Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -4

మ: హరచూడా హరిణాంక వక్రతయు ,కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్,
సరసత్వంబును,, సంభవించె ననగా,సతత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీ గేహరంగంబులన్!
శ్రీనాధ కవి:
భావం:- శివుని తలపై ఉండే చంద్రవంకలాగ వక్రత, మరోవంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికాపయోధరాల కాఠిన్యం, సరసత్వము, కలిసి ఉంటేనే అది చిరకాలం నిలచియుండే కవిత్వం
అవుతుందని శ్రీనాధకవి అభిప్రాయం ;
ఈపద్యం ప్రసక్తి ఎందుకంటే, హరచూడా హరిణాంకవక్రత- అంటేవంకరగాచెప్పటం శ్రీనాధుని
కవితా గుణం .అదే వక్రోక్తి అనేఅలంకారం అదిగో అదే కర్ణాటక శబ్ద ప్రయోగం దగ్గర వచ్చింది. పండితులు తలలు పట్టుకునేలాగ చేసింది. దీనికి మరో సాక్ష్యం చూపించి ముందుకు కదులుతాను.
శా:- అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
భిక్షాదానము సేయరా! సుకవిరాడ్బృందారక శ్రేణికిన్;
దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ,
వక్షోజద్వయ కుంభి కుంభ ములపై వాసించు తద్వాసనల్;
భావం:- ఓ సాంపరాయా! తెలుంగు దేశాధీశా! దేవతలుగా సంభావింప బడే మావంటి కవీశ్వరులకు కస్తూరిని దానం చేసికో! దానిసువాసనలు దక్షారామ సమీపంలోని చళుక్య భీమవరము నందు నివసించే గంధర్వ- అప్సరో
భామలను బోలిన భోగపు కాంతల వక్షోజములపై పరిమళింపగలవు;
నాకు కస్తూరి కావాలయ్యా! దానంచెయ్యమని అడగవచ్చుగదా? అలాఅడగడు. మీకుదానమిస్తే మాకువచ్చే ప్రయోజనం ఏమిటనుకున్నావ్? దానిసువాసనలు ఆభోగపు కాంతల వక్షోవీధులందు ఘుమాయిస్తుంది.
దాంతో వారివద్దకువచ్చే విటసముదాయంలో నాకు, నీకు, నీకస్తూరీ ద్రవ్యానికీ ఉచితంగా అనంతమైన ఖ్యాతి లభించదూ? అని శ్రీనాధులవారి వ్యాఖ్యానం . చూశారా మాటలో ,కవితలో ఎంవంకరో! చాలానర్మగర్భం గా వ్యవహారాలునడుపగలడు. అంత చమత్కారి. అదే " హరచూడా హరిణాంక వక్రత!"
సాంపరాయడెవరో ముందు ముందు తెలుసుకుందాం; రేపుశ్రీనాధుని గ్రంధ ములను పరిచయము గావించుకొని ముందుకు సాగుదాం. నేటికి స్వస్తి!

No comments:

Post a Comment