Sunday, 31 May 2015

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - 24

నిన్న జముకుల కధ చెప్పగా విన్నాం ఆవిధంగా వివిధ ఉత్సవాల లోమునిగి , ఓరుగల్లు పట్టణం ఆనందోత్సాహాలతో నుర్రూత లూగుతోంది మంచెన ముందుకు సాగు తున్నాడు. అప్పటికి మధ్యాహ్న కాలమైంది. సూర్యుడు నడినెత్తి కెక్కాడు. కవి ఆవిషయాన్ని యెంత నిపుణంగా వివరించాడో యీపద్యంలో చిత్తగించండి !
శా:- వ్రాలెన్ దిక్కులు భానుభా వ్యతికర ప్రకీడ దర్కోపల
జ్వాలా జాల జటాల జాంగల తటీ వాచాల కోయష్ఠులై
రోలంబంబులు, మూతివెట్ట వెఱచెన్ , గ్రొవ్వేడి బీరెండలన్ ,
జాలం గ్రాఁగి కరంబు వేడియగు కాసారాబ్జ మైరేయముల్;
దినకరుడు మింటిపై బీరెండ ప్రసరిస్తున్నాడట. ఆయాతప కాంతులు సూర్యకాంత మణులపై బడియవి భగభగ మండు చున్నవట. దానివలన పరిసర ప్రాంతము లన్నియు తిరుగుటకు వీలులేని వైనవట. పరిసరమందొక చక్కని సరోవరమున్నది. అందువికసించిన తామరపూలున్నవి ఆపూలలో నిండుగా మకరందమున్నది . దానిని త్రాగుటకై తుమ్మెదలు పొంచియున్నవి. కానీయీబీరెండలచే యామకరందము సలసల కాగుట చేత తుమ్మెదలు వానిని తాకలేక పోయి గట్టుపై నిలచి లబ లబ లాడుచున్నవట!
ఇందు మరియొక వింతయున్నది. కవి మకరందమును మైరేయముతో పోల్చు చున్నాడు. మైరేయము మొకరకపు మద్యము . ప్రేయసీ ప్రియులు సరస సల్లాపము లాడుకొనుచు సేవించుట సాంప్రదాయము. అదియు, పానపాత్రలతో త్రాగుటకాదు. ప్రియురాలు ప్రియునికి పుక్కిలి బట్టియందించును ప్రియుడేమో ప్రియురాలి మోవికి తన మోవిగదియంచి దానిని స్వీకరించును. ఇదీవిధానము.
ఇక్కడ పద్మినులు ప్రియురాండ్రు, తుమ్మెదలు ప్రియులు, మకరందమా(మైరేయమా) పుష్కలము. కానీ త్రాగుటకు వీలుగాని పరిస్ధితులు సూర్యుని వేడిమి చేగల్గు చున్నది .వేడికి మైరేయము కాగినది మూతివెట్టినచో మూతికాలిపోవును. అందుచేత చేతగాని తుమ్మెదలు పద్మినుల దరిజేరలేక గట్టుపై కొంగలవలె నఱచు చున్నవట! ఇంతకీ మధ్యాహ్న మైనదని చెప్పుట కిన్నితిప్పలు పడ్డాడు కవి.
దీనిని అల్లసాని వారు కొంచము మార్చి తమ మనుచరిత్రమున వాడుకోన్నారు. ప్రవరుడు హిమాలయముల కేగినపుడు యచటి వృక్ష సాంద్రత వలన మధ్యాహ్నమైనను ెలియకున్నతరి ," నళినీ బాంధవ భానుతప్త రవికాంత స్యంది నీహార చూత్కార పరంపరల వలన (సూర్య కిరణాల వేడివలన కరగిన మంచు నీటి చుక్కలు సూర్య కాంత శిలలపై బడుటచే, వచ్చు చుయ్యి చుయ్యి శబ్దములవలన) మధ్యాహ్న మైనదని యెరింగెనట! ఇదీ ఆయన యనుకరణము.
అయినది వారివిహార మాగినది. భోజనార్ధమై లక్ష్మణ వజ్ఝలయింటికి తరలినారు.
ఉ: కప్పుర భోగి వంటకము, కమ్మని గోధుమ పిండివంటలున్,
గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాలనే ర్పెస
పప్పును, కొమ్ము నల్లనఁటి పండ్లును, నాలుగు నైదు నంజులున్,
లప్పల తోడఁగ్రొంబెరుగు ,లక్ష్మణ వజ్ఝల యింట రూక కున్;
ఇదీ యాపూటకూటింట దొరకు భోజము. కప్పుర భోగి బియ్యపు తెల్లని సన్న యన్నము. గోధుమతో చేసిన పిండి వంటలు. పదార్ధములలో కలుపు కొనుటకు గుప్పెడంత పంచదార, అప్పుజే కాచిన ఆవునేయి,
(ఆవునేయి త్రిదోష హరము యెంతవాడినను కొవ్వు రాదు) పెసర ప ప్పు,నల్లటి కొమ్మరచిపండ్లు, (నాటిస్పెషల్) నాలుగైదు పచ్చళ్ళు, మట్టి ముంతల లోకాచి తోడు బెట్టిన కమ్మని పెరుగు, ఇదీ ఒకరూకకు దొరకు భోజనము. తదుపరి కర్పూర తాంబూలము. వందలరూపాయలు ఖర్చుబెట్టినను నేడిట్టి భోజనము దుర్ల భముగదా? భోజనానంతరము విశ్రాంతికి తగు గదులు పరివారము సరేసరి. తుదకు వెలచేడియలతోసహా సర్వము అచట సమాయత్తమై యుండును. మన శ్రీనాధులవారి బస యదియేగదా!
మంచన, టిట్టిభులు కంఠ దగ్నముగా మెసవినారు ప్రస్తుతము విశ్రాంతిగొనుచున్నారు,. విహారము వేళ సాయంత్రమునకు మారినది. మనము గూడ నింతటితో నేటికి విరమింతము. రేపుతక్కిన ది తెలిసి కొందము. నేటికియిక సెలవు!

No comments:

Post a Comment