Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -5

శా: జోటీ ! భారతి! యార్భటి న్మెరయుమీ ! చోద్యంబుగా నేడు గ
ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢదేవనృపతిన్ , నాసీర ధాటీచమూ
కోటీ ఘోటక ధట్టికా ఖుర పుటీ కుట్టాక సంఘట్టన
స్ఫోటీ ధూత ధరా రజ శ్చుళుకి తాంభోధిన్ బ్రశంసించెదన్;
శ్రీనాధుని చాటువు ప్రౌఢ దేవరాయల ప్రశంస!
మిత్రులారా! హరచూడా హరిణాంక వక్రత - పద్యంలోని వక్రతను నిన్న చెప్పు కున్నాం. రెండవ కవితాగుణం ఆరభటీ వర్ణనాగుణం ఈపద్యంలో కనిపిస్తుంది . అమ్మా! సరస్వతీ ఆరభటిలో నామదిలో మెరసి పో
ఇప్పటి సందర్భానికి అదినాకు సహాయపడగలదు. సరిహద్దులను దాటి శతృ సైన్యాలమీద ప్రౌఢదేవరాయల అసంఖ్యాక
సైనికపరివారం గుర్రాలపై పరుగిడుతుంటే ఆయశ్వముల డెక్కల తాకిడికి యెగసిన భూధూళి సముద్ర పర్యంతం పరివ్యాప్తమై ఆసముద్రమంతా బురదగా చేస్తోంది: అంటాడు. హేతూత్పేక్ష- అతిశయోక్తులతో వర్ణనను ఆరభటిలో
నిర్వహించి తనకవితాగుణాలలో రెండవ దానిని మనకు పరిచయం చేశాడు ఇంకమూడవగుణం సరసత్వం. దాన్ని
రేపుచెప్పుకుందాం; ప్రస్తుతం మనం అతని రచనలను పరిచయం చేసికుందాము;
శ్రీ నాధుని రచనలు
చిన్నారి పొన్నారి నాడే రచనల నారంభించిన శ్రీనాధుడు జీవనసంధ్యాకాలం వరకు రచనలు చేస్తూనే ఉన్నాడు.మొత్తము మీద ఇతని రచనలుగా పేరొందినవి 13గ్రంధములు.
1 మరుత్తరాట్చరిత్రము : (అలభ్యము)
2 శాలివాహనసప్త శతి (అలభ్యము)
3 శృంగారనైషధము:
4 భీమేశ్వర పురాణము:
5 ధనుంజయ విజయము (అలభ్యము)
6 కాశీఖండము:
7 హరవిలాసము.
8 శివరాత్రి మాహాత్మ్యము.
9 పండితారాధ్య చరిత్రము.
10 నంద నందన చరిత్రము (అలభ్యము)
11 మానసోల్లాసము. (అలభ్యము)
12 పలనాటి వీర చరిత్రము .
13 క్రీడాభిరామము
ఇందు పండితారాధ్య చరిత్రము, పలనాటివీరచరిత్రము లు ద్విపద కావ్యములు తక్కినవి, చంపూ కావ్యములు
(పద్యములు గద్యములు కలసినకావ్యములు చంపూ కావ్యముల నబడును)ఈమిగిలిన వానిలోగూడ కేవలము నాలుగు కావ్యములు మాత్రమే బహుళప్రచారములో నున్నవి శృంగారనైషధము, భీమేశ్వర పురాణము, కాశీఖండము,
హరవిలాసములు మాత్రము బహు పండితాదరణమునకు నోచుకొని విస్తృత ప్రచారములో నున్నవి.
వీనిలో నేదిముందు యేదివెనుక , ఆకావ్య ప్రశస్తి యెట్టిది ? అనువిషయములను పరిశీలించుటకు
ముందు శ్రీ నాధుని జీవన ప్రస్థానమును , రాజకీయ నేపధ్యమును, పరిశీలించవలసి యున్నది . కావున మిత్రులారా!రేపటినుండి యాతనిజీవన విశేష ములతో బాటు అతని చాటుపద్యముల పసందైన విందును గూడ మీకందించుచు ముందుకు సాగుతాను.

No comments:

Post a Comment