Monday, 29 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 52

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

మ: కవితల్ సెప్పినఁ బాడ నేర్చిన వృధా కష్టంబె, యీభోగపుం
జవరాండ్రేగద, భాగ్య శాలినులు! పుంస్త్వంబేల పో పోచకా?
సవరంగా సొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టింతువే
నెవరుల్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే! పాపపుం దైవమా!
వేశ్యల విషయంలో శ్రీనాధుని యిప్పటి మాట యిది. వెనుక రాజాదరణము లభించినంత వరకు తానుగూడ నా వేశ్యాలంపటమున జిక్కిన వాఁడేగద! నేడు కవులకు ఆదరణ ముతగ్గినది. చిత్రము! వేశ్యలకు మాత్రము సంఘమున గలిగిన యాదరణము తగ్గకపోగా పెరిగినది. అదిశరీరముతో వ్యాపార మాయె, భోగ పరాయణు లున్నంత కాలము వారి యాదరణకు కరువుండదు. ఈసత్యము నానాడే గురుతించిన నెట్లుండెడిది? ధనమునకు కొదువ యుండెడిది గాదు. రారాజులు కోరినంత ధనము నిచ్చిరి. తానేమి యొనరించెను? జీవనదాహమునుదీర్చుకొనెను. భోగమునకు, భోజనమునకు, మిలినది దానధర్మములకు, యిప్పుడు రిక్త హస్తుఁడయ్యెను. ఇక జీవనమెట్లు? రెడ్డి రాజులు కాలగర్భమున గలసిపోయిరి. ఒడ్డెరాజులా పరభాషీయులు. వారికి కవులపై సదభిప్రాయము శూన్యము. పైపెచ్చు కవులు సంఘమును పీడించుకొని బ్రతుకు సోమరి పోతులని వారి యభిప్రాయము. తిప్పయసెట్టి వ్యాపార మడుగంటినది. యిక దారి యేది? శ్రీనాధునిలో పరివేదన మారంభమైనది.
వేరు మార్గము లేక వ్యవసాయమునకు గడంగెను. మరి భూమేది? అదియును లేదు. రెడ్డిరాజులకాలమున నడిగిన వారికి యగ్రహారములిచ్చిరి. అహ మడ్డపడినది. అడుగలేక పోయినాడు. మరినేడు తన మనుగడకు భూమి యవసరము గదా ఒడ్డెరాజులకడ గుత్తకు దీసికొనకఁదప్పలేదు. కృష్ణాృనదీ తీరమున గల బొడ్డు పల్లె యను గ్రామ మున కొంత భూమినిఃకౌలునకు సంపాదించెను. వ్యవసాయమునకు పెట్టబడి? అదియుఋణమే! " బాపన యెగసాయం పల్లకీల మోత" అని మాచిన్నట పల్లెలలో వెక్కిరించెడు వారు. బ్రాహ్మణులు స్వతః కష్టజీవులుకామి, శ్రామికులపైనాధార పడక తప్పదు . వారి యనుగ్రహము మనప్రాప్తము. అంతే వేరులేదు. దీనికిఁదోడు చీడ పీడలు , వానలు వరదలు, పక్షులబాధ, మిడతల స్వైరవిహారములు,, ఈరీతిగా పలు కష్టముల నెదుర్కొనక తప్పదు. ఇక్కడ నదే జరిగినది. వరదలవలన పల్లపు పంటలు పోగా, పక్షులదాడివలన మెట్టపంటలు నాశము నొందినవి. మిగిలినది. కష్టములు, కనినీళ్ళు.
వ్యవ సాయముగూడ శ్రీనాధుని ఋణభారమును పెంచెనేగాని యూరట గలిగింప లేదు. ఇటు ప్రభుత్వము వారికిఁ జెల్లింప వలసిన సిస్తు పెరిగి పోయినది. దారిగానక పాపమా కవిసార్వ భౌముఁడు దీనాతి దీనముగా పరితపించినాడు.
సీ: కాశికా విశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
రత్నాంబరమ్ము లేరాయఁడిచ్చు;
రంభఁ గూడెఁ దెనుంగు రాయ రాహుత్తండు
కస్తూరి కేరాజు బ్రస్తు తింతు ;
స్వర్గస్తుఁడయ్యె విస్సన మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిఁగలుగు;
కైలాస గిరిపండె మైలారు విభుఁడేగి
దినవెచ్చమేరాజుఁదీర్పఁగలడు
; _ ఇలా సాగిపోతున్నాయి మనస్సులో వేదనల గాధలు,. నేను చేసినదేమి వ్యవ సాయము అదియును మోసగించెనే చేయునదేమున్నది? ప్రభుత్వమునకు ముందు చేతులుఃజోడింప వలసినదే! పాపమాతడదే యొనరించెను. కరుణలేని రాజాధికారులు కఠినాతి కఠినముగా శిక్షాస్మృతి నమలుజరిపినారు.
సీ; కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా!
పురవీధి నెదురెండ పొగడ దండ;
యాంధ్ర నైషధ కర్త యంఘ్రి యుగ్మంబున
దగిలి యుండెనుగదా నిగళ యుగము;
వీరభద్రా రెడ్డి విద్వాంసు ముం జేత
వియ్య మందెనుగదా! వెదురు గొడియ;
సార్వ భౌముని భుజా స్తంభ మెక్కెనుగదా!
నగరి వాకిట నుండు నల్ల గుండు;
తే: కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము ,
బిల బిలాక్షులుఁ దినిపోయెఁ దిలలు పెసలు,
బొడ్డు పల్లిని గొడ్డేఱి మోసపోతి ,
నెట్టు చెల్లింతుఁ డంకంబు లేడు నూర్లు?
అనుకున్నంత యైనది. పురవీధిలో యెండకెదుగా నిలబెట్టి మెడలో పొగడ దండ( బండ కొయ్య) తగిలిచినారు. కాళ్ళకు సంకెళ్ళు దగిలంచినారు. చేతులకు వెదురు గొడియలు బిగించినారు. మెడపై పెద్ద నల్లని గుండు( పెద్ద పరిమాణముగలరాయి) నెక్కిచినారు. పురవీధుల లోనడిపించినారు. యితచేయు చున్నను శిక్షల పధ్ధతులనుమాత్రము వర్ణించుట మానలేదు. ఆకవిస్వభావమది! వేరెవరైనా రక్షించువారున్నారా?
తే: భాస్కరుఁడు మున్నె దేవుని పాలికరిగె ; అయిపోయినది యిక నేయాసయులేదు.
కలి యుగంబున నిక నుండఁ గష్ట మనుచు ,
" దివిజ కవివరు గుండియల్ డిగ్గురనగ,
నరుగు చున్నాడు శ్రీనాధుఁ డమర పురికి!"
ఆహా! మరణ వేళల యందును యెంత రాజసము! నిట్టి కవి నెన్నఁడైనఁ జూచినారా? శ్రీనాధుఁడొక్కఁడే చరిత్ర కెక్కినాడుగదా! కవి సార్వభౌముని జీవన ప్ర స్థాన మీరీతిని ముగిసినది. యిది యెల్లరకు గుణపాఠమే! మానవుఁడు కోరవలసినదిది" అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం/ దేహాంతే తవసాయుజ్యం దేహి జన్మని జన్మని",_ యని దానిని మరచి శ్రీనాధుఁడిహ సుఖములకే ప్రాధాన్య మొసగి, యిక్కటుల పాలైనాడు. ముందు చూపు లోపించి ధనమంతయు వ్యయ పరచినాడు . యిట్టి పొరపాటులకు శిక్ష తప్పదు. కోరికల నరికట్టి మిత హిత జీవనుఁడై మనుగడ సాగించుట మానవ కర్తవ్యమనుట. శ్రీనాధకవి జీవన ప్ర స్థాన సందేశము.
ఇంత వరకు నాసాహిత్య ప్రయాణము తోడునడచి, నన్ను బహుధా ప్రోత్సహించిన సాహితీ బంధువులకు, మిత్రులకు నాకృతజ్ఙతాంజలులు! సెలవు.
జయంతి తేసుకృతినో రస సిధ్ధాః వీశ్వరాః 
నాస్తి యేషాం యశః కాయో జరామరణజం భయమ్!!

స్వస్తి ర్భవతు!

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 51

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

బాల చంద్రుఁడొనర్చిన సంకుల సమరము 
మంజరీ ద్విపద :- " అటమున్నె నరసంహుఁ డధిక బలంబు
తెచ్చుక మొనజేసి ధీరత నెదుట
మద గజంబుల పైకి మత్త సింహంబు
అరుదెంచు విధమున నాశ్చర్యలీల
ఫౌజుపై నడచిరి' బాలురార్వురును .
వసుధేశు తమ్ముఁడు వారలఁ జూచి,
తనవారి కెల్లను తా సైగ జేసె;
బ్రమ్మిరి విలుకాండ్రు ఘనులపై నపుడు
బాలుఁడు మొదలైన బాలవీరులును
నారుల విండ్లను నలి నలి జేసి
తొనలును బాణముల్ తునుకలు సేయ
వెరువక యుండిరి. వీరుల పైకి
కదిసి మూకలువచ్చి కదన మధ్యమున
సాంద్ర వంశాటవీ చందము దోప ,
సిమ్మిరి సాధ్వస కరముగ నపుడు.
తలకక వారలు ధైర్యంబు నొంది
చే గదల్ ద్రిప్పుచు చెలగి యార్చుచును,
కొక్కెర గుంపుపై కుప్పించి యురకి
సాల్వంబు ఢీకొన్న చందము గాగ,
కరులపై సింహంబు గదిసిన రీతి,
వ్యాఘ్రంబు గోవుల వడి దాకునట్లు ,
సేనల జెండాడి చేతుల మెడల,
ఘ ఘనమైన కత్తుల ఖండించి మించె;
________________________
ఘనుఁడైన శ్రీనాధ కవి రాజరాజు
చెన్నుని కృప చేత చిత్తము ప్పొంగి,
బాలుని విక్రమ ప్రావీణ్య మెల్ల
జనులకు వివరించె సక్తితో దీని; 

______ _
భారత రణ క్షేత్రమున నభిమన్యునివలె బాలచంద్రుఁడు తనమిత్రుల తో గూడి విక్ర మించినాడు. అదియొక సంకుల సమరము. యుధ్ధ నీతిని ప్రక్కకు నెట్టి శత్రు వీరులను మూకుమ్మడిగా నెదిరి మట్టు బెట్టుటయే నలగాముని వర్గమువారి యెత్తుగడ. నరసింహుఁడు నలగాముని తమ్ముఁడు. పద్మ వ్యూహమున బ్రవేసించిన యభిమన్యనివలె బాలచంద్రుఁడు పలనాటి వీరుల నెదుర్కొన, నరసింహుఁడు తన వర్గమువారికి కను సైగ జేసెను. మూకుమ్మడిగా మీదపడుడని యాసూచనకు సంకేతము. వీరులందరు బాలుని పైబడి దాడిచేయసాగిరి. అయినను బాలచంద్రుఁడు బెదరలేదు. మడమ వెనుకకు ద్రిప్పలేదు. కొంగలగుంపుపై దాడిచేయు గ్రద్ద వలె, కరులపై లఘించు సిహమువలె, పెదిదపులి యావుపయి దాడిచేసిన వడువున, సేనల పై లంఘించి చీల్చి చెండాడెను. కత్తులతో వారి కుత్తకలు ఖండించెను, కాలుసేతులను తుండె తుండెములుగా నరకి పోగులు బెట్టెను. నాటి భయంకర యుధ్ధమున అక్రమ యుధ్ధమును ప్రోత్సహించిన నలగాముని తమ్ముఁడగు నరసింహ నాసుని తలనరకి తన కత్తిమొనకు గుచ్చి తెచ్చి మలిదేవరకు కానుక సమర్పించెను. ఆమరునాడు అందరేకమై నాగమ్మ ప్రోత్సాహమున దారుణాతి దారుణముగా బాలచంద్రుని నరకి జంపి ప్రతీకారమును దీర్చు కొనిరి. వీరుడై యెగసి పరుల గుండెలలో భయంకర స్వప్నమై దోచి విక్రమించి వీరుడై ప్రతిష్ఠనంది బాలుఁడు వీర మరణమును వరించెను. బాలచంద్రుని కీర్తి యాచంద్ర తారార్కమై నేటికీ పలనాట నింటింటా మారుమ్రోగుచునే యున్నది. ఇట్లు బాలుఁమరుఁడైనాడు. తిక్కన యభిమన్యు నెంతఘనముగా చిత్రించెనో , శ్రీనాధుఁడునూ నంతకు తక్కవ గానిరీతిని బాలచంద్రుని చిత్రించి ధన్యుఁడయ్యె ననుట తధ్యము!
పలనాటి వీర చరత్రమున నెన్నదగిన పాత్రలు 
1 బాలచంద్రుఁడు 2 బ్రహ్మ నాయుఁడు 3 నాయకురాలు నాగమ్మ ;
ఇది వీర చరిత్ర యగుటచే వీరునకే ప్రధమ ప్రాధాన్యము. బాల చంద్రుఁడు బ్రహ్మ నాయుని యేకైక కుమారుఁడు. మగువ మాంచాల యితని భార్య యాపన్నసత్వ(గర్భవతి) నవోఢ.
బాలుఁడు మహాసాహసి, మహావిక్రమ సంపన్నుఁడు. ప్రభుభక్తి పరాయణుఁడు. రణకోవిదుఁడు. యెంతమంది మీదపడినను చలింపక వెనుదిరుగక , శత్రు సంహారమే యెకైక లక్ష్యమై సాగిపోవు మహావిక్రమాటోపముఁగలవాడు. కూటయుధ్ధమున వంచనతో తనను గెలువ నుంకించిన నరసింహ నాయుని దారుణముగా జంపి వాని శిరమును కత్తికి గుచ్చి శత్రువులను హెచ్చరించిన ధీశాలి. యుధ్ధరంగమున వీరమరణమును వరించిన రణవీరశిఖామణి! మగువ మాంచాల యితనికి తగిన భార్య! యుధ్ధమునకేగు భర్తను ప్రోత్సహించి స్వయముగా రక్తముతో వీరతిలకమును దిద్దిపంపిన ధీరవనితామతల్లి!
బ్రహ్మ నాయుఁడు పలనాటి కృష్ణునిగా బ్రసిధ్ధినందిన యశస్వి! భారత యుధ్ధమున నిరువాగులకు శ్రేయమును గూర్చుటకై శ్రీకృష్ణుఁడెట్లు పరిశ్రమించెనో, యంతటిపరిశ్రమమును చేసినవాడు బ్రహ్మనాయుఁడు. నలగామునకు , మలిదేవునకు నడుమ రగిలిన వైరము నుపశమింప జేయుటకు కతడు చేయని యత్నములేదు. పడనిపాట్లులేవు. యెప్పటికప్పుడు నాగమ్మ కుటిలముతో నాతడొనర్చిన హితకార్యములన్నియు వ్య్రర్ధము లగుచుండెను. నిరువాగులకు యుద్దమును వారించుటకు నతడొనర్చిన యత్నములన్నియు నేటిలో బిసికిన చింతపండు వలె వ్యర్ధములు కాగా విధిలేక సమరమునకు గడంగెను. ఆవలిపక్షమువారు అధర్మ యుధ్ధమొనరించినను తనవారిని ధర్మము తప్పరాదని వారించెను. బాలుడు నరసింహుని తల నరకి తేగా నతని యకృత్యమును నిర్ ద్వంద్వముగా నిరసించెను. తుదకు నలగాముడోడిపోయి చేతికి చిక్కినను వానిని జంపక క్షమించి తిరిగి గురజాలకు రాజుగా జేసి సగౌరవముగా బంపెను. తనను చివరి వరకు నమ్ముకొన్న మలిదేవరకు మాచర్ల రాజధానిగా రాజ్యము నప్పగించి తనప్రభు భక్తిని చాటుకొనెను; అతనికి పుత్ర శోకాదులులేవు. కాప్యదీక్షయే ప్రధానము. ప్రజల యోగక్షేమ ములే ప్రధానము. అతడొకత్యాగశీలి! ప్రభుభక్తికి ప్రతీక! ధర్మావతారుఁడు .పలనాటికృష్ణుడను బిరుదమతనికి సర్వధాసముచితమైనదే!
కుటిలనీతికి, కుహనాతంత్రములకు, మిత్ర విరోధమునకు , విషప్రయోగాలకు, అహంకారమునకు, అసంబధ్ధకార్య కలాపములకు, నిలువెత్తు సాక్ష్యము నాయకురాలు నాగమ్మ; భారత కధలోృశకుని వంటిది నాగమ్మ! తనను నమ్మిన వారిని చేతిలో నదిమి పెట్టి నట్టేట ముంచుట యీమెస్వభావము: తన పంతము నెగ్గుటయే యీమెకు ప్రధానము . మోసపూరితంగా మలిదేవాదులను కోడిపందెములలో నోడించి రాజ్యమువెడల నడచి యవధి యనంతరము రాజ్యమీయనీయక సంధి పొసగనీయక వేధించి బలవంతముగాయుధ్ధమునకు ప్రేరణజేసినదీమెయే! ఈమెకుటిలమువలననే పచ్చని పలనాడు సర్వ నాశనమై పీనుగుల దిబ్బగామారినది; నేటికీ పలనాట దుష్టవనితలను యేమే నాగమ్మలా తయారైనావు. అనిచెప్పు కోవటంవింటూఉంటాము;
ఇదీ పలనాటి వీర చరిత్రము
శ్రీనాధ కవిసార్వ భౌముఁడు మంజరీ ద్విపదలో సర్వజన వేద్యముగా రచించి ప్రజాసాహిత్యమునకు రూపు రేఖ లను తీర్చి దిద్దినాడు.
ఇఁతటితో నీప్రసంగమును నిల్వరింతము. రేపు శ్రీనాధుని జీవన ప్రస్థానమున తుదిమజిలీ! చెప్పుకుందాము నేటికి సెలవు.

Friday, 26 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 50

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

ఒక నాడు " రసికుడు పోవడు పలనాడు" అనియెకసెక్కము లాడినశ్రీనాధునకు తుదకు పలనాటి నివాసము తప్పలేదు గదా! ఆహా! విధియెంతవిచిత్రమైనది. ఒకనాడు ప్రౌఢ కవిత్వమే కవిత్వ మని గొప్పలు జెప్పిన శ్రీనాధుడు నేడు పదకవితకు పట్టము గట్టక దప్పలేదు. ప్రజా కవిత్వ మేదియో యతనికి యిప్పుడెరుక పడినది. అందుచేతనే నేడు ద్వపద రచనమునకు బూనుకొనినాడు. ద్వపదయనునది దేసి రచన యదిపదమే గాని పద్యముగాదు. ద్వి పదము రానురాను ద్వపదగా మారినది.
ప్రాఙ్నన్నయ యుగమంతయు నిట్టి పాటల లోనే సాహిత్యము విస్తరిల్లినది. తరువోజ, మధ్యాక్కరలు నాటి దంపుడు పాటలకు ప్రతిరూపములు. శ్రమైక జీవులగు పామరులు పనులుజేయునపుడు శ్రమాపనోదనార్ధమై యిట్టి పాటలను పాడుకొనెడివారు. ద్విపదయు నట్టిదియే! చిన్నచిన్న పదములతో యలతియలతి భావములతో రెండు పదములల్లి పాడుకొనెడివారు. రానురాను యివి పండితుల యాదరణమునకు నోచుకొని శివకవుల నాటికి సాహిత్య రూపమునకు వచ్చినవి. ద్వపద సాహిత్యాభివృధ్ధికి మూలకారకులు శివ కవులేననుట తథ్యము!
ప్రజల నాడి యిప్పటికి శ్రీనాధునకు బోధపడినది. కావున ప్రజాసాహిత్య సాధనగా ద్విపద నెన్నుకొన్నాడు. మంజరీ ద్విపద యొకభేదము. యిదియలనాటి యక్షగానములందునను, హరికధలయందునను కధానిర్వహణమునకు ఉపయోగించు చుండెడివారు. చెప్పునది వీరగాధ పాటకు యాటకు మంజరీ ద్వపద యనుకూల మగుటచే కవిసార్వభౌముడు దానినే స్వీకరించినాడు.
పలనాటి కధ యొక బృహత్ గ్రంధము తాటియాకులలో చివికి పోవుచున్న నీగ్రంధమును శ్రీ అక్కిరాజు ఉమాకాంతం పండితులు దానిని బరిష్కరించి 1911 సం లోప్రకటించినారు . మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారిదయ వలన నాకది చిక్కినది. అక్కడక్కడ శిధిలమై యున్న దానిసాయమున నేనీగ్రంధమును మీకు పరిచయము జేయగలుగుచున్నాను. మిత్రునకు కృతజ్ఙతలు!
పలనాటికధ మిగుల పెద్దది. దానికిది సంగ్రహ పరిచయము_
పలనాటి రాజ్యమునకు ప్రభువు అనుగురాజు. అతనికి మువ్వురు సతులు. క్రమముగావారికి
నలగమరాజు, నరసింహరాజు, మలిదేవరాజు మున్నగు కుమారు లుదయించిరి. వారితల్లులు వేరు. సోదరులు. తండ్రియనంతరము నలగామరాజు ప్రభువయి గురజాల రాజధానిగా పలనాటినేలెను. బ్రహ్మనాయుడు మంత్రి. మలిదేవరాజప్పటికి పిన్నవాడగుట బ్రహ్మ నాయుని రక్షణలో నుండెను. కతిపయదినములకు బ్రహ్మనాయుని కోర్కె ననుసరించి మలిదేవునకు కొంతరాజ్యమును నలగముఁడొసగెను. మాచర్ల రాజధానిగా కొంత పలనాటికి మలిదేవుడు ప్రభువయ్యెను. బ్రహ్మ నాయుడు మంత్రిగా దోడ్పడుచుండెను.
బ్రహ్మ నాయుని స్థానమున నాయకురాలు నాగమ్మ నలగామునకు మహామంత్రిణి యయ్యెను. నాగమ మిగులజాణ కుటిలస్వభావి, అహంభావి, అంతవరకు ఆనందముగా సాగుచున్న యాయన్నదమ్ముల మధ్య మాయమాటలతో వైరమును రగిలించెను.భారత కధలో శకుని వంటిది నాగమ
తుదకది భయంకరమైన యుధ్ధమునకు దారిదీసి పలనాటివీరుల దుర్మరణమునకు కారకమయ్యెను. నాగమ మాయమాటలువిని నలగాముడు మలిదేవుని కోడిపందెములలో మోసముతో జయంచెను. ఓటమిఫలితముగా వారికి నేడేండ్లు వనవాసము విధింప నాయవధిని వారు పూర్తి యొనరించి రాజ్యభాగము నడుగ కాదని నలగాముడు వారిని యుధ్ధమున కాహ్వానించెను. నాగులేటి యొడ్డునగల కారెమపూడిలో నిరు పక్షములకు భయంకరమైన యుధ్ధముజరిగెను. అందు యిరు పక్షములవారు విశేషముగా మరణించిరి. చివరకు విజయము ధర్మ పక్షమును వరించినది. మలిదేవుడు జయమునందు కొన్నాడు.
నేటికింతటితో నీప్రసంగమును విరమింతము రేపుఃతక్కన ముచ్చట. సెలవు.

Thursday, 25 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు -49

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

శ్లో శరదిందు వికాస మందహాసామ్ !
స్ఫుర దిందీవర లోచనాభిరామామ్!
అరవింద సమాన సుంద రాస్యామ్!
అరవిందాసన సుందరీ ముపాస్యే!
పలనాటి వీర చరిత్రము
ద్విపద: శ్రీ రఘు నాయకుఁ జిత్తమం దెంచి
శ్రీకంఠు పరమేశు శివు నాత్మ దలచి
పార్వతీ దేవికి భావించి మ్రొక్కి
శివగణంబుల నెల్ల చితించి పొగడి
ప్రాకటంబుగ విష్ణు ప్రార్ధనల్ జేసి
-----+++-------+-----+++
చెప్ప నేర్చిన వాడ చెలగి మాచర్ల
చెన్నకేశవ స్వామి సేవ నిరతుండ
వలను భారద్వాజ వంశ వర్ధనుడ
కవిసార్వభౌముడన్ ఘనత గన్నట్టి
శ్రీనాధు డనువాడ శివ భక్తి పరుడ
శాశ్వతంబైనట్టి సద్ గ్రంధ మొకటి
చెప్పబూనీ మనసు చెలరేగియుండ
-------++++++++++++++-
చెన్నకేశవు డప్పుడు దానిట్టు లనయె;
" సౌర్యంబు పుణ్యంబు సమకూర్చునట్టి
పలనాటి వీరుల భాగవతంబు
ప్రకటితంబుగ నీవు రచియించి మాకు
నంకితం బొనరింప ననువొందు చూవె"
----------------------++
మంజరీ ద్విపదగా మన్నించి నేను
చెప్ప బూనితి వచః శ్రీలు మెఱయంగ;
రెండవ కురు పాండవ యుధ్ధము గా తెలుగు నాట ప్రసిధ్ధినందిన పలనాటి వీరచరిత్రమును మంజరీ ద్విపదలో రచించిన ఘనుఁడు శ్రీనాధుఁడు. కవిసార్వభౌమునిగా , ప్రౌఢ కవిగా పేరొందిన శ్రీనాధ మహావి సులభాతి సులభమై పామరలకు గూడ వేద్యమై యొప్పారు చున్న నిట్టిగ్రంధ మును అమ్మహనీయుడొనర్చుట యబ్బుర పాటు నొనరింపక మానదు. పైగా మాచర్లలో వెవసిన చెన్నకేశ్వర స్వామి తనకు కలలో గనిపించి పలనాటి భారతమునా పేరొందిన పలనాటి వీరులకధ ,ద్విపద లో కావ్యముగా వ్రాసి తనకంకితమొసంగ గోరెనట! ఆహా శ్రీనాధుడెంత ధన్యుఁడు. విష్ణుదేవుని దర్శన భాగ్యము నందెను.
శ్రీనాధుని వంటి మహాకవి యింత దిగువకు వచ్చి ద్విపదలో కావ్య మేలవ్రాయవలెను? గొప్పప్రౌఢగ్రంధమునే వ్రాయవచ్చునుగదా? యనుసందేహము మనంబందు గలుగక మానదు. దానికి ముందుగా నాటికి తెలుగు నాట గల రాజకీయ పరిస్ధితులను బాగుగా బరిశీలింప వలసియున్నది.
శ్రీశైలమునుండి తిరిగి వచ్చునప్పటికి తెలుగునాట పరిస్ధితులుతారుమారైనవి. ఒడ్డెరాజుల చేతిలో రెడ్డి రాజులు ఓటమిని బొందిరి . ఒడ్డెరాజుల పాలన లోనికి రెడ్జిరాజ్యమంతయు వచ్చినది. ఆవేమారెడ్డి , మున్నగువారేమయ్యిరో నూహింప నశక్యము. పాపము కవిసార్వభౌముని నడుము విరిగి నట్లయినది. ఇంతటితో నేటికీ ప్రసంగమును నిల్వరింతము రేపుతక్కినది. సెలవు

Wednesday, 24 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు - 48

కవిసార్వ భౌముఁడు శ్రీ నా ధుఁడు
శా; పంచారామ విలాసినీ ధవళ దృక్పాఠీన జాలాయ మా 
నాంచత్కారము నిర్నిబంధన మనోజ్ఙా కార రేఖా
పంచా స్త్రుండగు నా కుమారకుఁడు దర్ప స్ఫూర్తి నవ్వీటిలో
సంచా రం బొనరించెఁ గాంచన మహా సౌధాగ్ర భాగంబులన్ ;
శివరాత్రి మాహాత్మ్యము- 2ఆశ్వా- 17 వ పద్యము
భావము: ఇది ముందు మనము చెప్పుకొనఁ బోవు శివరాత్రి మాహాత్మ్యము లోనిది. సుకుమారునివర్ణనము. వానిరూపము మిగుల గొప్పది. దక్షారామం లోనేగాక పంచారామ సీమలలో వానిని జూచిన మానినీ మత్స్యముల తెలిగన్నులనే మత్స్యములను బట్టు వలవంటిదట! నిబమధనారహితుఁడయిన మనేహరమైన ఆకార రేఖతో మన్మధుని దలపించు నాతఁడు మహాగర్వియై కాంచనమయ మైన మేడల శిఖరములయందు నాపట్టణమున సంచరింప సాగెనని దీని భావము ; ముందు ముందు ఈపద్యమును సమన్వయ మొనరింతము. ముందుకు బోదము.
అవచి తిప్పయకు హరవిలాసము నంకిత మొసఁగి యతడిచ్చిన ధనమును చేతఁబట్టి శ్రీనాధుఁడు
మహాశైవ క్షేత్రమగు శ్రీశైలమునకు ప్రయాణ మయ్యెను. రెడ్డిరాజులపై నొడ్డెరాజుల తిరుగు బాటువార్త యొకటి యతని చెవులఁ బడెను. ఇటు బహమనీ సుల్తానులు విజయ నగరముపై దండెత్త నుంకించు చుండుటయుఁదెలిసెను. గోరుచుట్టుపయి రోకలి పోటు చందమున కాకతీయులపై మొగలు రాజుల దండయాత్రయు నారాజ్యము పతనమై గోల్కొండ రాజుల యేలుఁబడి లోనుండుటయు, నొకటొకటిగా నన్నియు చెడువార్తలే చెవిని బడసాగెను. రాజమహేంద్రవరము ఒడ్డెరాజన్యుల పరమగుటకు సిధ్ధముగానుడుటయు, దుఃఖ దాయకమయ్యెను. ఇదీ అప్పటి రాజకీయ స్ధితి.
దైవముపై భారముంచి ప్రయాణమును కొనసాగించెను. శ్రీశైవమున శైవ మఠమున బస యమిరినది. భ్రమరాంబా మల్లిఖార్జనుల దర్శనమైనది. కర్తవ్యాలోచన చేయసాగెను." ఇపుడా ప్రభువులు సంకట స్ధితిలో నున్నారు. యీస్ధితిలో తానేగి చేయునదేమి? సలహాలిచ్చుటకు సింగనా మాత్యుఁడు కలఁడుగదా! తానిప్పుడు కొంకాలమిచటనే యుండుట లెస్స. పరిస్ధితుల యనుకూలము ననుసరించి కొండవీటికేగ వచ్చును" అనితలపోయుచు దైవదర్శన భాగ్యమున కలరుచు నట కొంతకాలము గడుప నిశ్చయిచెను.
శ్రీ శైలము నందలి శైవ మఠమునకు అధికారి పువ్వుల శాంతయ్య యను జంగము దేవర యతడు చాలకాలమునుండి శైవ సంబంధమగు నొక కావ్యమును దనపేర వెలయింపఁజూచుచుండెను. శ్రీనాధ కవి రాకతో నది చిగురులుఁ దొడిగినది. యొకానొక శుభముహూర్తమున శ్రీనాధుని కడ కేగి యంజలి ఘటించి " కవిసార్వ భౌమా! తమ రాకచే నామఠము , నాజన్మమును కృతార్థములైనవి. నాదొకటి చిరకాల వాంఛ మిగిలియున్నది. లోకోత్తరమగు శివరాత్రి మాహాత్మ్య కధను తమరివలన వనవలెనని, నేటికి యాపరమ శివుని దయచేనాకోరిక దీరు నవకాశముఁజిక్కినది . నావిన్నపమును మన్నించి దయతో నాగ్రంధరాజమును నాపేర వెలయిపుడు; ఇది మీకుఁ దక్క నన్యులకు సాధ్యముఁగాదని బలికెను. "
శ్రీనాధుఁడు సమ్మతించి స్కాంద పురాణ కధను తనకవితచే మెరుగులు దిద్ది చతురాశ్వాస పరిమిత శైవ ప్రబంధముఁగా తీర్చి దిద్దెను. శివరాత్రి మహాత్మ్యమును ఐదాశ్వాసముల కెక్కుడుగా కవిసార్వ భౌముఁడు రచించెనని కొందరివాదన. వాదనలకేమి వేయి. కానీయాగ్రంధము నేఁడు దొరుకుటయే గగనమే! మనయదృష్టము వలన మిత్రులు శ్రీ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి తోడ్పాటుతో 1930 సం:లో ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన (అక్కడక్కడ సిధిలమైన) ఒక ప్రతి లభించినది. దానిసాయమున నాపరిశీలనకు అవకాశము చిక్కినది వారికి మనఃపూర్వక ధన్యవాదములు!
ఇందలి కథ:- శివ విష్ణువులు తామే గొప్పవారమని యెవరికి వారు కలహింప శివుడు వారిని బిలిచి పరీక్షఁబెట్టుట. వారాపరీక్షలోనోడి శివుఁడే తమకన్నమిన్న యని ప్రకటించి శివ మహిమను దెలుపఁగోరుట, శివుఁడు వారికి శివరాత్రి మహిమమును సోదాహరణముగా వివరించుట యిందలి ముఖ్య విషయము. ఆశివరాత్రి మహిమను దెలుపుటకు శివుఁడెన్ను కున్న కధ సుకుమారుని కధ.
ఇది యించుమించు కాశీఖండములోని " గుణనిధి" కధకు సమానము. పుట్టుతో నుత్తమ బ్రాహ్మణ కులజాతులై వేద వేదాంగ పారంగతులై రూపవిజిత మన్మధులై విధివశమున చెడుసావాసములకు లొంగి, జూదపరులై, చోరులై, మద్యమాంస భక్షకులై, పరాంగనాసంగమ లోలురై యింటగల ద్రవ్యమంతయుఁదొంగిలి గొనిపోయి, తుదకు యింటికి నుండి గెంటివేయబడి యతినికృష్టపు బ్రతుకు చవిజూచి , చివరకు గతజన్మ సుకృతమోయేమో శివరాత్రినాడు ఆహారములభింపమి నుపవసించి , మరునాడు వ్రేపకడ యాహార సంపాదనకై శివాలయమున బ్రవేశించి , ప్రసాదభక్షణ మొనరించుటచే శివానుగ్రహ పాత్రులయి కైలాసము నందుకొన్నారు. సరిగా నిలాంటి కధ యే మరియొకటి యున్నది. అదితెనాలి రామకృష్ణుని చే చిత్రింపఁ బడిన పాత్ర. "నిగమ శర్మ" అతఁడు వీరికిఁదమ్ముఁడు . వీరికన్నామిగుల ఘనుఁడు.
పైపద్యము ఇతని గొప్పదనమునే వెల్లడించు చున్నది. యిక విషయమునకు వత్తుముగాక!
వింధ్యాచల ప్రాంతమును హేమపాలుఁడు పరిపాలించు చుండెను. ఆతని మహామంత్రియు, గురువునగు యజ్ఙదత్తునకు కులసతి సుశీల యాపుణ్య దంపతులకు చాలకాలమువరకు సంతతిలేదు .
తే: తవయ సంతాన లబ్ధి దౌ దవ్వుగాగ
విభవ సంపత్తి గల్గియు విన్నఁబోయి
పుత్ర వదనావ లోక నోధ్భూతమైన
శర లతా కాననము వోలె జవ్వనంబు
; - సంతాన లేమిచేత వారి యవ్వనం రెల్లు పూల వనంగా మారిపోయందట! రెల్లు తెల్లగా పూత పూస్తుంది చూడటానికి చాలా అందంగా వుంటుంది. కానీ కాయలుమాత్రం దానికి రావు. వీళ్ళుకూడా అలాగే యిరుగు పొరుగు లకు కనిపిస్తు న్నారు. కానీ యేంప్రయోజనం? యజ్ఙదత్తుని యజ్ఙాలు ఫలించాయి. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. చాలాగారాబంగా పెంచారు. తనకు వచ్చిన వేదాది విద్యలను తండ్రి నేర్పాడు పెద్దవాఁడయ్యాడు. యువతీజన మన్మధుఁడై యలరారుతున్నాడు. వాడి దృష్టి యిప్పుడు యెప్పుడూ ఆడవాళ్ళమీదే! దీనికి తోడు వాడికి దుష్టజన సాంగత్యం అబ్బింది. వారితోఁగలసి జూదమాడటం నిత్యకృత్యమైంది. తల్లికి తెలుసు. పిల్లడి మీదమమకారం తండ్రికి తెలియనీయకుండా ఆమెను వారించింది. అదివాడికి లోకువ గామారింది. యింటనున్న మణిమాణిక్యాదులు సంపదఅంతా జూదరులపాలైంది. యిప్పుడు దొంగగాకూడా మారాడు. వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, జూదంలో మొనగాడయ్యాడు.
పాపం! యజ్ఙదత్తునకు యీవిషయాలుఁదెలియవు. ఇంటిదొంగ గదా! పట్టనెవ్వరి వశం? ఒకనాఁడు యజ్ఙదత్తుఁడు రాజసభనుండి యంటికి వస్తున్నాడు. దారిలో నొకజూదరి తన నవగ్రహ వేష్ఠన మైన అంగుళీయకాన్ని ధరించివిలాసంగా వెళుతున్నాడు. పురోహితునకు పట్టరాని కోపం వచ్చింది. ఆపాడు."ఒరే/ దొంగా! నీకెక్కడిదిరా యీయుంగరం? చెప్పక పోతే రాజ దండన తప్పదన్నాడు." దానికి బదులుగా" మీరు వేదాది విద్యలలో యెంత పండితులో మీపుత్రరత్నం జూదంలో అంతగొప్ప పండితుడు. అతడుజూదమాడి యోజినదీ యుంగరము. గెలిచితిమి. మేము దొంగలమా? యేమి?" యనిఁబలుక నవమానముతో గబగబ నిటికేగి జరిగిన దంతయు నెరింగెను. చెడిపోయినకుమారుని యందు కరుణఁజూపక యిలువెడల నడచెను.
సుకుమారునకు పెద్దలయాస్తిని గుడించుటయే దెలియునుగాని గడించుట యతనికేమి దెలియును? అడవినిబడినాఁడు. ఆకలితో పేగులు మాడుచున్నవి. అప్పుడు ఇల్లు , తల్లియు గుర్తుకు వచ్తినారు. కన్నతల్లిని దలచుకొని ,
చ: అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయిం బొడతేర, గిన్నెలో,
బెరుఁగును, వంటకంబు, వడ పిందియలున్, గుడువంగ బెట్టు ని
ర్భర కరుణా ధురీణ యగు ప్రాణము ప్రాణముఁ దల్లి యున్నదే!
హర హర! యెవ్వరింక కడుపారసి బెట్టెద రీప్సతాన్నమున్;
- అనియాయడవిని బడి వల వల యేడ్చినాఁడు. ఇంకను బుధ్ధిరాలేదు. ఆయటవిలో నొకఛండాలుఁడు జాలిపడి వాని నింటికి గొనిపోయెను.ఃకూడు వెట్టి నిదురింప గూడునిచ్చెను. ప్రత్యుపకృతిగా నతని భార్యను లేపుకొని పారిపోయెను. వారట్లు పోయి కిరాతులలో గలసిరి వేచాడుట , దొంగతనము, దోపిడీ లు జీవన వృత్తులయినవి. కొంతకాలమున కామాలెతయు వీనిని బరిత్యజించెను.
అపుడీతడు అడవినిబడి పోవుచు శివరాత్రమున ఆహారము లభింపమి నుపవాసియై ప్రక్కనున్న శివాలయమునకేగి, భజనచేయు భక్తులు వెడలునందాక కాపుండి వ్రేగు సమయమున వారు బోవ గుడిలోదూరి, ప్రసాదమును భుజియించి , రేయంతయు నిదుర లేమిచే నందే నిదురించెను. ఇంతలోభక్తులరుదెంచి దొంగ యనిభావించి చావమోదినారు. విగత జీవుడయినాడు. నరకమునుండి యమభటులును, కైలాసము నుండి శివభటులును యరుదెంచిరి' వాదోపవాదముల యనంతము అతడు శివభక్తుల ప్రాపున కైలాసమున కేగెను. ఇదీ కధ!
శివరాత్రినాఁడు పవసించి, జాగరణమొనర్చుట, కారణములుగా నతఁడు కైలాసమున కేగగల్గినాడు. యెంతటి పాపియైనను శివరాత్రి నాడు ఉపవసించి జాగరణమొనరించిన , వారికి కైలాస ప్రాప్తి తధ్యము! అనిఫలితార్ధము.
శ్రీనాధ కవిత యిందు కొంత ప్రౌఢతనుఃప్రదర్శంచినను, గత గ్రంధకధలను తడిమి కావ్యమును విరచించుటచే, నంతగా రాణకెక్క లేదని ఫలితార్ధము. యింతటితో నేటికి ముగింతము. సెలవు!

Tuesday, 23 June 2015

కవిసార్వ భౌముడు శ్రీనాధుఁడు - 47

కవిసార్వ భౌముడు శ్రీనాధుఁడు

తేే: రంభ! రంభామ్ర ఫల సమగ్రంబుఁగాఁగ
నమృత దివ్యాన్న భిక్ష కామారి కొసఁగె,
రాపుఁ జన్నుల కెలను రారాజు పట్టి
పట్టి యెత్తిన నఖ రేఖ బయలు పడగ;
అప్సరలలో నొకతెయగు రంభ రంభాఫలములను, మామిడి పండ్లను జోడించి దివ్యాన్న భిక్ష కామారికి యొసగినదట . ఆయొడ్డించుటలో బాహుమూలములనెత్తి యగపడ జేయుచు నలకూబరుడొనర్చిన నఖక్షతముల నెత్తిచూపుచున్నదట! యిదిభవుని రెచ్చ గొట్టుటేగదా!
అసలు దేవలోకమున నుండదగిన యప్సరో భామినులకిట నేమిపని? వారీ దారుకా వనమున నివసింప కారణ మేమి? యనుప్రశ్న మనలోకొందరికి ఇప్పటికే గల్గియండవచ్చును. వినుడు. దారుకావనము హిమగిరి కంథరములకు సమీపమునగల యతిసుందరమైన వనము; సర్వకాలములయందును యటవసంతమే! నవ పుష్ప ఫల విరాజితమై నందనవనమును పోలియుండును. తత్కారణమున సప్తఋషులు దీనిని తపోవన భూమిగాఁజేసికొన్నారు. దేవేంద్రునకుృ వారినిజూచిన భయము. వారిదుర్భర తపంబున తనదేవేంద్రపాలన కెట్టిముప్పు గలుగకుండ యెప్పటి కప్పుడు వారితపోభంగ మొనరించుటకు రంభాద్యప్సరో భామినులకు ఒకవాడ నేర్పరచి యందుండ నియమించెను. వఅదికారణముగా వారిచ్చటనివసంచుచున్నారు.
దారుకావనము హిమవంతునిరాజధాని ఓషధప్రస్థమునకు నాతిదూరము. మామపైనలిగిన భవుఁడు పరివారముతో దారుకావనము నేతెంచినాడు. యధేచ్చా విహారములతో తృతీయ పురుషార్ధమునకు వన్నెలుదిద్దుకొను చున్నాడు.
ఉ: పెట్టెఁ దిలోత్తమాప్సరస భిక్ష ప్రియంబున భూతభర్తకున్
గట్టుఁబసిండి పాత్ర బులకండముతోడ ,ఘృతంబుతోడఁగ్రొం
బట్టుఁ బసిండి సిబ్బెములఁ బయ్యెద కొం గొక కొంతజారి చ
న్కట్టు లలాట లోచనుని కన్నులు మూటికి విందు సేయగన్;
ఇకతిలోత్తమ పసిడి పాత్రలో పులకండములు, ఘృతములను గలిపిదెచ్చి వడ్డించింది, యెలా?తానుగట్టిన క్రొత్త పట్టుచీరె కొంగొకింతజారగా నామెచనుకట్టుఅందమంతయు నాతని మూడు నేత్రములకు విందు చేయునట్లు భిక్షను వడ్డిచినది. నొత్తముమీద అప్సరల భిక్ష యైనది. ముందుకు నడచినాడు. సప్తఋషులయావాసములు కనులఁబడినవి. వారియాడువారు త్రిలోక మోహనులై యున్నారు
మ: దరహాసంబుల భ్రూలతా నటన ముద్రా విభ్రమ ప్రౌఢిమన్,
బరి హాసోక్తుల భావ గర్భ రస సంపల్లంపటాలోకన
స్ఫురణా భంగుల మౌని కాంతల మనంబుల్ చూరలాడెన్ మహే
శ్వరుఁడు ద్దామ విలాసి దారు వనికా వాటప్రదేశంబులన్ ;
కొందరినిఁజూచినవ్వుతున్నాడట! మరికొందరికి కనబొమల నాడిస్తో యేవోసంకేతాలుఁ బంపుతున్నాడట! కొందరితో వేళాకోళాలాడుతున్నాడట! మరికొందరినురససూచకంగా చూపులునిగిడి స్తున్నాడట! ఈవిధంగామునికాంతల మనస్సులను శివుడు కొల్లగొట్చాడట! అమాయకులైనయాఋషిపత్నులెల్లరాశంకరుని మాటలకు లోగి గిరి గహ్వరముల నతనితో నెధేఛ్ఛావిహారమొనరింప సాగిరి. సప్తఋషు లీయకృత్యమునకు గినికి యొక్కుమ్మడిగా బట్ట నుంకింప బట్టువడక, మహాలింగోధ్భవమును ప్రదర్శించినాడు . పాతాళమునుండి యాకాశమువరకు పరివ్యాప్తమై, నయాలింగాకారమును గాంచి వారద్భుతమునంది చేతులు జోడించినారు.
అల్లుని యాగడములనువిని మామ హిమవంతుఁడరుదెంచి మంచిమాటలతో నింటికి గొనిపోయెను. శివపార్వతుల సంసారము నిలఁ బడినది. శివుడు కాలకంఠుఁడుగదా ! ఆవిషయమునే పార్వతి యడుగ దానికి సమాధానముగా క్షీరసాగర మథన కధను శివుఁడు పార్వతికిృవినిపించెను. జగన్మోహిని యమృత వితరణము తో నీ రెండవ విలాసము పరిసమాప్త మగు చున్నది.
ఇక మూడవ విలాసము అర్జునుని పాశుపత సంసిధ్ధి. కాలకేయాది రాక్షసగణం దేవతలను బాధించు చుండగా అర్జునుఁడు పాశుపతం తో వారిని యుధ్ధంలో సంహరిస్తాడు. దేవతలకు మహోపకారం చేస్తీడు. ఆసందర్భంగానే వలచివచ్చిన తనను కాదనుటచే రంభ అర్జనునకు శాపమీయటం మొన్నగు విషయాలు యిందు ప్రసక్తమైనాయి. హిమగిరిపై అర్జునునిఃమహోగ్రతపంబు, మాయాశాంబర వేషధారియై శంకరుఁడు కిరీటిని పరీక్షింప నెంచటం, వారినడుమయుధ్ధం , చివరకు పాశుపత ప్రాప్తి, రాక్షస సంహారాది విశేషాలతోనీ మూడవవిలాసం వీర రస సమున్మేషమై ముగిసినది.
ఇట్లు కరుణ, శృంగార, వీర రసోచితములై, పరమేశ్వర లీలా విహార విలాస విజల్పితములై, శ్రీనాధుని ప్రౌఢ కవితాచాతుర్యమునకు నిదర్శనములై , హరవిలాసము ఒప్పారు చున్నది;
నేటికింటితో మనప్రసంగమును ముగింతము . రేపు తక్కిన విషయముల ముచ్చటించుకొందము,. సెలవు!

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 46

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ: ఏదేవి తురుముపై నేఁడు కాలము దాఁకఁ
కసుగంద కుండు చెంగలువ దండ;
యేదేవి సేవింతు రేకామ్ర నాధుండుఁ
గరి గిరీశ్వరుఁడుఁ గింకరులు వోలె;
నే దేవి మణి దివ్య పాదుకా యుగళంబు
బాతాళఁబతి మోచుఁబడగ లందు;
నే దేవిఁగొల్చి మత్స్యేంద్ర నాధాదులు
యోగ సంసిధ్ధికి నొడయు లైరి;
తే: యమ్మహా దేవి కామాక్షి యఖిల వంద్య,
దేవ తాదిమ శక్తి సందీప్త మూర్తి
యవచి దేవయ త్రిపురారి కర్ధి నొసఁగు
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు.
హరవిలాసము- అవతారిక- 3వ పద్యము.
భావము:- కంచిలో వెలసిన కామాక్షీ దేవి యవచి తిప్పయ్యకు ఆరాధ్య దేవత యగుటచే శ్రీనాధుఁడీ పద్యమున యాపరదేవత యాశీస్సులను తిప్పయకు అందజేయు చున్నాడు." యేదేవి సిగలో నలంకరించిన చెంగలువ దండ సంవత్సర పర్యంతము వాడకుండునో, ఏదేవి యాలయ ప్రాంగణమును ఏకామ్ర నాధస్వామియు వరదరాజ స్వామియు రక్షించు చుందురో, ఏదేవిమణిమయ పాదుకలను ఆదిశేషుఁడు మోయు చుండునో, ఏదేవిని సేవించి మత్స్యేంద్ర నాధాదులు యోగసిధ్ధిని పొందిరో, అఖిలవంద్య యు, ఆదిమ శక్తియు సందీప్త స్వరూపిణియునగు, అమ్మహాదేవి కంచి కామాక్షి యవచిదేవయ గారి తిప్పయకు సౌభాగ్య వైభవ ప్రాభవముల నొసఁగు గాక!"
అవచి తిప్పయ సెట్టి తాత తండ్రులు మంచిదాతలు. శ్రీశైల మహాక్షేత్రమునకు సోపానమార్గమును న్రిర్మింపఁ జేసిన ఘనులు. యిక తిప్పయ సుగంధ వ్యాపారమున ప్రసిధ్ధిగాంచి విశేష ధనమార్జించిన బేహారి యందుచేతనే బంగారమునకు సుగంధ మబ్బిన తీరగును యితనికి కావ్యమునంకిత మొనర్చినచో ననికవి తలపోసెను.
హరవిలాసము:- సప్తాశ్వాసముల పరిమితి గలయీగ్రంధ మునకు కవి హరవిలాసమని నామకరణము జేసినాడు. విలాస మను మాట చెవిని బడినంతనే మనకు చామకూర విజయ విలాసము స్మృతి పధమున మెలగును . విలాస నామకరణమున కీగ్రంధ మేమూలము. ఇందు మూడు విలాసములున్నవి. అందును ముగ్ధ, మధ్య, ప్రౌఢ, లన నాయికా శృంగార వర్ణనమున మూడువిలాసములను వర్ణించెను. కానినాయికల క్రమము మాత్ర మట వ్యత్యస్త మైనది.
ఇఁక నీహరవిలాసమున 1 ,2, ఆశ్వాసములందు చిరుతొండ నంబికధ వివరింపఁబడినది. చిరుతొండడు తిప్పయవంశమునకు మూలపురుషుఁడట! శివపారమ్యమైన యీకధ పరమశివార్చకుఁడగు చిరుతొండని యచంచలమైన ధృఢ భక్తికి నిదర్శనము; నిత్య జంగమార్చనా పరాయణఁడైనయాతడు కపటజంగమ వేషధారి కోరిక దీర్చుటకు తన యేకైక తనయుని జంపి యామాంసమునువండి యతనికి వడ్డించుట యొడలుగగుర్పొడచు ఘట్టము. పరమ కరుణ రసాత్మకముగా దీనిని తీర్చిదిద్ది శ్రీనాధుఁడు హరుని మొదటివిలాసమును పూర్తి యొనరించెను .
మూడవ యాశ్వాసము మొదలు యారవ యాశ్వసము వరకుఁగల కధ శివపార్వతుల కల్యాణగాథ. తారకాసుర సంహరణార్ధమై శివకుమారోదమునకు దేవతలొనర్చిన ప్రయత్నములు , మన్మధదహనము, పార్వతి తపము, శివుని దారుకావనవిహారము , నీలగళుఁడగుటకుగల కారణమును వివరిచుటకు క్షీరాబ్ధిమథనము జగన్మోహిని యమృతమును దేవదానవులకు బంచియిచ్చుట. మొన్నగు విషయములతో నీవిలాసము ముగియుచున్నది. కాళిదాస కుమార సంభవమునకు అనుకృతిగా సాగిన యీవిలాసమున శ్రీనాధుని శృంగార వర్ణనము తిరిగి పరాకాష్ఠను అందుకొన్నది . ఇందలి దారుకావన విహార ఘట్టము. పరమ శృంగారభాజనమై యొప్పినది. శివుఁడు బరితెగించి సప్తఋషుల భార్యతోగూడ వ్యభిచారమును సాగించుట. ఋషులు శివుని బచ్టనుంకింప లింగోద్భవమును బ్రదర్శించుట, యిందలి యితివృత్తము .
శా: బ్రాలేయాచల కన్య కాధిపతికిం బ్రమ్లోచ మోచా ఫల
స్ధూలాపూప ఘృతాన్వితంబుగఁ గడుందోరంపు బిచ్చంబుఁ గెం
గేలం బెట్టె నఖాంకుర ద్యుతులతోఁగీల్కొంచు మాణిక్య ము
ద్రాలంకార మయూఖ కందళ దళ వ్యాపార మేపారగన్;
ప్రమ్లోచ దారుకా వనంలో నివసించే అప్సరల లో నొకతె యామె తనయింటి కరదెంచిన అభవునకు అపూప ఘృత సహితమైన భిక్ష వడ్డిస్తోంది. యెలాగ? చేతికున్నఉంగరాల వ్రేళ్ళకున్న మాణిక్యపు కాంతులు విస్తరిస్తోండగా , శృంగార రసీభూతమైన తనమనస్సును దెలుపు చున్నదా యనునట్లు. అసలే క్రొత్త పెండ్లి కొడుకు వెనుక మరచిన శృంగారమంతయు మరల నెమరు వేయుచున్నాడు, ఈమెచర్యలు శివుని రెచ్చ గొట్టవా? యిపుడేదిదారి? మామపైనలిగి వచ్చినాడు. ఇంటికి బోోవుటకావీలుపడదు. మరి తృషదీరుట యెట్లు? యిక్కడి వారినే యొకపట్టు పట్టవలెనను భావమాతనికి కలుగుటకు ఆమెచర్యలుదోహద మొనర్చు చున్నవి యనికవిగారి భావము . ఇట్టివెన్నోవింతలీ ఘట్చమున కోకొల్లలు. కొన్నింటినైనను పరామర్శిచనిదే ముందుకేగుట తగదు. గాన నేటి కింతటితో నీప్రసంగమును నిల్వరింతము రేపు తక్కినవి. సెలవు.!

Sunday, 21 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 45

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు
 హరవిలాస రచనము 
సీ: కలిత శుండాదండ గండూషి తోన్ముక్త
సప్త సాగర మహా జలభరములు ;
వప్రక్రియాకేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీ ధర రత్న మేఖ లములు;
పక్వ జంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్కదంబకములు;
వికట కండూల గండక దేహమండలి
ఘట్టిత బ్రహ్మాండ కర్ప రములు ;
తే: శాంభవీ శంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోప శాంతి గావించుగాక!
హరవిలాసము- అవతారిక- 5వ పద్యము.
కవి సార్వ భౌముఁడు కాశీఖండము ననూదిత మొనర్చి వీరభద్రారెడ్డి కంకిత మొనర్చెనను వార్త దేశ దేశములందు విస్త రించెను. అంత నాతని చిన్ననాటి యనుంగు మిత్రుడు సింహవిక్రమ పురి( ఇప్పటి నెల్లూరు) నివాసి, యవచి తిప్పయ సెట్టి శ్రీనాధుని తమ పట్టణమున కాహ్వానించెను. మిత్రుని యాహ్వనమందుకొన్న శ్రీనాధుఁడించుక యోచించి పాకనాటికి ముఖ్య పట్టణ మైవిరాజిల్లు సింహ విక్రమ పురికి బోవుట కుత్సహించెను. యెంతయైనను మాతృభూమియెడల గల మ మకారమును జూపనివారెవ్వరుందురు? తన చిన్న నాటి నేస్తులను వారి యాప్యాయతలను మదిలోనెంచి , ఆహాకాలమెంత విచిత్రమైనది? యెక్కడి పాకనాడు? యెక్కడి గోదావరీ తీరము? రెడ్డిరాజుల యాశ్రయము లభించుటంజేసి నాజీవన విధానమంతయు మారినదిగదా! నన్నింత వాని నొనరించిన వేమారెడ్జి ప్రభువర్యునకు సదాకృతజ్ఙతాంజలులు. మాతృ భూమిని పై దిదృక్ష నన్నుక్కిరి బిక్కిరి చేయుచున్నది. కాన నొక్కమారు పాకనాటి కేగి మనసార నాప్రాంతములను దర్శించి మగిఁడి వచ్చెదనుగాక! యని నిశ్ఛయంచు కొని వీరభద్రారెడ్డి యానతిచే సింహవిక్రమ పురికి పయనమాయెను.
కతిపయ పరివారముతో శిష్య సముదాయముతో మహదట్టహాసముగా నరుదెంచిన కవిసార్వభౌముని సగౌరవముగా స్వాగతించి తిప్పయ సెట్టి యోగ క్షేమములను విచారించి " మిత్రమా! మీయభ్యుదయమునకు నేనెంతయో సంతోషమున నుప్పొంగి పోవుచుంటిని. వ్యాపారార్ధినై కొమర గిరి రెడ్డి కడకు వచ్చినపుడు తాము రాచకార్య నిమగ్నులయి యుంట విశ్రాంతిగా మాటలాడు నవకాశము లభింపదయ్యెను. నేటికిగదా నాయదృష్టము పండినది . కవిసార్వ భౌమా ! నావిన్నపమును మన్నింపుము;
తే: ఆగమ జ్ఙాన నిధివి తత్త్వార్ధ నిధివి
బహు పురాణజ్ఙుఁడవు, శుభ భవ్య మతివి,
బాలసఖుఁడవు, శైవ ప్రబంధ మొకటి
యవధరిపుము , నాపేర నంకితముగ.
యని సవినయముగ నభియర్ధించెను. "కస్తూరీ కర్పూర చందన తాబూలమును , జాంబూనదాంబరాది వస్త్రాలంకారాదులను నతనికి సమర్పించెను. శ్రీనాధుఁడా మిత్రుని కృతిపతిగా గారవింప నెంచెను. " మిత్రమా నీకోర్కెఫలించునుగాక! నాసర్వేశ్వరానుగ్రహమున ' హర విలాస' మనెడి దివ్యమైన శైవ మహాగ్రంధము నొకదానిని నీపేర వెలయింతును గాక!" యనిపలికి ,కృతిపతికి యాశీస్సులనందించు కావ్య మంగళాశాసనమును యిట్లని యాశువుగా పలికెను.
ఉ:- శ్రీ మహీళా పయోధర హరి న్మణిహారము , హస్తి భూధర
స్వామి, పయోజ సంభవుని జన్నముఁగాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచిశ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
ధీమణి మండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్ధుఁ జేయుతన్; -
అని శుభాశంసనమ్ములం బలికి హరవిలాస రచనమును ప్రారంభించెను. రచన సాగుచునే యున్నది. ఇంతకు నీయవచి తిప్పయ శ్రేష్ఠి చేయువ్యాపారమేమి? రారాజులతో నీతనికి గలసంబంధమేమి యనువిషయములను యించుక బరిశీలింతము. తిప్పయ సెట్టి నెల్లూరు, కాంచీ పట్టణములయందు సుగంధ ద్రవ్యముల నమ్ము బేహారి. కస్తూరీ జవ్వాది చందనము అగరు సాంబ్రాణి పచ్చకప్పురము యాలకులు లవంగములు మొన్నగు సుగింధ వస్తు వ్యాపారములో దిట్ట.
మ: తరుణా సీరి తవాయి గోవ రమణా స్ధానంబులం  జందనా
గరు కర్పూర హిమాంబు కుంకుమ రజః కస్తూరికా ద్రవ్యముల్ ,
శరధిన్ కప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్య కులోత్తముం డవచి తిప్పం డల్పుఁడే యమ్మహిన్;
తరుెణా, చైనా, సింహళము, హవాయి,గోవా, సుమిత్రా , జావా, మున్నగు దేశములనుండి , కస్తారీ, జవ్వాది, కుంకుమపూవు , మున్నగు సుగంధ ద్రవ్యములను , సముద్రమార్గము ద్వారా," కప్పలి- జోగు- లని పేరొందిన నౌకలలో దెప్పించి రారాజులకు సరఫరాయొనర్తెడువాఁడట! వసంత రాయఁడనిపేరొందిన కుమార గిరి రెడ్డికి వసంతోత్సవ నిర్వహణమునకు టన్నుల కొద్దిగా కస్తూర్యాది సుగంధ వస్తువులను సప్లయి చేసెడు వాడట! మన రాజులకేగాక, ఢిల్లీసుల్తాను వారికి, ఫిరోజ్ ఖాన్ గాపేరొందిన గల్బర్గా సుల్తాను వారికి, హరిహరరాయల వారికి నితని సుగంధ వస్తువులు అందించు చుండెడి వాడని హరవిలాస యవరారికా పద్యములు నిరూపించు చున్నవి.
మ: ఖుసిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో , నీకరా
భ్యసన ప్రౌఢి నుతించురా యవచి తిప్పా! చంద్ర సారంగ నా
భి సముద్పాదిత తాళవృంత పవన ప్రేంఖోల్లన ప్రక్రియా
వసరోదంచిత సార సౌరభ రస వ్యాలోల రోలంబముల్;
భావము:- సుల్తాన్ వారు సంతోషంగా కొలువుఁ దీరియుండగా పరిచారికలు తాళవృంతములకు తిప్పయ సెట్టియంపిన కస్తూరిని పూసి గాలివీతురట! అపుడా సువాసనలకు సుల్తాను మైమరచు చుండగా నాసుగంధమునకు సమాకర్షింపఁబడిన తుమ్మెదల దండులా సభాభవనము చుట్టును తిరుగుచుండు దృశ్యమును గాంచి సుల్తానువారు మేలైన సుగంధ ద్రవ్యముల నేరిపంపు నీచేతి గొప్పదనమును ప్ర శంసించు చుందురు లేవయ్యా! యనియీపద్య భావము. ఆవెనువెంటనే హరిహరరాయలు, ఫిరోజ్ ఖాన్ వంటి మహారాజుల ప్రశంసలు యీగ్రంధమున వర్ణింపఁబడినవి. ఇంతటితో నేటికి చాలింతము రేపు హరవిలాసములోని విలాసములను కులాసాగా విని మురియుదము, సెలవు.

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 44

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ: ఆంధ్ర క్ష మా మండ లాఖండలుండైన 
వేమ భూపతి కృపావీక్షణంబు;
ఘోడె రాయాంక! సద్గురు రాజ భీమేశ్వ
రస్వామి పద సమారాధనంబు;
కమలాద్రి నిలయ నార్కండేయ శివమౌళి
చంద్రాంశు నవసుధా సార ధార;
వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ
కల్హార మాలికా గంధ లహరి;
తే: కారణంబులు నుద్బోధ కములు గాగ,
సంభ వించిన సాహిత్య సౌష్ఠ వమున ,
వీరభద్రేశ్వరుఁ బ్రబంధ విభునిఁ జేసి ,
కాశికాఖండముఁ దెనుంగుఁ గానొనర్తు;
కాశీఖండము- అవ- 16 పద్యం ;
భావము;- శ్రీమదాంధ్ర మహాసామ్రాజ్య మునకు యేలిక యైన వేమారెడ్డి కరుణా కటాక్షములును, ఘోడెరాయఁడను బిరుఁదొందిన సద్గురు రాయఁడగు భీమేశ్వరస్వామి పదసమారాధనమును, కమలాద్రి నిలయుఁడగు మార్కండేశ్వర స్వామి జటాజూటమునందలి చంద్రుని తొలివెన్నెలధారలు, వేదాద్రిలో వెలసిన శ్రీ నృసింహ స్వామి మెడలో నలంకరించిన చెంగల్వల దండలోని సువాసనలు కారణములై నాకవితకు పేరరణములైయొప్ప నొదవిన సాహిత్య పుష్ఠిచే వీరభద్రారెడ్డిని కృతిపతి గానొనర్చి కాశికాఖండమును దెనిగింతును. అని భావము. యిందు తన ప్రసిధ్ధికి ప్రత్యక్షముగాను, పరోక్షముగాను దోడ్పడిన వేమారెడ్డిని సంభావించెను. తనకు శివాగమ దీక్షనోసంగిన గురువు వీరభద్ర స్వామికి యంజలి ఘటించెను. మార్కండేయీశ్వరుని, వేదాద్రి నరసింహ స్వామిని ప్రస్తుతించెను .
వేమారెడ్డి కోరికయు తనకార్యమునకు (అనగా కాశీఖండ కావ్యరచనమునకు) అనుకూలముగానుండుటచే కవిసార్వ భౌమున కమితానందము ఘటిల్లెను.
తే: కలిగెఁ బదియారు వన్నె బంగారమునకుఁ
బద్మ రాగంబు తోడి సంపర్క లభ్ధి
కాశికాఖండమను మహాగ్రంధమునకు
నాయకుఁడు వీరభద్ర భూనాధుఁ డగుట!
కవితనయామోదమును దెలుప రాజు కర్పూర తాంబూల సహిత జాంబూ నదాంబరాది కానుక లొసంగి యతనిని బహు ఘనముఁగా సత్క రించినాడు." ప్రభూ తమ యాజ్ఙమేరకు నేటినుండి కావ్య దీెక్షా తత్పరుండనై యనతి కాలములోనే కావ్యమును సంపూర్ణమొనరించి కావ్యాంకిత సభకరుదెమతునుగాక! యనుజ్ఙ వేడెదనని యనుమతినొంది శ్రీనాధుఁడు విడిదికిఁబోయెను.
చ: స్కంద పురాణ సంహితకు ఖండము లేబది;యమదులోన నా
నంద వనానుభావ కధనంబున శ్రోతకు వక్తకున్ శుభా
నంద పరంపరావహము నైజగుణంబగు; కాశిఖండ మా
కందువెఱింగి నేను సమకట్టితి కావ్యముగా నొనర్ప గాన్; 

కాశీఖం-అవ- 8 పద్యం
ఇది స్కాంద పురాణ కధ. స్కాందపురాణ మన్నిపురాణముల కన్నను మిగుల పెద్దది. మనకు లోకప్రసిధ్ధమగు శ్రీరమాసహిత సత్య నారాయణ వ్రత కధయు నందు చెప్పబడినదియే! " ఇతి స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కధాయాం ప్రథమాధ్యాయః సమాప్తః" అనివింటూ వుంటాము. అదిరేవాఖండమునందలిది. యీపురాణమునకు 50 ఖండములుండును . అందు కాశీఖండమొకటి . ఇందు కాశీక్షేత్ర మాహాత్మ్యము తోబాటు యనేక కధలుగలవు.
కాశీఖండము లోని ముఖ్యకధ పరమేశ్వరాగ్రహమునకు లోనై వ్యాసుఁడు కాశిని వీడవలసి వచ్చుట. దీనికి దోడుగా అగస్త్యుఁడు లోకోప రారమునుగోరి లోపాముద్ర తోగూడి కాశినివీడి దక్షిణ కాశిగా ప్రసిధ్ధినొందిన దక్షారామ క్షేత్రమున నివసించుట . వ్యాసుఁడుఁడును సశిష్యముఁగా నటకుయేతెంచుట.ఒకరి కష్టములొకరెరింగి ఉభయు లూరడిలి యాక్షేత్రమునందునివసించుట మొన్నగు విషయములతో గూడియుండును. ఈరెండు గాధలేగాక శివపారమ్యములగు అనేక కధలిందు సందర్భానుకూలముగా వివరింపఁ బడినవి.
కాశీఖండమున క్షేత్ర మహిమయే చెప్పబడినను, అందందు , సాముద్రిక, పాతంజల యోగశాస్త్ర , మంత్రశాస్త్ర విషయములను పొందుపరుపఁబడినవి. ఇట్లీగ్రంధము శ్రీనాధుని ప్రౌఢ కవితాశైలికి మాత్రమేగాక, పాండితీ ప్రతిభకుఁగూడ నికషోపలముగా నొప్పారు చున్నది.
పరమ మాహేశ్వర దీక్షాలోలుడై శ్రీనాధ కవి బహు సమర్ధత తోనీకావ్యమును రచియించెను. పలుకు నుడికారమునగాని కవితాశైలిలో గాని యెక్కడను యతనిప్రౌఢత యించుకంత యేనియు తగ్గక పండితజనైకవేద్యమై " కాశీఖండ మయః పిండమ్" ( కాశీఖండమా? అది యుక్కు గుండువంటిది. ) యను పండితోక్తికి భాజనమై నేటికీ ఆంధ్ర సారస్వతమున నొక విశిష్ఠస్ధానమునకు తావలమై యొప్పారు చున్నది.
శ్రీనాధుఁడీ గ్రంధమును కతిపయ దినములలో పూర్తి యొనరించి వీరభద్రారెడ్డికి యంకితమొనరించి, తనప్రభుభక్తి పరాయణతను వెల్లడించుకొని కృత కృత్యత నొందెను. శ్రీనాధుని జీవన ప్రస్థానము ముగిసిన వెనుక నతని గ్రంధములను విపులముగా విశ్లేషించు తలంపుగలదు గాన నితకు మిక్కిలి దీనిని గురించి నుడువక ముందు కేగుదముగాక! యిప్పట్టున వీరభద్రారెడ్డి కాలమున బ్రాహ్మణుల జీవన మెంత వైభవోపేతముగా నుండెడిదో వివరించు నీసీస పద్యము నుదాహరించు చున్నాడను;
సీ: ధరియింప నేర్చిరి దర్భ వెట్టిన వ్రేళ్ళ
లీల మాణిక్యాంగు ళీయకములు;
కల్పింప నేర్చిరి గంగ మట్టియ మీద
కస్తూరికా పుండ్రకంబు నొసల;
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల
తార హారములు ముత్యాల సరులు;
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుములఁ
గమ్మని క్రొత్త చెంగల్వ విరులు;
తే: ధామముల వెండి పసిడియుఁ దడబడంగ
బ్రాహ్మణోత్తము లగ్ర హారముల యందు
వేమ భూపాలు ననుజన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటము లందు;
కాశీఖండము- అవ- 37 వ పద్యం
ఇంతటితో శ్రీనాధ కవీంద్రుని కాశీఖండ రచనము గూడ ముగిసినది . నేచికింతటితో మన ప్రసంగమును ముగింతము. రేపు తక్కిన విషయములను ముచ్చటింతముగాక! సెలవు!

Friday, 19 June 2015

కవి సార్వభౌముఁడు శ్రీనాధుఁడు - 43

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ: కబరికా భారంబు గై పెక్కు విరులతో 
నవటు భాగంబుపై నత్తమిల్ల;
నలతి లేఁ జెమటచే నసలుకొన్న లలాట
కుంకుమంబునఁ జిన్ని కురులు మునుఁగఁ
బసిఁడి కుండలబోలు పాలిండ్ల భరమున
సన్నపుఁ గౌదీఁగె జలదరింపఁ ;
ధవళ తాటంక రత్న ప్రభా రింఛోళి
గండ స్ధలంబులఁ గౌగిలింపఁ;
తే: కాశికారామ కల్ప వృక్షముల నీడఁ,
గుదప వేళలయందు నాకొన్నవారి ,
కమృత దివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి !
శాశ్వతైశ్వర్యములు కృతి స్వామి కొసఁగు;
భావము:- కాశీవిశాలాక్షిని వర్ణించు సందర్భములోనిది. ఇది కాశీఖండ గ్రంధ రచనమునకు నాంది యగుచుండుటచే, నిటనీపద్యమును పరిచయము చేయుచున్నాను. తలలో నలంకరించు పుష్పభారమున సిగ యొకప్రక్కకు వ్రాలగా, చిరు చెమటచే నుదిటి కుంకుమలో ముంగురులు చిక్కు బడగా, బంగరు కడవలను బోలిన వక్షోజముల బరువుచే సన్నని నడుము వణకు చుండగా, తెల్లని కర్ణభూషణ ముల కాంతిసముదాయములు చెంపలపై చిందులేయగా, కాశీక్షేత్రము నందలి కల్ప వృక్షములనీడలో మధ్యాహ్న సమయమున నాకలి గొన్నవారికి యమృద దివ్యాన్నమును వడ్డించు కాశీ విశాలాక్షి గౌరి కృతి భర్త కు శాశ్వతమైన ఐశ్వర్యములను ప్రసాదించు గాక! యనిదీని భావము.
రాణ్మహేంద్ర వరమున గోదావరీ తటమున విడిసి యున్న కవిసార్వ భౌముని స్వాగతించుటకు కోటనుండి ప్రభువు అల్లాడవీర భద్రా రెడ్డియు, నతని యగ్రజుఁడు వేమారెడ్డియు, మంత్రి సామంతులు, వేదపండితులు, వందిమాగధులు, మంగళధ్వానములు దిక్కులపిక్కటిల్ల నరుదెంచినారు . విప్రులు సుస్వర సంధానులై పురుష సూక్తమును, స్వస్తిక మంత్రములను పఠించు చుండ పూర్ణ కుంభముతో నెదురేగి యతనికిృస్వాగతము బలికిరి. వీరభద్రారెడ్డియు, వేమారెడ్డియు, ప్రేమతో తమిదీర శ్రీనాధుని కౌగిలింతలతో సంభావించి బంగరు పల్లకిలో నెక్కించి పుర వీధులలో ఘనముగా నూరేగించుచు కోటలోనికి గొనిపోయిరి. మార్గమంతయు , వందిమాగధుల జయజయ నినాదములతో, పురజనుల యభినందనలతో మారుమ్రోగుచుండ, శ్రీనాధుని పల్యంకిక నెమ్మదిగా పయనించుచు కోటకు చేరినది. వార కాంతా సందోహ మెదురేగి మంగళ హారతుల బాడుచు కోటలోనికి గొనిపోయిరి. శ్రీనాధుఁడు తనకు స్వాగతించిన ప్రభువునకు, రాజ పరివారమునకు కృతజ్ఙతలు వెల్లడించి తనవిడిది గృహంబునకేగెను .
మరునాఁడు నిండు పేరోలగంబున నుండి వీరభద్రారెడ్డి కవిసార్వభౌమునకాహ్వానమంపెను. శ్రీనాధుఁడు సవినయముగా చిరునగవులు చిందించుచు , సభలోప్రవేశించి ప్రభునకు నమస్కరించి యుచితాసన మలంకరించెను. యంత వేమారెడ్డి కోరికపై విజయనగర ప్రస్థానాది విశేషములను వారికెరిగించెను. నాటితో సభముగిసినది;
విడిది కేగిన శ్రీనాధుఁడు శివపూజాతత్పరత్వమున మునిగి చాలతడవు మంత్ర జపము ధ్యానాది కార్యక్రములయందు నిమగ్నుఁడైయుండెను. యతని వ్యవహారము చూచువారికి వింతగానున్నది. యెల్లవేళల విలాసవంతమైన జీవితమును గడుపగోరెడు శ్రీనాధుఁడేల యిట్లు మారెనోవారికంతు బట్టుటలేదు. ఆమాటలు, ఆవెనుకటి చేతలు యిప్పుడు గానవచ్చుటలేదు. పరమ గంభీరమూర్తియై, నిరంతర మేదో సుదీర్ఘపు టాలోచనలలో మనిగి యుండుట వారికాశ్చర్య జనకమైనది. ధ్యాన నిమగ్నుఁడయి యుండువేళల నాతని హృదయమున కాశీఖండ గ్రంధరచనమునకు జెందిన యాలోచన పొటమరించినది.ఒక్కసారిగా తనరచనలను సింహావలోకన మొనరించుకొన్నాడు.
సీ: చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు
రచియించితిని మరుత్త రాడ్చరిత్ర;
నూనూగు మీసాల నూత్న యవ్వన మున
శాలివాహన సప్తశతి నొడవితి;
సంతరించితి నిండు జవ్వనంబున యందు
హర్ష నైష ధ కావ్య మాంధ్ర భాష;
ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున
గొనియాడితిని భీమనాయకుని మహిమ ;
తే: ప్రాయ మింతకు మిగుల గ్రైవాలకుండ
కాశికాఖండ మను మహా గ్రంధ మేను
దెనుఁగుఁ జేసెద; కర్ణాట దేశ కటక
పద్మ వన హేళి శ్రీనా ధ భట్ట సుకవి;
ఆహా! అప్పుడే వయసు వాటారు చున్నది. ఫలిత కేశములు ప్రారంభ మైనవి . యెంతకాలము శరీరమున నోపిక యుండును!? ఓపికయున్నప్పుడే తలచినకార్యములు పూర్తి యొనరింపవలె. నిక కాశీఖండమును శరవేగముగా రచించి కృత కృత్యతను పొందె దను గాక!యనినిశ్చయిచుకొనెను. శ్రీనాధకవి లోకోత్తరమైన ప్రౌఢ కావ్యరచనకు గడంగెనను విషయము వేమారెడ్డికి దెలిసినది ప్రాప్త కాలజ్ఙుండగు నారెడ్డి ప్రభువు మరునాటి సభలో శ్రీనాధుని యవ్విధమున పొగడుట కుపక్రమించెను.
సీ: వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండ లీలల నొక్క మాటు;
భాషింతు నన్నయ భట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు;
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు;
పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు ;
తే: నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పి నాడవు మాకు నాశ్రితుఁడ వనఘ!
యిపుడుఁ జెప్పఁదొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర!
శా:- ఈక్షోణిన్ నిను బోలు సత్కవులు లేరీ నేఁటి కాలంబునన్,
దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజ ద్వయ కుంభి కుంభ ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ధ్యక్షించున్, కవిసార్వభౌమ! భవ దీయ ప్రౌఢ సాహిత్యముల్!
- అనిపలికి నాడు.
భావము: ఈ రెండు పద్యములను విడదీయవీలుగానివి వేమారెడ్డి పరాక్రమ శీలియేగాక కార్య చాతుర్యము గలవాడు అతడు శ్రీనాధుని ప్రశంసించుచున్నాడు . కేవలము నీవుగొప్పవాడవనుటలేదు. శ్రీనాధుని కవితాగుణములను ముఖ్యముగా పేర్కొను చున్నాడు. " వేములవాడ భీమనవలె ఉద్దండ కవిత్వమును నీవుజెప్పగలవు; నన్నభట్టువలె సంస్కృతాంధ్ర పదసమ్మేళణమున కవిత్వమును జెప్పనోపుదువు. తిక్కన వలెరసోచిత రచనయు నీకు కరతలామలకమే. యెర్రన వలె సూక్తి వైచిత్రతను ఘటియంప నోపెదవు. నీవు సామాన్యుఁడవా! నైషధము మన్నగు రచనల నేక మొనరించిన సుధీమణివి. నీవంటి కవులు లోకముననేడు యెందును గానరారు. దక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరో భామినుల వక్షోజములపై విలసిల్లు కస్తూరీ చందన చర్చల పరీమళవైభవములను శాసించు కవితా పరిమళములు గలవాజవుగదా!
ఇపుడు నీవు రచియించెడు కాశీఖండమను మహాప్రంధమును మాతమ్ముఁడగు వీరభద్రునకు అంకితముగా రచియింపుము" సప్త సంతానములలో కావ్య మొకటిగావున తత్కృతిపతిత్వమున మాకీర్తి యాచంద్ర తారార్కముగా నిలచునట్లు చేయుమని బహువిధముల, శ్రీనాధుని ప్రార్ధించెను".
నేటికింతటితో నీ ప్రసంగమును నిల్వరింతము. రేపు తక్కన విషయములను ముచ్చటించు కొందము గాక! సెలవు

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 42

కవిసార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

కం:- వాాణికిఁ జరణానత గీ 
ర్వాణికి నేణాంక శకల రత్న శలాకా
వేణికిఁ బుస్తక వీణా
పాణికి, స ద్భక్తో ను పాస్తి యొనర్తున్;
హరవిలాసము- అవతారిక- 4వ పద్యం ;
భావము:- పదముల కెఱఁగి నమస్కరించు దేవతలు గలదియు, వాక్ స్వరూపిణియు, ( దేవ భాషారూపిణియు) చంద్రఖండము రత్నాలంకారముఁగా గలదియు, పుస్తకము, వీణయు , హస్తమునందు ధించునదియును, అగు వాగ్దేవతారూపిణి కి వాణికి సద్భక్తి తో నమస్కరింతును . పద్యము చిన్నదే! భావము మాత్రము మిగుల గొప్పది. దేవగణములకన్నింటికి ప్రతిదినము నామెకు నమస్క రింపనిదే గడువదు. వాగ్దేవతగదా! వాక్కు కామ ధేను సదృశము . చక్కని వాక్యములు పలుకగలిగితే కోరిన కోరికలు నెరవేరును. లేదా వ్యతిరేక ఫలములు. కావున నామె యనుగ్రహము దేవతలకైనను యవసరమే! అందరూ నలంకారముఁగా సిగలో పూవులఁ దురిమెదరు. అవి వాడిపోయెడివిగదా! ఈమెధరించు చంద్రఖండము రేయింబవళ్ళు జ్ఙాన జ్యోత్నలను వెదజల్లుచునే యుండును. నుడులే గుడులైన పుస్తముక మును , సంగీత సాధనమగు వీణను చేతబట్టినదనిన, సాహిత్య- సాహిత్య ముల సమాహారమే యామె స్వరూప మని నిరూపణమగుచున్నది. ఇట్లీపద్యము అనవద్యమై హృద్యమై శ్రీనాధవాగ్వైభవ విహారిణి వాణికి మణిహారమై యొప్పారు చున్నది గదా!
మన మిప్పుడు శ్రీనాధుని వెంటఁబయనించు చున్నారము. కవిసార్వ భౌముఁడు సముచిత పరివారముతో, ఛాత్ర గణములు వెబడిరా స్వర్ణ పల్యంకికలో పయనించు చుండెను. శరీరము మాత్రను పల్లకిలోనున్నది. మనస్సు మాత్ర మూహలలో దేలిపోవుచున్నది. ఔరా! యెంత కాలమైనది నేను రాజమహేంద్రమును వీడివచ్చి. ప్రభువు వీరభద్రారెడ్డి యెట్లుండెనో? యతనిభార్య నాసోదరి సమాన యనితల్లి యెట్లున్నదో? ప్రభు సోదరులు యల్లాడ వేమారెడ్డి యెట్లుండిరో? పరివారులెట్లున్నారో? మహామంత్రి బెండపూడివారు కుశలురేగదా నాకేవయసుపైబడుచుండ నప్పటికే వయోవృధ్ధులైన వారెట్టులుందురు?
నిత్యము పావన గోదావరీ వారిలోఁదోగాఁడి , పవీకృతమైన దేహమానసములతో మార్కండేయేశ్వరుని మనసార బూజించి, మదన గోపాలు దర్శన భాగ్యమునంది గృసీమకేగి , పరమ శివుని బూజించి, పంచాక్షరీజప ధానపరాయణఁడనై షడ్రసోచిత భోజనముల నారగించుచు, సుఖముగానుండు నాకేల గౌడ డిండిమునిపై యసూయగలుఁగవలెను? కలిగినదిపో, నేనేల రాజమహేంద్రిని వీడివిజయ నగరమునకేగితిని? నకకాభిషేకమున నాకొరగినదేమి? కవి సార్వభఔమ బిరుదము ఔఎత్సుక్య మాత్ర సంతృప్తని మాత్రమేగదా మిగిల్చినది. సంవత్సరముల తరబడి వరుస ప్రయాణములతో నొడలు హూనమైనవి. అహో! ఆశను, అసూయను , ఆగ్రహము లను జయించినవారేగదా యుత్తములు!
ఇంతక నిన్ని దినములుగా దేశదేశములుఁదిరిగి దిరిగి నేను సాధించినదేమి?" ఇహమేగదా!" మరిపరమో? ఆవగింజంతయైనలేదు. పాజ్ఙులు- యేమనిచెప్పుచున్నారు-
శ్లో: వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్
నిశార్ధ మర్ధం దివసా యతేత
వార్ధక్య హేతో ర్వయసా యతేత
పరత్ర హేతో రిహ జన్మ నాచ! 
- యనిగదా!(వర్షాకాలమున సుఖ పడుటకు తక్కినయెనిమిది నెలలు కష్టపడుము. ( పూర్వకాలమున ప్రయాణ సౌకర్యములు లేమి వర్షాకాలము గ్రామాంతరములకుఁబోయెడివారుగాదు .) రాత్రి సుఖపడుటకు పగలు కషటపడు. ముసలితనమున సుఖపడుటకు వయస్సులో ప్రయత్నించు. పరంకోసం ఇహంలో ప్రయత్నించు అనిశ్లోకార్ధము) విజ్ఙల యభిప్రాయము. మరి యింతదనుక పరార్ధమైనేను ఁజేసినదేమి గలదు? వయసువాటారు చున్నది. ఇకనైన నాప్రయత్నము ననుసంధిపక తప్పదు. ఇట్టియాలోచనలమూలమున శ్రీనాధునిలో కొంత మార్పు యేర్పడినది. వేషభాషల లోనేగాక చిత్తవృత్తిలేనను నామార్పు స్పష్టముగా నగుపడ సాగినది.
వెనుకటివలె నిపుడతడు విషయ లోలుఁడుగాడు. నిరంతర పంచాక్షరీ జప పరాయణఁడు. త్రిషవణ స్నానలోలుఁడు. త్రిసంధ్యావన సంప్రవర్తకుఁడు. మాటలోగాభీర్యము చేతలలోగాభీర్యము, పరాచికములమాటలు తగ్గినవి, వాచాలత మందగించినది. వెనుకటివలెనిపుఁడాతడు కస్తూరీ, చందన చర్చనా లోలుపుఁడు గాడు. మెడలోతారహారములకు బదులు రుద్రాక్షలు చోటుచేసికొన్నవి. నుదుట గంగమట్టితోబాటు భస్మత్రిపుండ్రములు చోటుచేసికొన్నవి. వెనుకటి వలె పట్టుపుట్టముగాక, నుదికిన మడుగు ధోవతులనే గట్టసాగెను. రాజ చిహ్నము లగుటగాబోలు చెవిని నవరత్న కుండలములు, హస్తములకు బంగరు సింహ తలాట కంకణములు మాత్రము మెరయుచు గనబడసాగినవి. ఇట్లు బాహ్య అభ్యంతరమ్ములయందు మార్పు లేర్ప రుపబడిన శ్రీనాధ కవిసార్వభౌముడు కతిపయ ప్రయాణముల గోదావరీ తీరమునకుఁ జేరినాడు.గౌతమీ నదికి అంజలి ఘటించి, వినమిత గాత్రుఁడై మ్రొక్కి గ్రుంకులిడి, తదుపరి తనపరివారముతో నావలపై గౌతమిని తరించి-
సీ: ఉండు నేవీట మార్కండేయ మునినాధ
సజ్జలింగ మనంగ శాసనుండు;
ప్రవహించు నేవీటి పశ్చిమ ప్రాకార
మొరసి గంగమ్మ సాగరుని కొమ్మ;
యావిర్భవిచినాఁడేవీటి కోటలో
బలభేది మదన గోపాల మూర్తి;
పాలించు నేవీటి ప్రాగుద క్కోణంబు
సుమ బోఁటి శ్రీ ముల్లఁగూరి శక్తి;
తే: ప్రబల ధారా సురత్రాణ భద్రజాతి
కరి ఘటాసైన్య దుస్సాధ కనక లోహ
గోపుర ద్వాః కవాట ప్రదీపిత మది,
సాంద్ర విభవంబు , రాజమహేంద్ర పురము!
భావము:- ఏపట్టణంలో మార్కండేయ స్వామి రూపంలో శివుఁడు వెలసి యున్నాడో! సాగరపత్నియగు గోదావరి యేపట్టణమునకు పశ్చిమ తీరమున ప్రవహించు చున్నదో, మదన గోపాలస్వామిపేరున నేవీటికోటలో విష్ణువు కొలువై యుండునో, ముల్లంగూరమ్మ పేరుతో తూర్పు దిశాభాగము నేశక్తి రక్షించు చుండునో, మదజలధారలతోనొప్పు సుల్తాను వారి భద్ర గజములు గూడ భేదింపలేని లోహనిర్మిత ప్రాకార ద్వార ములచే నొప్పు మహావైభవమైనది. రాజమహేంద్ర వరము. అనిదీనిభావము:
అట్టి దుష్ ప్రవేశమైన రాజమహేంద్రమును శ్రీనాధుఁడుచేరెను. నేటికింతటితో మనప్రసంగమును ముగింతము. రేపు తక్కిన విషయములు ముచ్చటింతముగాక! సెలవు!

Wednesday, 17 June 2015

కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు - 41

కవిసార్వ భౌముఁడు శ్రీ నాధుఁడు 

సీ: సింహాసనము చారు సితపుండరీకంబు ,,
చెలికత్తెఁ జెలువారు పలుకుఁజిలుక;
శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు ,
పసిఁడి కిన్నెర వీణ పలుకుఁ దోడు ,
నలువ నెమ్మోముఁ దమ్ములు కేళి గృహములు ,
తళుకు టద్దంబు సత్కవుల మనసు;
వేదాది విద్యలు విహరణ స్ధలములు,
చక్కని రాయంచ యెక్కిరింత ;
తే: యెపుడు నేదేవి, కాదేవి యిందు, కుంద,
చంద్ర , చందన, మందార, సార వర్ణ
శారదాదేవి! మామక స్వాంత వీధి
నిండువేడుక విహరించు చుండుఁ గాక!
శృంగార నైషధము - ప్ర- ఆ: 5ప;
భావము:- సితపుండరీకమే సిహాసనము గా విరాజిల్లునదియు, కమ్మని మాటలఁబలుకు చిలుక నెచ్చెలి యైనదియు, చందమామ యే అలంకరణ పుష్ప మైనదియు, బంగరు కిన్నెర వీణయే సంగీత సాధనమైనదియు, నలువ( బ్రహ్మ- నాలుఁగు మొగములవాఁడు) మోముదామరలే పడకటిళ్ళుగా నొప్పు నట్టిదియు, సత్కవుల మనస్సే తళుకు టద్దముగా నెంచెడిదియు, వేదము మున్నగు విద్యలే విహార ్ధలములుగా గలదియు, చక్కని రాజహంస వాహనముగా నొప్పునదియు, నయి, యేదేవి విరాజిల్లునో , "చంద్రునివలెను, మొల్లపూవువలెను, మంచిగంధమువలెను, మందారమువలెను, తెల్లని వర్ణమున ప్రకాశించుచుండునో యట్టి యాశారదాదేవి , నాహృదంతరమందు సదా పరిపూర్ణమైన ఆనందముతో విహరించు చుండు గాక! " చదువులతల్లి, నలువరాణి , వేదస్వరూపిణి, యైన సరస్వతీ మాతను వర్ణించు పట్ల శ్రీనాధునిలో నొక వైయక్తికత , విలక్షణత, మనకు గనిపించును. యాజగదేక మాతను స్వరూప స్వభావ సహితముగా మహోదార వైభవ సహితగా వర్ణించును. ఈపద్యము నందలి యెత్తుగీతిని బరిశీలింపుడు. "ఇందుకుందమొదలు - సారవర్ణ" వరకు. తదివినారుగదా! మీకేమనిదోచుచున్నది? పోతనగారి "శారద నీరదేందు" పద్యము గుర్తుకు వచ్చుటలేదా? అందొకరూపవర్ణనమేగలదు; దానికీపద్యము దారిజూప నోపిన నోపవచ్చునేమో? అస్తు! ప్రస్తుతము ననుసృరింతము.
శ్రీనాధుఁడు కొండవీటిలో లేనికాలమున నారాజ్యముపయి కుకవుల దాడి యెక్కుడైనది. దానికికారణమారెడ్డిరాజుల యౌదార్యమేననుట నిస్సంశయము. రెడ్డి రాజులు తక్కిన రాజుల వంటివారు గారు మిక్కిలి ధర్మపరాయణులు. తాముప్రభువులరైనను , అట్లు భావించక తాము ప్రజలకు ప్రతినిధులమని భావించుచుడెడివారు. ప్రజావిత్తమునకు, ధర్మపరిరక్షణకుమాత్రమే తమయధికారమును వినియోగించెడివారు. వారు సాహిత్యప్రియులు , వేదసంస్కృతియెడల యారాధనాభావముఁగలవారు. అందుచేతనే వారిరాజ్యమున వేదవిప్రులకు, పండితులకు, కవులకు, ఘనసన్మానములు జరుఁగు చుండెడివి. తరచుగా యోగ్యులకు దేవాలయములకు అగ్రహారము లొసంగబడుచుండెడివి. ఆయధికారము విద్యాధికారిది. విద్యాధికారియామోదమునందిన తరువాతనే యతనికి రాజదర్శన భాగ్యము. అటుపిమ్మటనే సత్కారము. ఇదీయచటి పధ్ధతి. శ్రీనాధుఁడింత దనుక విజయ యాత్ర కేగినాడుగదా! యిక మిడతల దమడువలె కొండవీటిపై కుకవుల దాడి ప్రారంభమైనది. యవీధిలోజూచినా వారే ! చివరకిది ప్రభువులకుఁ దలనొప్పిగాఁబరిణమించినది. శ్రీనాధుఁడు వచ్చిన వెంటనే యిది గమనించినాఁడు . అతనికి వారినిజూడవెగటు బుట్టినది . చివరకు- " భోజనం దేహి రాజేంద్ర " వంటి వారందరూ మహాకవులమని చాటుకొను చుండ వారిని వెక్కిరించుచు, శ్రీనాధుఁడు-
ఉ: బూడిద బుంగవై యొడలు పోడిమిఁప్పి మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొ చోయనన్
గోడల గొందులం దొదిగిఁ గూయుచు నుందువు కొండవీటిలో
గాడిద! నీవునుం గవివి గావు గదా? యనుమాన మయ్యడిన్;
యనివారిపై యప్రతిహతమగు తనచాటుపద్య బాణమును ప్రయోగించినాడు. శ్రీనాధుని రాకతో కుకవులకు ప్రాణము పోయినట్లయినది. యెక్కడి వారక్కడగా చెల్లాచెదరైనారు. కవిసార్వభౌముని సారధ్యమున తిరిగి విద్యాకార్యక్రమము లారంభమయినవి. యోగ్యులైన కవిపండితులకు తగిన సత్కారములు జరుపబడు చున్నవి. తక్కినవారు కేవల సంభావన మాత్రమున సంతుష్ఠులయి వెనుఁదిరుగు చుండెడి వారు. ప్రభువర్యుని చిత్తమునకు వూరట లభిచినది. కవిసార్వభౌముఁడు ప్రతిదినమును పండితులతో గలసి శాస్త్ర చర్చల తోను , యెడనెడ విశ్రాంత సమయమున ప్రభువునకు పురాణాదికములను వినిపించుటతోను, చక్కని సంస్కృత గ్రంధములను జదివిచెప్పుట తోను, వినోదమును గల్పించు చుండెను.
కతిపయ దినము లిట్లు గ్రమియంప శ్రీనాధునకు రాజమహేంద్ర వరముృపై మనసు మరలెను. ఒకానొక శుభముహూర్తమున వేమారెడ్డికడ రాజమహేంద్ర వరమునకేగ యనుమతిని గోరెను. పండిత పక్షపాతియు, నాశ్రిత కవిజన ప్రియుఁడు నగు వేమారెడ్డి సబహుమానముగా రాజమహేంద్రి కేగుటకు శ్రీనాధున కనుమతియొసంగెను. ప్రయాణమునకు వలయు నేర్పాటు గావించి ముందుగా శ్రీనాధుని రాకను రాజమహేంద్రవర పాలకుఁడగు వీర భద్రారెడ్డికి వర్తమాన మంపెను. శ్రీనాధు డంత నొకశుభ దినమున సపరివారుఁడై రాజమహేంద్ర వరమునకు పయన మయ్యెను .

Tuesday, 16 June 2015

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 40

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు 
సీ: రాజీవ భవుని గారాపుఁ బట్టపు దేవి ,
యంచ బాబా నెక్కు నలరుఁ బోణి;
పసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాఁగ ,
పదునాల్గు విద్యల పట్టుఁ గొమ్మ;
యీరేడు భువనంబు లేలు సంపద చేడె,
మొలక చందురుఁదాల్చు ముద్ద రాలు;
వెలిచాయ కొదమరా చిలుక నెచ్చెలి కత్తె ,
ప్రణవ పీఠిక నుండు పద్మ గంధి ;
తే: మంధరాచల కంధర మధ్యమాన
దుగ్ధ పాదోధి లహరి కోద్భూతయైన
లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగు
వరదయై మాకు వినత గీర్వాణి వాణి!
భావము:- బ్రహ్మ దేవుని ముద్దుల భార్య, యంస వాహన మెక్కు పూబోణి. బంగరు వీణ వాయించు జవ్వని, పదునాల్గు విద్యలకు ఆధారమైనది. యిరు+ ఏడు - పదనాల్గు లోకములను పాలించు లక్ష్మికి నెచ్చెలి, చంద్ర రేఖను ధరించెడు ముద్దరాలు. తెల్లని పరువము గల రాచిలుకకు ప్రియ సఖి, ప్రణపీఠంలో(ఓంకార నాదమందు) నివసించు పద్మ గంధి.
మందరాచల సదృశమైన నడుమున నొప్పుచు, పాల సంద్రపు టలల నుండి యుద్భవించినదియు, సుందరమైన సాహిత్య పు సంపదలతో లోరహితముల నొసగు గీర్వాణి వాణి మాకు వరదాయిని యగునుగాక! యని దీనిభావము. శ్రీనాధుని వర్ణావైభమునకు కాణాచి యైన యీపద్యము సకల విద్యా రాణి వాణిని వర్ణించిన పద్యములలో నద్వితీయమైనది; ఇకప్రస్తుతము -
మరునాడు వేమారెడ్డి నిండు కొలువున గూర్చుండి , కవిసార్వభౌమునకు కబురంపినాడు. శ్రీనాధుఁడు అనుష్ఠానమును ముగించుకొని ప్రతీహారులు దారిఁజూపఁగా , వందిమాగధులు జయజయధ్వానములను సేయుచుండగా చిరునవ్వులు రువ్వుచు సభలో ప్రవేశించి రాజసమీపమున గల యుచితాసనము నలంకరించెను. వేమారెడ్డి యాతనిని బహుథా ప్రశంసించి , మనశ్రీనాధ కవి చంద్రు లిప్పుడు సుకవి జన సార్వభౌములైనారు. నేటినుండి మనము వారినట్లే సంభావింతుము గాక! యిది వారియొక్కరి విజయమేగాక, మనకొండవీటి రెడ్డి రాజ్యమున కంతటికిని సమకూరిన యఖండవిజయము విద్యాధికారులై వారుమన కొలువున నుండుట మనయందరి యదృష్టము. ఇంతటి మహావిజయమును సమకూర్చి మనకు మనరాజ్యమునకు యఖండ గౌరవ మాపాదింపఁజేసిన కవిసార్వభౌముల కిదియే మాఘన సన్మాన మనుచు, కర్పూర తాంబూల సహితముగా కొంత సువర్ణ మును బంగరు పళ్ళెర మందుంచి దుశ్శాలువను గప్పి యతనిని ఘనముగాసత్కరించెను,
సత్కారానంతరము వినయ వినమిత గాత్రుఁడయి కవిసార్వ భౌముఁడు " ప్రభూ! మీయండ దండలు లేనిచో నాకీ కార్యము సాధ్యమయ్యెడిదా! యసాధ్యమైన దానిని మీదయతో సుసాధ్య మొనరింప గలిగితిని. ఇదియంతయు తమ యనుగ్రహమే! అందుకు సర్వదా తమకు కృతజ్ఙుఁడను. తమదయ నెల్లవేళలనిటులే నాయందుంచుడు; నేను కవిసార్వ భౌముఁడనైనను తమ కొలువున నెప్పటియట్ల భృత్యుఁనే! " యనిపలుక వేమారెడ్డి సంతసించి యతని విజయ యాత్రావిశేషములను సవివరముగా వినగోరెను. శ్రీనాధుఁడును ప్రభువునకు సభ్యులకు నమస్క రించి జగదంబ యగు సరస్వతీ మాతను మనసార ప్రార్ధించి తనవిజయ గాధను సర్వమును సవివరముగా వివరించెను.
యాత్రా కధనము పూర్తియైన వెనుక వేమారెడ్డి " కవిసార్వభౌమా! తమరు విజయ నగరము నుండి మగిడి వచ్చుచు మనవైరి కూటమికిఁజెందిన రాచకొండ దుర్గమున కేగుటయేగాక, యాసింగమ భూపాలుని సర్వజ్ఙుఁడని బొగడినారట! కొండవీటి విద్యాధికారులగు మీకిది యుచితమా? యనిప్రశ్నించెను. శ్రీనాధుని యూహ నిజమైనది యీవిపత్తును ముందు యూహించినదే గదా!
ప్రభువుల సంప్రశ్నమునకు శ్రీనాధుడెంతమాత్రము వెరగు పడలేదు. చిరువగవులు చిందించుచు, " ప్రభూ! యేమిసేతును పరిస్థితు లట్లొనరించినవి. అదియుగాక, నతనిని మంచిమాటలతో మనపక్షమునకుఁద్రిప్పుటకు ప్రయత్నము జేయుట కదియే తగిన యదననిభావించితిని. యతనియాహ్వానమును మన్నించి రాచకొండ కేగినమాట వాస్తవము. నేనేదో యతనిని పొగడి పొగడి పెద్దనొనర్చితి నను మాటమాత్రమ యదార్ధము. సింగమనీనికి ' సర్వజ్ఙ' బిరుదమున్నది. అదియతడు తనకు తానై వరించినాడో లేక యాశ్రిత బృందమిచ్చిరో దెలియదు. దాని నుపయోగించుకొని నేనతనిని వెక్కిరించి, వెర్రినిఁ జేసివచ్చితిని. అజ్ఙత చేనతఁడాపద్యములోని భావము నేమాత్ర మెరుంగక నన్ను సత్కరించినాడు. ప్రభూ! తమరా పద్యమును చిత్తగింపుడు ,

కం:-
సర్వజ్ఙ! నామధేయము శర్వునకే!
రావు సింగభూపాలునకేయుర్వింజెల్లును?
తక్కొరు సర్వజ్ఙుండనుట,
గుక్క గుక్క సామజ మనుటే!
యనిగచ్చిగా చదివెను. అదివిని సభ్యు లెల్లరు హర్ష ధ్వానము లొనరింప సభయంతయు నవ్వులతో మారుమ్రోగెను. ఇంతకు కాకుస్వరమును మార్చి చదువుటచే నాపద్యమందలియర్ధమంతయు పూర్తిగామారిపోయినది. " సర్వజ్ఙుఁడను పేరుయీశ్వరునకొక్కరికే తగును, అట్లుగాక నితరులను సర్వజ్ఙుఁడనిన, కుక్కను యేనుఁగని చెప్పినట్లగును." అనగా- సర్వజ్ఙుఁడననిపేరు పెట్టుకొన్నంత మాత్రమున యీశ్వరుఁడొక్కడు దక్క తక్కనవారు సర్వజ్ఙులగుదురా? కుక్క కుక్కే! యేనుగు యేనుగే! కుక్కనుజూపి యేనుగన్న నెట్లగును? " అనిదీని భావము!
ఔరాశ్రీనాధా! యెంత చమత్కారివయ్యా! అందుచేతనే నీవు కవిసార్వ భౌముఁడవైనావు. నీముందెవ్వరాగ గలరయ్యా! నీధిషణకు నానమస్కార సహస్రంబులు. వేమారెడ్డి పరమానంద భరితుఁడై లేచివచ్చి శ్రీనాధుని కౌగిలితో సంభావించెను. " నోరున్న దలకాయు నను లోకోక్తి యదార్ధ మైనది గదా!
నేటి కింతటి తోమన ప్రసంగము నాపుదము రేపు తక్కిన విషయములను ముచ్చటింతుముగాక! సెలవు!

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు - 39

కవి సార్వ భౌముఁడు శ్రీనాధుఁడు

సీ:- పర రాజ్య పర దుర్గ పర వైభవశ్రీలఁ 
గొనగొని విడనాడు కొండవీడు;
పరి పంథి రాజన్య బలముల బంధించు
కొమరు మించిన జోడు కొండవీడు;
ముగురు రాజులకును మోహంబు పుట్టించు
గుఱుతైన యుఱి త్రాడు కొండవీడు;
చటుల విక్రమ కళా సాహసం బొనరించు
కుటిలాత్మకుల గాడు కొండవీడు;
తే: జవన ఘోటక సామంత సరస వీర
భట సటానేక హాటక ప్రకట గంధ
సింధు రారవ యోహన శ్రీలఁ దనరు
కూర్మి నమరావతికి జోడు కొండ వీడు!
భావము:- శత్రురాజ్యములను ,శత్రు దుర్గముల వైభవ లక్ష్మని జయించి తనలో చేర్చుకొను నట్టిది ఈకొండవీడు . శత్రు సైనికులను బంధించి యుంచుటకు దగిన శక్తి యుక్తులకు నెలవైనది యీ కండవీడు.
కాకతి, విజయనగర, బహమనీ, రాజులకు మోహము ననుసంధింప జేయు యుఱిత్రాడును బోలినది యీకొండవీడు. భయంకరమైన యుధ్ధ కళాపాటవంతో ఆక్రమింపఁ జూచే మోసకారులను బొంద బెట్టు మరుభూమి యీకొండవీడు. యవనాశ్వ ములతోడను, సామంత రాజులతోడను, సరస వీరభట సముదాయముల తోడను, మదగజముల ఘీంకారముల తోడను గూడి యుండి , యుధ్ధ వైభములకు నెలవయి, దేవతా రాజధాని యమరావతికి దీటైనది యీకొండ వీడు. (అరివీరులకు సాధింప నలవిగానిదని యీపద్య భావము.)
ఈకొండవీడు రెడ్డి రాజుల సామ్రాజ్య వైభవమునకు పట్టుఁగొమ్మ . మన నిప్పుడు శ్రీనాధునితో కొండవీటి మార్గమును యనుసరించుచున్నారము .రాచకొండ దుర్గమునకు వీడ్కోలు పలికిన , కవిసార్వ భౌముఁడిక తడవుసేయక స్వ రాజ్యమునకేగ నభిలషించినాడు యనుకున్నది దైవ సహాయమున మిత్ర సహాయమున సాధించినాడు పంతము దీరినది. వంత యంతయు దొలగినది పండిత వైరియగు డింఢిముని పరాజయము ఘటింపబడినది. కనకాభిషేకగౌరవ మందినది. కవిసార్వ భౌమబిరుదమా యడుగకుండగనే లభించినది. దిగ్దిగంత విశ్రాంతముగా సత్కీర్తి నలుదిక్కుల వ్యాపించినది. జన్మ చరితార్ధమైనది. ఇక శేషించిన కార్య మేమి గలదు? తనకు విద్యాధి కారి పదవినొసగి యింతకాలమును పోషించిన రెడ్డి రాజ్య సార్వ భౌముని దర్శించి సంభావించవలె, నిక తడవుసేయక కొండవీటి కేగుట తన తక్షణ కర్తవ్యముగా శ్రీనాధుఁడెచినాడు. పరివారమును హెచ్చరించినాడు. " ఇక వేగముగా ప్రయాణమును నడిపింపుఁడు. మీలోనెవరో యొకరు శీఘ్రముగా కొండవీటి కేగి ప్రభువులకు నారాక నెరింగింపుడు " అని పలుక భటులలో నొకడు అశ్వముపై వడివడిగా ముందున కేగి కొండవీటి మార్గమున ముందుకేగెను.
" ఆహా! యెంతకాలమైనది కొండవీటిని విడచి? ప్రభువులెట్లున్నారో? రాచరికపు పరిస్థితులెట్లున్నవో? నాపండిత విజయము. కనకాభిషేకము, కవిసార్వభౌముఁడనగుటయు , ప్రభులకు ఆనంద సంధాయకములై యుండును. రాచకొండ దుర్గమునకు బోవుట ప్రభువుల కాగ్రహ కారణము గానోపును. అయిన నేమగును ' నోరున్నఁ దలకాయును గదా! యెట్లో యుపాయాంతరమున ప్రభువులను ప్రసన్నులను గావింపవలె ' ననిలోఁదలపోయుచు శ్రీనాధుఁడ ప్రయాణమును గొనసాగించెను .
శ్రీనాధుని యాగమన వార్త రెడ్డిరాజులకు పరమానంద సంధాయకమైనది. స్వాగత సత్కారములకై ఘనముగా నేర్పాట్లుఁగావించిరి. వేమారెడ్డి వేదపండితులతో గలసి స్వయముగా పూర్ణ కుంభ స్వాగతమును బలుకుటకై కాచుకొని యుండెను . దేనికైన నదృష్టముండవలె ! శ్రీనాధుఁడు మిగుల నదృష్టశాలి. లేకున్న నొక సామాన్య మండలాధీశునికడ నుద్యోగించు నతడెక్కడ? కర్ణాటక సార్వభౌములచే కనకాభిషేక గౌరవ మందుట యెక్కడ? ఇక కవిసార్వభౌమ బిరుదమా ! యాతనికీర్తికీరీటమున కలికి తురాయి వంటిది. వీటికి మూల మాతని యదృష్టమేననుట నిక్కముగదా!
అదిగో శ్రీనాధుని స్వర్ణ పల్యంకిక కొండవీటిని జేరినది. ప్రభువు వేమారెడ్డియు నతనిపరివారమును, రాజబాంధవులును ,బ్రాహ్మణ బృందమ్ములును యెదురేగుచున్నారు. పురుష సూక్త సమన్వితముగ బ్రాహ్మణు లేదురేగ స్వాగత సత్కారములను పచరించు చున్నారు. " కవిసార్వ భౌమా! శ్రీనాధకవీంద్రా! బహుపరాక్ బహుపరాక్ కవిసార్వభౌమా! శ్రీనాధ కవిశేఖరా! జయీభవ! విజయిభవ! యను వంది మాగధుల నినాదములతో పరిసరములు మారుమ్రోగు చుండ, వేమారెడ్డి స్వయముగా కేలందించి శ్రీనాధ కవిసార్వభౌములను రాజమందిరమునకుఁ దోడ్కొని బోయునారు; యుచితాసనమున గూర్చుండఁజేసి, సమీపమున నుప విష్టుఁడయి, వేమారెడ్డి ముందుగా కుశల ప్రశ్నాదికములను నిర్వ హించి, నేటికి విశ్రాంతిని గైకొనుడు. మార్గాయాసమున బడలినారు. రేపు సావధానముగా మాటలాడు కొందమని పలికి నిజమంగిరమున కేగెను.
ఇంతటినేటికి విరమింతము రేపు తక్కినది ముచ్చటింతము సెలవు !