Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 7

సీ: పర రాజ్య పర దుర్గ పర వైభవ శ్రీల
గొన గొని విడనాడు కొండవీడు;
పరిపంధి రాజన్య బలముల బంధించు
కొమరు మించిన జోడు కొండవీడు;
ముగురు రాజులకును మోహంబు పుట్టించు
గురుతైన యురిత్రాడు కొండవీడు;
చటుల విక్రమ కళా సాహసంబొనరించు
కుటిలాత్ములకు గాడు కొండవీడు;
తే: జవన ఘోటక సామంత సరస వీర
భట సటా నేక హాటక ప్రకట గంధ
సింధు రారవ యోహన శ్రీల దనరు
కూర్మి నమరావతికి జోడు కొండ వీడు!
భావం: శతృరాజ్యవైభవమును, శతృదుర్గములను, గెలిచి తనలో నిలుపు కునేది కొండవీడు: శతృసైన్యాలనుబంధించే చెరసాలవంటిది కొండవీడు;బహమనీ, గోల్కండ,విజయనగర, రాజులకు మోహాన్ని కలిగించేదికొండవీడు; భయంకరమైన యుధ్ధంచేసే సాహసులకు, కులబుధ్ధిగలవారికి స్మశానం తోసమానం ఈ కొండవీడు.పారసీక అశ్వములకు,సామంతరాజుల సముదాయానికి,వీరభటసందోహానికి, మదగజముల ఘీంకార ధ్వనులకు నిలయమై యుధ్ధవిద్యావైభవములతో అలరారు మహా పట్టణం కొండవీడు; ఇది దేవేంద్ర రాజ ధానికి దీటైనదనికవి శ్రీనాధుని వర్ణనము . ఇదీ రెడ్డి రాజుల రాజధాని కొండవీటి వైభవము!
విద్యాధికారిగా- శ్రీనాధుడు
కొండవీట విద్యాధికారిగా శ్రీనాధుడు కొడవీటిలో అసంఖ్యాక కార్యములను నిర్వహించేవాడు 1రాజశాసనరచనము. రాజులనిత్యవ్యవహారములోని అనేక విషయములను గురించిన రాజాఙ్యాపత్రములరచనముచేయుట. శాసనాంతములందు" విద్యాధికారీ శ్రీనాధో వీరశ్రీ వేమ భూపతేః" అనియతనిముద్ర అన్ని శాసనము లందు వ్రాయ బడు చుండెడిది. 2రాజకీయమైన సలహాలు 3 కవితావినోదము4 పర రజులకడకు రాయబారములు చేయుట.5ప్రఖ్యాతివహించిన పండితులను పరీక్షించి వారికి ప్రభు సత్కారములను జరిపించుట; మొన్నగు ననేక కార్యక్రమములను నిర్వ హించేవాడు. రెడ్డిరాజులు సంస్కృతాంధ్రములలో మంచిృపండితులు, కవులు; వారిలో కొందరు కాళిదాసాదుల కావ్యములకు గూడ వ్యాఖ్యాన గ్రంధములను రచించిరట!అటుయుధ్ధ రంగమునందును, ఇటుసాహిత్య రంగమందును వారు సవ్య సాచులై యలరారినారు;వారిగ్రంధముల పరిష్కరణము గూడవిద్యాధికారి బాధ్యతలోనొకటి.
ఇన్నిగురుతరమైన బాధ్యతల మధ్యనున్నను శ్రీనాధుడు తన కవితా వ్యాసంగమును నిరాటంకముగా నిర్వహింపసాగినాడు. పెద కోమటి వేమారెడ్డికి మామిడి సింగనా మాత్యుడు మహామంత్రి! ఆతని సహకారమే శ్రీనాధుని అందలమెక్కించినది. త త్కృతజ్ఙతా బధ్ధుడయినకవి సంస్కృతమున శ్రీహర్షుడు రచించిన "విద్వ దౌషధముగా ప్రఖ్యాతి గాంచిన నైషధ గ్రంధమును అతని కంకితముగా నాంధ్రీకరించుటకు పూనుకొనినాడు. దుర్ఘటమైన కావ్యానువాదమును నిపుణముగా నిర్వహించు చున్నాడు . సునాయాసముగాఅనువాదము పూర్తియైనది! సమనోహరమైన యామహాకావ్యమును సప్రస్రయముగా మామిడి సింగనకు అంకితమిచ్చి కృతకృత్యు డైనాడు. దీనితో ప్రభువునకు, అమాత్యునకు మిగుల చేరువయైనాడు. రాజపరివారములతో గూడ పరిచయము లేర్పడినవి, అవి ఇంకంతలై శ్రీనాధుని రాజమహేంద్రము వైపు నడిపించినవి;
నేటి కింతటితో నాపుజేతము. చారిత్రికాంశము లంతగా చవులు బుట్టింపవు.రసవదఘట్టముముందున్నది 

No comments:

Post a Comment