Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 22

కోడికూత!

ఉ: మంచన! వింటివో వినవొ? మన్మధుఁడేక శిలాపురంబులో,
చంచల నేత్రలం బతుల శయ్యలపై రతికేళి రాత్రి, పో
రించి, ప్రభాతకాలము పరిస్ఫుట మైనను , ధర్మదార వ
పట్టించుచు నున్నవాఁ డదె! కుటీగత కుక్కుట కంఠ కాహళిన్;
కావ్యనాయకు లిరువురు చుక్క పొడుచు వేళ పుర ప్రవేశ మొనరించినారు . తెలవారు సమయము ఆసన్నమగుటచే కోడికూత లారంభ మైనవి. వాటిని కవి మన్మధుఁడెత్తించిన ధర్మ దారగా నభివర్ణించు చున్నాడు. రాత్రియంతయు నాపట్టణమునందలి విటీ విటులందరూ మదన సంగర సందర్భమున నొకరితో నొకరు పొలయలుకలు బూని కొట్లాడు కొనుచునే యుండిరట! ఎటులో నిద్రలో బడిరి యింతలో మాయదారి కోడికూత వినిపించినది. అది తెల్లవారు చున్నదని హెచ్చరిక యికనెవరి యిండ్లకు వారు బోవలసినదే! తడయుటకు వీలులేదు. విటులకు దుర్భరమైన యాస్ధితిని కవి మన్మధుఁడ వారిని హెచ్చరించుటకు " ధర్మ దార నెత్తించినట్లున్నదని చెప్పుచున్నాడు. ధర్మ దార- యనగా ప్రాచీన కాలమున రాజులు తమ రాజధానుల యందు కాల సూచనకై ప్రతిజామునకు కాహళులు(బాకాలు) ఊదించెడివారు. నగారాలను మ్రోగించెడివారు అశబ్దమును బట్టి ప్రజలకు సనయము బోధ పడుచుండెడిది. అదీ ధర్మ దార!
మనము ముందుకు పోదము లేనిచో కావ్యనాయకుల పరిశీలనాంశములు మనకు బోధ పడవు. పురప్రవేశమునకు ఇది తగిన సమయమేనా? యని టిట్టిభుఁడడుగ, మంచన యతనిని సమాధానించు చున్నాడు.వినుడు, 

గీ;- గార్గ్య సిధ్ధాంత మత ముషః కాల కలన ;
శకున మూనుట యది బృహస్పతి మతంబు;
వ్యాస మతము మనః ప్రసాదాతిశయము;
విప్రజన వాక్య మరయంగ విష్ణు మతము;
శ్రీనాధునకు జ్యోతిష్యము నందును శకున శాస్ర్ర మునందును పరిణతమైన ప్రజ్ఙ గలదు. దానికీ పద్యము నిదర్శనము. ప్రయాణ సమదర్భమున ననుసరింపవలసిన విధానములివి 1 ఉషఃకాలమున ముహూర్త రహితముగా ప్రయాణింపవచ్చును. తిధి వార నక్షత్రములతో బనిలేదు.ఇది గర్గుని మతం;2శకునం చూసుకుని బయలుదేరటం , ఇది బృహస్పతి మతం; 3 మనస్సు ఆనంగా ఉన్నప్పుడుబయలుదేరటం వ్యాసుని మతం; బ్రాహ్మణుని అడిగివెళ్ళటం విష్ణుమతం; మనం ఉషోదయకాలంలో బయలుదేరాం కాబట్టి మనకు తిరుగులేదని మంచన సమాధానం; ఈగొడవంతా యెందుకంటారా? ఈశ్రీనాధుని పద్యం కాశీఖండాది గ్రంధాలలో కనిపిస్తూంది: దీనివల్ల నిది శ్రీనాధకృతమేననుట స్పష్టం!
ముందుకు కదులుతున్నాం మంచన నలుదిక్కుల నిశితముగా బరిశీలనము జేయుచున్నాడు. అదిగదిగో! నొక చక్కని దృశ్య మాతని కంటబడినది? ఏమది? సూర్యోదయ కాలంలో ప్రసరించే అరుణ కిరణాలు.
శా: ఓరుంగంటి పురంబు సౌధములపై నొప్పారెడిన్ జూచితే?
యీరెండల్? మణిహేమ కుంభములతో నేకాంతముల్సేయుచున్ ,
స్వారాజ్య ప్రమదా ఘన స్తన భర స్థానంబులన్ బాసి, కా
శ్మీర క్షోదము ప్రాణ వల్లభ దృఢాశ్లేషంబులన్ రాలె నాన్!
ఇదియెంత గొప్పపద్యం! ఏమాకవియూహ! ఎర్రని సూర్య కిరణాలు ఓరుగంటి మేడలపైనున్న శిఖర కలశ ములమీద ప్రసరించు చున్నాయి. అదీ దృశ్యము. అది యెలాగుందంటే, స్వర్గంలో దేవతావనితలు తమప్రియులతో సుఖోప భోగపరాయణులైయుడగా ప్రియులొనరించు స్తపీడనపు రాయిడివలన వారి కుచ కుంభములపై నలదు కొన్న కాశ్మీరక్షోదము(కుంకుమ పూవుచే తయారించిన మైపూత) కిందకు రాలి పడుతున్నదా? యన్నట్లున్నదట! చూచితిరా శ్రీనాధుడెంతటివాడో? తనయూహతో మనలను మింటికి మంటికి నడుమ నిలిపినాడు.
ఇట్టి శబ్ద చిత్రములెన్నెన్నో యిందుగలవు. రేపు మరికొన్ని నేటికి విరమింతముగాక! సెలవు.

No comments:

Post a Comment