!
వ వారి దారిలో నొక కరణ కాంత గనిపించినది .చూచినారుగదా వర్ణనము. సిగ్గు నటిస్తూ నీవు ముసుగినంత మాత్రమున నేమాయె?నీముత్యాలకమ్మల కాంతి నీకులుకులను తెలుపుటలేదా?నీవు మోము వంచిన నేమాయె? నీమొలక నవ్వుల కాంతి నీబుగ్గల నిగ్గులను బ్రదర్శించుట లేదా? నీవు చూడకున్న నేమాయె? నీరెప్పలచాటున దాగిన ఆమెఱపులేమాకు చాలును; పయ్యెద గప్పి చక్రవాకములను బోలిన స్తన సంపదనేల దాచెదవు? కంచుకమును చీల్చుకొనివచ్చు వాని కాతులే మాకుచాలును. మమ్మేలృయిట్లు విసిగింతువు ? కాము సామ్రాజ్యమునకు పట్టము గట్టి మమ్మేలుకొనరాదా? ఓకరణ కాంతామణీ! యని మంచెన వేడికోలు. కరుణించెనోలేదో? అంతాసరహస్యమే!
మంచన శర్మ, టిట్టిభ సెట్టుల పరిభ్రమణము వేగముగా సాగు చున్నది. వాడ వాడలలో వీధులలో సుందరాంగులను వెదకి పట్టుటయే వారిపని. ఇందేమి యానందమున్నది? యనియందురా? విటుల కదేయానందము.అయినది ఒకపిసాళి(గడునరి) వారిని గాంచి కిసుక్కున నవ్వినది;
మ:- కటి భారంబును,జన్నుదోయి భరమున్, గల్పించె నాబ్రహ్మ!, పి
న్నటి కౌఁదీగెకు మున్న, యిప్డు విమలాంభః పరి పూర్ణ మైయున్న నీ
ఘటి భారం బొకఁడెక్కుడయ్యె ననిన్, కర్ణాటి క్రాల్గన్నులన్,
బటితాళింపుచు నవ్వె, నీలకబరీ భారంబు గంపింప గన్;
కర్ణాటాంగన కళ్ళ బడినదా పరవశ మైపోవునుగదా! కనబడినదామెయే! అసలే ఆమెకున్న బరువులే మోయలేకున్నయాచిన్నదానికి బరువైన నీటికుండ నొకదానిని నడుమునకు దగుల్కొన్నదట! అయ్యో! ఆమె యీభారముల నెట్లు మోయు చున్నదో? యని మంచెన జాలిజూపుల జూచునంతలో నాపిసాళి చిన్నది కబరీ భారము అల్లాడగా తళుకు చూపులతో వెక్కిరింతగా నవ్వినదట! ఆవెక్కిరింత కౌగిలింతకు ఆహ్వానమట! దాని నాతడే యెరుంగును. మనకేమి దెలియును!
ఆమెకొక సంకేతమునొసగి ముందుకు సాగినారు.ఈమారువారికాలు బజారువైపు నడిపించినది. దుకాణముల లోని వింతలను జూచుచు నొక్క చోట నాగినారు. ఏమున్నదక్కడ? ఒక సౌచిక పల్లవుడు(టైలరు-విటుడు) కనుల బడినాడు. వాడిపనిలో వాడున్నాడు. వచ్చిన వారి కొలతలు తీసికొను చున్నాడు. ఆకొలతలు దీసికొనుటలో నొక చమత్కారము గనిపించినది. అంతే కనిపెట్టినారు వానిగుట్టు. యెట్లు? యిదిగో యిట్లు.
చ: కొలుచును జేన వెట్టు, కుచ కుంభ యుగం బెడ డిగ్గఁ గన్నుగ్రే
వలఁ బరికించు, గక్షముల వైచును దృష్టులు, మాటి మాటికిన్ ,
గలికి నంబునన్ దరచుగా నగు, సౌచిక పల్లవుండు! గం
చెల వెసఁ గుట్టియీడు, వెలచేడియకున్, విషయాభి లాషియై; --- ఇదీ సంగతి;
బోగం పిల్లలు దుస్తులు కుట్టించుకునేందుకు వచ్చారా ఇంతే సంగతులు. ఒకపట్టాన వారికి దుస్తులు కుట్టి యివ్వడు. మాటిమాటికీ కొలతలు, అదిగూడా చేతులతో జానలతో వారివాలిండ్లు పట్టి ప్రక్కకు జరపటం, చంకలవైపు ఆశగాచూడటం ఒకటేమిటి వాడిపనులు చెప్పనలవిగాదు. ఇదంతాయెమదుకు? వాడికి వారు లోబడుట కోసం ; చూశారా శ్రీనాధుని నిశిత పరిశీలనము.
ముందుకు కదలినారు వింతలు వినోదములు .ఒకచో కాకతి దేవతారాధనలు, మరియొకవంక మాయూరమ్మ జాతరలు వేరొకచో పలనాటి వీరగాధలప్ర దర్శనములు, యిట్లు నగరమంతయు నొకటే హడావిడి. ఈసందులోృజార చోరుల వింతవింత కృత్యములకు అలవియేలేదు. ఒక్కచో,
మ:- ద్రుత తాళంబున , వీరగుంఫితక ధుం ధుం ధుం కిటాత్కార సం
గతి, వాయింపుచు, నాంతరాళిక యతి గ్రామాభి రామంబుగా,
యతి గూడన్, ద్విపద ప్రబంధమున వీరానీకమున్బాడె, నొ
క్కెతె, ప్రత్యక్షరమున్ గుమారకులు ఫీత్కారంబునన్ దూలగన్;
పలనాటివీరచరిత్రము నొకసుందరి జముకుల కధగా పాడుచున్నది. జముకుల కధ చెప్పు వారి చేతులలో కుంచమును బోలిన యొక సాధనముండును. దానిమధ్యలో నొకత్రాడు ఉండును. దాని నిటునటు లాగుచుండుటచే ధుం ధుం మ్మనుశబ్దము వచ్చు చుండును. దానితో తాళానుగుణ్యముగా బాడుచు, నడమ నడుమ వచనములను అనుసంఘించుచు కధాగానమొనరింతురు. నేటి కింతటితో విరమింతము.

No comments:

Post a Comment