Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు -6

చం: అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయిం బొడతేర గిన్నెలో
పెరుగును, వంటకంబు, వడ పిందియలున్ గుడువంగ బెట్టు ని
ర్భర కరుణాధురీణయగు; ప్రాణము ,ప్రాణము; తల్లియన్నదే!
హరహర! యెవ్వరింక కడుపారసిబెట్టెద రీప్సితాన్నమున్;
శివరాత్రి మాహాత్మ్యము- సుకుమారుని కధ లోనిది;
భావం: సూర్యుడు పొడుపు కొండమీద కనిపించగానే వెడిగిన్నెలో పెరుగు అన్నం కలిపి ఆవపిందెలు నంజుడు గానిచ్చి
కడుపారాభోజనం పెట్టేది మాయమ్మ; తల్లంటే యెవరు? బిడ్డ ప్రాణానికి ప్రాణం !అటువంటి తల్లిని మించిన
వారెవరు? ఈలోకంలో. హరహరా! ఇంక నాకు కడుపు నిండా తిండెవరు పెడతారు? అని వాపోతున్నాడు
సుకుమారుడు. ఇతడు తెనాలివారి నిగమ శర్మకు అన్నవంటివాడు. తండ్రి వేదవేదాంగ వేది. తల్లి గారాబం
వలన దుష్ట సావాసంచేసి చెడిపోయినాడు.చివరకు దొంగగామారి అడవులలో బడినాడు. ఆకలి యతనిని
నిలువనీయుటలేదు. అప్పుడు వానికి తల్లి గుర్తువచ్చింది . అదీ ఈపద్యం! ఇందులో మాతృవాత్సల్యం ,
బిడ్డపై తల్లికుండే మమకారం వగైరాలు శ్రీనాధుడు చాలాచక్కగా కరుణ రసార్ద్రంగా వర్ణించాడు. ఇదీ
అతని సర,సత్వ (రసోచిత రచనము) రచన. ఇంకో సరసాలతో కూడిన రచనకూడా ఉంది అది
ముందు ముందు మనకు అతని చాటువులలో ప్రస్ఫుటం అవుతుంది. ఇంతటి తో శ్రీనాధుని లోని
వక్రత, కాఠిన్యత, సరసత్వ, రచన లనే మూడింటినీ పరిశీలించటం అయింది. ఇంకయతని జీవనప్రస్థానం
గురించి సంక్షేపంగా పరిశీలన చేయడానికి ఉపక్రమిద్దాం;
శ్రీనాధుని జీవన ప్రస్థానము
ప్రతి మానవుని జీవితము సరళ రేఖకాదు. కాబోదు. ఏవోనిమ్నోన్నతములు ఉండక తప్పదు.శ్రీనాధునకు గూడయిందు మినహాయంపులేదు. జీవనారంభమున మహాభోగి యైనను చరమకాలమునకు
కష్టజీవిగా కడతేరక తప్పలేదు. తొలుతభోగి చివరకు విరాగి. ఇదీ యాతని జీవన గమనము. ఇది అనాదిగా కానవచ్చు
మానవ జీవన పరిణామము; అసలు విషయానికి వద్దాం'
పాకనాటి నియోగి బ్రాహ్మణుడైన శ్రీనాధుడు, సకలవిద్యాపారంగతుడై చక్కని రాజాశ్రయమునకై
ప్రయత్నములు మొదలిడినాడు నాడు రెడ్జిరాజ్యము అరివీరులకు దుర్నిరీక్ష్యమై, సుసంపన్నమైయుండెను .తొలుతవీరిరాజధాని అద్దంకి ప్రోలయవేమారెడ్డి పాలకుడు. అనంతరము తమ్ముడు అనవేమారెడ్డి పాలకుడయ్యెను.
అతని కాలములోనే రాజధాని కొండవీటికి మార్చబడినది . అనవేమునితర్వాత కుమారుడు కొమరగిరి రెడ్డిపాలనమారంభమయ్యెను. దుర్బలుడు వ్యసనశీలుడును అగుటచే త్వరలోనే రాజపదవిని గోల్పోయెను. పెదకోమటివేమారెడ్డి పాలకుడయ్యెను. కోమటిపెదవేముడు రాజగుటకు చక్రము ద్రిప్పినది కాటయవేమారెడ్డి.ఇతడుకోమటివేముని బావమరది. మహాపరాక్రమశాలి .పెదకోమటి వేముని మరదలు అనితల్లిని
అల్లాడ వీరభద్రారెడ్డి పరిణయమాడెను. ఇతడు కాటయవేముని తమ్ముడు. రాజమహేద్రవర పాలకుడు. ఈరెండురెడ్డిరాజ్యాలకు కాటయవేముడే పరోక్షంగా ప్రభువు. అతని మంత్రి మామిడి సింగనామాత్యుడు; అదిగో
ఆమంత్రి గారి సహకారము శ్రీనాధునకు లభించింది. సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతుడు, ప్రాకృత,, సౌరసేనీ,ఇత్యాదిభాషలతోపరిచయంకలవాడు, తర్క,వ్యాకరణ,అలంకార,జ్యోతిష, శకున,న్యాయశాస్త్ర ప్రవీణుడు., స్ఫురద్రూపి, చతురసంభాషణాశీలియు, ఆశుకవియు నైన శ్రీనాధుని కొండవీటి విద్యాధికార పదవి వరించినది. తదాదిగానతని జీవితము మూజుపూవులు ఆరుకాయలుగావిస్తరించినది .ఇతనివెనుక నిత రాజకీయ నేపధ్యముగలదు. అందుచేతనే ఇంత విస్తరించి చెప్పవలసి వచ్చినది.
రెడ్డిరాజులకాలముననుసరించి ఇతని కాలనిర్ణయము జరిగినదిక్రీ:శ:1365_1470లనడుమనీతడు జీవించి యుంజనోపునని చరిత్రకారుల యూహ! ఇంతకుమించి చెప్పునవకాశము మనకు లేదు. నాటి కవులకు చారిత్రిక స్పృహ లేకపోవుటచే తగిన యాధారములు లేక పోవుట వలన
నాటి కృతిపతులను వారికాలములను సమకాలీన శాసనాధారములను ఊతగొని చరిత్రకారులు సుమారుగా కాలమును నిర్ణయించినారు.
నేటికింతటితో స్వస్తి. రేపుతక్కిన విషయాలు .శుభంభూయాత్!

No comments:

Post a Comment